వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ

Yuvajana Sramika Rythu Congress Party - YSRCP

తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత కాంగ్రెస్‌తో విబేధించి సొంత పార్టీ పెట్టుకున్న జగన్.. 2014 ఎన్నికల్లో సొంత తప్పిదాలతో అధికారాన్ని చేజార్చుకున్నారు. జగన్ అతివిశ్వాసమే వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు అధికారాన్ని దూరం చేసిందని ఆ పార్టీ సీనియర్లు చెప్పుకుంటుంటారు. 2019 ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలన్న కసితో ‘ప్రజా సంకల్ప యాత్ర’కు పూనుకున్నారు. అధికారాన్ని చేజిక్కించుకోవాలంటే పాదయాత్రే సరైన దారి అని భావించిన జగన్.. 2017 నవంబర్ 6న ప్రజాసంకల్పయాత్రకు శ్రీకారం చుట్టారు. ఏపీలో దాదాపు 125 నియోజకవర్గాల్లో ఈ యాత్రను సంకల్పించారు. తమ పార్టీ తరపున గెలిచి టీడీపీలోకి చేరిన ఎమ్మెల్యేల అభ్యర్థిత్వాలను రద్దు చేసేవరకు అసెంబ్లీకి రాబోమంటూ జగన్ తీసుకున్న నిర్ణయంపై పలు విమర్శలు వచ్చాయి. ప్రశాంత్ కిషోర్‌ను ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకోవడం కూడా తీవ్ర చర్చనీయాంశమయింది. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు లేకుండానే పోటీ చేస్తామని ఇప్పటికే జగన్ ప్రకటించారు. నవరత్నాలు పేరిట రూపొందించిన పథకాలను జనాల్లోకి తీసుకెళ్లే బాధ్యతను కార్యకర్తలకు అప్పగించారు. కాపు రిజర్వేషన్‌పై జగన్ చేసిన వ్యాఖ్యలు.. పార్టీలో కలకలం రేపాయి. దీంతో వెంటనే మాటమార్చి పార్టీ నాయకులను సంతృప్తి పరిచినా.. కాపుల్లో మాత్రం నమ్మకం కల్గించలేకపోయారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాకపోతే పార్టీ మనుగడే ప్రశ్నార్థకం అవుతుందన్న యోచనలో ఉన్న జగన్.. ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకునేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీకి ప్రాతినిథ్యం దక్కని గోదావరి జిల్లాల్లో ఏకంగా రెండు నెలల పాటు పాదయాత్ర చేశారు. సీట్ల కేటాయింపు విషయంలో డబ్బుకే ప్రాధాన్యత ఇస్తున్నారన్న విమర్శలు జగన్‌కు చేటు కలిగిస్తున్నాయి.

వైఎస్ మరణం- కాంగ్రెస్‌ మార్క్ రాజకీయాలు: వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కుమారుడు. గతంలో కాంగ్రెస్‌ పార్టీలో 2009 ఎన్నికల్లో ఎంపీగా గెలుపొందారు. అయితే రాజకీయాల్లోకి రావాలన్న ఆకాంక్ష జగన్‌కు ఉందన్న విషయం 2004లోనే బయటపడింది. అప్పుడు కాంగ్రెస్ అధిష్టానం ఒత్తిడి మేరకు వైఎస్ రాజశేఖర రెడ్డి తలొగ్గారు. దీంతో ఆ ఎన్నికల్లో జగన్‌కు టికెట్ లభించలేదు. ఆ తర్వాత వైఎస్‌ ప్రాబల్యం పెరగడంతో.. 2009 ఎన్నికల్లో జగన్‌కు కడప ఎంపీగా పోటీ చేసే అవకాశం లభించింది. లక్షా 78వేల 846 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి పాలెం శ్రీకాంత్ రెడ్డిపై జగన్ గెలుపొందారు. తండ్రి వైఎస్ ముఖ్యమంత్రిగా ఉండటంతో.. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ జగన్ పరిచయాలు ఏర్పరచుకున్నారు. పలువురు సీనియర్లు కూడా జగన్‌తో సన్నిహితంగా ఉండేవారు. ఆ తర్వాత అనూహ్య రీతిలో 2009లో సెప్టెంబర్ 2న తండ్రి రాజశేఖర రెడ్డి మరణించారు. ఆ సమయంలో కాంగ్రెస్‌లో మెజారిటీ ఎమ్మెల్యేలు జగన్ పక్షాన చేరారు. దీంతో జగన్ ముఖ్యమంత్రి కావడం లాంఛనమే అని భావించిన కాంగ్రెస్ నాయకులకు.. ఢిల్లీ హైకమాండ్ ఊహించని రీతిలో షాకిచ్చింది.

