దేశ రాజధానిలో అఖిల్‌
అక్కినేని అఖిల్‌ ఇప్పుడు ఢిల్లీలో ఉన్నారు. ఆయన నటిస్తున్న తాజా సినిమా ‘హలో’ షూటింగ్‌ అక్కడ జరుగుతోంది. ‘మనం’ ఫేమ్‌ విక్రమ్‌ కె. కుమార్‌ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై అక్కినేని నాగార్జున నిర్మిస్తున్నారు. మలయాళ దర్శకుడు ప్రియదర్శన్‌ కుమార్తె కల్యాణి ప్రియదర్శన్‌ నాయికగా పరిచయమవుతోంది. నాగార్జున నటించిన ‘నిర్ణయం’ చిత్రంలోని ‘హలో గురూ ప్రేమకోసమేరోయ్‌ జీవితం’ పాటలోని తొలి రెండక్షరాలతో ఈ చిత్రానికి ‘హలో’ అని పేరు పెట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఢిల్లీలో సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఇంకో రెండు పాటలను తెరకెక్కించాల్సి ఉంది. అక్టోబర్‌ 15కి షూటింగ్‌ పూర్తవుతుంది. ‘హలో!’ను డిసెంబర్‌లో విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో మరో నాయికగా నివేదిత సతీశ్‌ను ఎంపిక చేసినట్టు వార్తలొచ్చాయి. దీని గురించి చిత్ర యూనిట్‌ స్పందిస్తూ ‘‘ఇది రెండేళ్ల నాటి మాట. అఖిల్‌ పక్కన జోడీని ఎంపిక చేసే క్రమంలో నివేదిత పేరును కూడా పరిశీలించాం. కానీ ఆ స్థానంలో కల్యాణి ప్రియదర్శన్‌ను తీసుకున్నాం. మా చిత్రంలో ఇద్దరు నాయికలు లేరు. ఉన్నది ఒకటే నాయిక’’ అని చెప్పారు.
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.