ఆ సినిమా తప్పకుండా చేస్తా: ఎన్టీఆర్ హామీ
నందమూరి తారకరామారావు నట వారసుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్ తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూ నంబర్ వన్ హీరోగా ఎదిగాడు. టెంపర్ తర్వాత సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతున్న ఎన్టీఆర్ ప్రస్తుతం డైరెక్టర్ బాబీతో ‘జైలవకుశ’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటూనే ‘బిగ్‌బాస్’ రియాలిటీ షో చేస్తున్నాడు ఎన్టీఆర్. ఈ షో ఆదివారం రాత్రి ఘనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ షోలో పార్టిసిపేట్ చేయబోతున్న 14 మందినీ ఎన్టీఆర్ ఎంతో ఆప్యాయతతో ఆహ్వానించారు.
 
ఈ సందర్భంగా పదో కంటెస్టంట్‌గా వచ్చిన యాంకర్ కత్తి కార్తిక ఎమోషన్ అయ్యారు. ఎన్టీఆర్-సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ‘నాన్నకు ప్రేమ’తో సినిమాను కుటుంబం మొత్తం చూశామని, తన కుమారుడు ఆ సినిమా చూసి చాలా ఎమోషన్ అయ్యాడని ఆమె చెప్పారు. ‘‘అమ్మా.. నేను త్వరగా పెద్దవాణ్ని అవుతా. నిన్ను బాగా చూసుకుంటా’’ అని పదేపదే తనతో అంటున్నాడని కార్తిక ఎన్టీఆర్‌తో చెప్పారు. ‘నాన్నకు ప్రేమతో సినిమా తీసిన మీరే అమ్మకు ప్రేమతో సినిమా తీయాల’ని కార్తిక కోరడంతో ‘తప్పకుండా ఆ సినిమా తీస్తానమ్మా’ అని ఎన్టీఆర్ హామీ ఇచ్చారు.
Tags :jr.ntr, Naannaku Prematho, cinema, Sukumar, Kathi Karthika