‘నూరు చిత్రాలు పూర్తి చేయాలి’
పన్నెండేళ్ల కాలంలో 92 చిత్రాలు నిర్మించి, తెలుగు సినిమా వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకొన్న నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ నూరు చిత్రాలు పూర్తి చేయాలని తమిళనాడు మాజీ గవర్నర్‌ రోశయ్య కోరారు. అలా సెంచరీ పూర్తి చేయడమే కాకుండా వచ్చే పదేళ్లలో మరో వంద సినిమాలు నిర్మించాలని ఆయన అభిలషించారు. ఈ సందర్భంగా రామసత్యనారయణకు ధ్రువీకరణ పత్రాన్ని ఆయన అందజేశారు. సోమవారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న దర్శకుడు వినాయక్‌ మాట్లాడుతూ ‘ మా నాన్నగారికి రామసత్యనారాయణగారంటే ఎంతో అభిమానం. ఆయన్ని మా చాగల్లులో సన్మానించాలని ఆయన అనుకొనేవారు. రామసత్యనారాయణ వంద సినిమాలు పూర్తి చేయగానే ఆయన్ని చాగల్లు తీసుకెళ్లి ఘనసన్మానం చేస్తాను’ అని ప్రకటించారు. చివరగా రామసత్యనారాయణ మాట్లాడుతూ ‘ ఇంతమంది ప్రముఖుల సమక్షంలో ఈ కార్యక్రమం జరగడం నా పూర్వజన్మ సుకృతం. ఈ స్ఫూర్తితో మరిన్ని సినిమాలు తీస్తాను’ అన్నారు.