సునీల్‌ హీరోగా మరో సినిమా!
హీరో సునీల్‌ స్పీడ్‌ పెంచారు. ఆయన నటించిన ‘ఉంగరాల రాంబాబు’ చిత్రం శుక్రవారం విడుదలవుతోంది. మలయాళ చిత్రం ‘టూ కంట్రీస్‌’ ఆధారంగా రూపుదిద్దుకొంటున్న చిత్రంలోనూ సునీల్‌ నటిస్తున్నారు. దర్శకుడు ఎన్‌.శంకర్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం విడుదల కోసం తుదిమెరుగులు దిద్దుకుంటోంది. తాజాగా ఇప్పుడు మరో రీమేక్‌ చిత్రంలో నటించడానికి సునీల్‌ అంగీకరించారు. 2014లో తమిళంలో విడుదలై విజయం సాధించిన థ్రిల్లర్‌ ‘శతురంగ వేట్టై’ ఆధారంగా రూపుదిద్దుకొనే ఈ చిత్రాన్ని రమేశ్‌ పిళ్లై అభిషేక్‌ ఫిల్మ్స్‌ పతాకంపై నిర్మించనున్నారు. ఈయన ఇంతకుముందు రాఘవలారెన్స్‌ నటించిన ‘శివలింగ’ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించారు. శ్రీదేవి మూవీస్‌ అధినేత శివలెంక కృష్ణప్రసాద్‌ సమర్పణలో రూపుదిద్దుకొనే ఈ సినిమాతో గోపీగణేశ్‌ దర్శకునిగా పరిచయమవుతున్నారు. అక్టోబర్‌ మొదటి వారంలో షూటింగ్‌ ప్రారంభమయ్యే ఈ చిత్రానికి సంగీతం మణిశర్మ.