తన ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన ‘అర్జున్‌రెడ్డి’ హీరోయిన్ శాలినీ
‘అర్జున్‌రెడ్డి’ హీరోయిన్ శాలినీ పాండే నెల్లూరులో అస్వస్థత గురైన విషయం తెలిసిందే. నెల్లూరులో ఓ సెల్‌పాయింట్‌ను ప్రారంభించడానికి వెళ్లిన శాలినీ.. అక్కడ అస్వస్థతకు గురవడంతో నగరంలోని బొల్లినేని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. చికిత్స అనంతరం గంట తర్వాత ఆమెను డిశ్చార్జి చేశారు. శాలినీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయి కారులో వెళుతున్న ఓ వీడియోను లోకల్ న్యూస్ చానెల్ ప్రసారం చేసింది.
 
ఆసుపత్రి నుంచి ఆమెను డిశ్చార్జి చేసే సమయంలో స్ట్రైచర్‌పై తీసుకురావడం, ఆమె ముఖం కనిపించకుండా తెల్లటి వస్త్రంతో శరీరమంతా కప్పి ఉంచడం ఆ వీడియోలో ఉంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమెకు ఏమైందోనని అభిమానులు ఆందోళన చెందారు. చాలామంది తనకు ఫోన్లు చేసి పరామర్శిచడంతో ఆమె నేరుగా ఫేస్‌బుక్ లైవ్‌లోకి వచ్చి తనకు ఏం కాలేదని, బాగానే ఉన్నానని క్లారిటీ ఇచ్చింది.
 
ఈ రోజు ఉదయం జ్వరం, తలనొప్పి రావడంతో ఆసుపత్రికి వెళ్లానని, అక్కడ చికిత్స తీసుకున్నాక తన ఆరోగ్యం బాగుందని శాలినీ చెప్పింది. తనకు కొత్త అవకాశాలు వస్తున్నాయని, ప్రస్తుతం ‘మహానటి’లో నటిస్తున్నానని చెబుతూ.. త్వరలోనే తన కొత్త సినిమాల సంగతులను బయటపెడతానని చెప్పుకొచ్చింది శాలినీ. తన ఆరోగ్యం బాగానే ఉందని, ఎవరూ ఆందోళన చెందొద్దని అభిమానులకు సూచించింది.
 
 
Tags :Shalini Pandey, Arjun Reddy Movie, heroine, Nellore, Health, clarity