‘ఏబీఎన్’తో మనసు విప్పి మాట్లాడిన రవితేజ తల్లి రాజ్యలక్ష్మి
భరత్ అంత్యక్రియల వ్యవహారంతో వివాదానికి కేంద్ర బిందువుగా మారాడు మాస్ హీరో రవితేజ. ఆ వివాదం సమసిపోక ముందే టాలీవుడ్‌ను కుదిపేసిన డ్రగ్స్ కేసుతో రవితేజ పేరు మరోసారి వార్తల్లో వినిపించింది. ఈ రెండు విషయాలపై రవితేజ తల్లి రాజ్యలక్ష్మి ఏబీఎన్‌తో మనసు విప్పి మాట్లాడారు.
 
‘‘రవితేజ పేరు డ్రగ్స్ కేసులో వినిపించడం షాక్‌కి గురిచేసింది. రవితేజకి డ్రగ్స్ వాడే అలవాటు లేదు. ప్రస్తుతం రవితేజ ఔటడోర్ షూటింగ్‌లో ఉన్నాడు. భరత్ ముఖం ఛిద్రమయ్యిందన్న కారణంగానే ఆఖరి చూపు చూడలేదు. కానీ ముఖం బాగానే ఉందని ఆ తర్వాత తెలిసింది. నేను, మా వారు చూడలేకే అంత్యక్రియలకు హాజరు కాలేదు. భరత్ ఫోన్‌ను పోలీసులు ఇంతవరకు మాకు ఇవ్వనిమాట నిజమే. భరత్ ఫోన్ హిస్టరీ చూసే డ్రగ్స్ కేసు మొదలయ్యిందన్న విషయం నాకు తెలియదు.’’ అని ఆమె చెప్పారు.
 
అనంతరం ‘మీరు అంత్యక్రియల ప్రక్రియని ఫాలోఅప్ చేశారుగా’ అన్న ప్రశ్నకి రాజ్యలక్ష్మి తడబడ్డారు. పూరీజన్నాథ్ బ్యాచ్‌తో రవితేజకు స్నేహం ఉన్న మాట వాస్తవమేనని, అంత మాత్రాన వారితో కలిసి డ్రగ్స్ తీసుకున్నాడని ఆరోపించడం కరెక్ట్ కాదని ఆమె అన్నారు. డ్రగ్స్ కేసులో రవితేజకు నోటీసు వచ్చిందని, 22వ తేదీన విచారణకు హాజరు అవుతాడని ఆమె చెప్పారు. డ్రగ్స్ వ్యవహారం వచ్చిన ప్రతిసారి తమ పిల్లల పేర్లను కావాలని తీసుకువస్తున్నారని ఆమె ఆరోపించారు. డ్రగ్స్ వ్యవహారంలో భరత్‌ను రవితేజ ఎన్నోసార్లు మందలించారని ఆమె చెప్పారు. సినిమా ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్న వాళ్లే మిగులుతారని రాజ్యలక్ష్మి అభిప్రాయపడ్డారు.
Tags :Raviteja, Mother, Bharath, drugs case