వైఎస్ మరణం తర్వాత ఏపీ ముఖ్యమంత్రిగా రోశయ్యతో ప్రమాణ స్వీకారం చేయించింది. ‘మాపై నమ్మకం ఉంచండి.. మేమున్నాం..’ అంటూ వైఎస్ కుటుంబానికి సోనియా, రాహూల్ భరోసానిచ్చారు. స్వయంగా సోనియాగాంధీ, రాహూల్‌గాంధీ.. జగన్ ఇంటికి వెళ్లిమరీ పరామర్శించారు. రాజకీయ భవిష్యత్‌కు భరోసానిచ్చారు. వైఎస్ మరణంతో ఖాళీ అయిన పులివెందుల అసెంబ్లీ స్థానంలో తల్లి విజయమ్మను నిలబెట్టారు. ఇతర పార్టీలు ఏవీ అభ్యర్థిని నిలబెట్టకపోవడంతో విజయమ్మ ఏకగ్రీవంగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ముఖ్యమంత్రి పదవి దక్కకున్నా దాదాపు రెండేళ్ల పాటు కాంగ్రెస్‌లోనే జగన్ కొనసాగారు. ఆ సమయంలోనే ప్రత్యేక తెలంగాణ కోసం కేసీఆర్ నిరాహార దీక్ష చేపట్టడం, ఉద్యమం తారస్థాయికి చేరడం జరిగాయి. ఉద్యమ కాలంలో సొంతపార్టీ నుంచే రోశయ్య నిరసనలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇంటా బయట వస్తున్న ఒత్తిళ్ల మధ్య రోశయ్య నలిగిపోయారు. చివరకు ముఖ్యమంత్రి పదవి నుంచి తనను తప్పించమంటూ అధిష్టానానికి విన్నవించుకున్నారాయన. దీంతో మరోసారి ముఖ్యమంత్రి పదవికి జగన్ పేరు ప్రముఖంగా వినిపించింది. జగన్ ముఖ్యమంత్రి అవుతారని అంతా ఊహించారు. కానీ అనూహ్య రీతిలో అప్పటికే స్పీకర్ పదవిలో ఉన్న నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవి వరించింది. ముఖ్యమంత్రిగా కిరణ్‌కుమార్ పేరును ప్రకటించి కాంగ్రెస్‌ నేతలను అధిష్టానం ఆశ్చర్య పరిచింది. దీంతో 2010వ సంవత్సరం నవంబర్ 25న కిరణ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. కాంగ్రెస్‌లో మంత్రి పదవిని చేపట్టుకుండా ముఖ్యమంత్రి అయిన వ్యక్తిగా కిరణ్‌కుమార్ రెడ్డి రికార్డులకెక్కారు.

కిరణ్ సర్కారుపై అవిశ్వాసం.. జగన్ వేరు కుంపటి: రోశయ్య తర్వాత ముఖ్యమంత్రిగా కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. కిరణ్‌ను ముఖ్యమంత్రిని చేయడంతో కాంగ్రెస్‌లోని జగన్ వర్గం భరించలేకపోయింది. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి వైఎస్‌ పథకాలను కిరణ్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందంటూ జగన్ అనుకూలురు ప్రకటనలు చేసి సర్కారుకు కొత్త తలనొప్పులు తీసుకురావడం ప్రారంభించారు. దీంతోపాటు కిరణ్ ముఖ్యమంత్రి అయిన రెండు నెలలకే 2011వ సంవత్సరం జనవరి 6న శ్రీకృష్ణ కమిటీ సమగ్ర నివేదికను కేంద్ర సర్కారుకు అందించింది. తెలంగాణ ఏర్పాటు అవసరం లేదంటూ ఆ కమిటీ తీర్మానించింది. ఆ ప్రాంత అభివృద్ధి కోసం కొన్ని చట్టాలు, నిధులు ఇస్తే సరిపోతుందని పేర్కొంది. విభజన వల్ల మరిన్ని సమస్యలు ఉత్పన్నమవుతాయని వెల్లడింది. ఈ రిపోర్టులపై తెలంగాణ ప్రజలు భగ్గుమన్నారు. మరోసారి మలిదశ ఉద్యమం మొదలయింది. విద్యార్థులు, ఉద్యోగులు, సామాన్య ప్రజలు కూడా తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకున్నారు. వారిని నిలువరించలేని పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వానిది. అదే సమయంలో కాంగ్రెస్‌లోని జగన్ వర్గం గట్టి షాకిచ్చింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశ పెట్టిన అనేక పథకాలకు కిరణ్ సర్కారు తూట్లు పొడిచిందని ఆరోపిస్తూ.. అవిశ్వాస తీర్మానాన్ని జగన్ తల్లి విజయమ్మ ప్రతిపాదించింది. దాదాపు 15మందికి పైగా ఎమ్మెల్యేలు జగన్ వైపు ఉంటారని నిర్ణయానికి వచ్చిన కిరణ్ సర్కారు రాజకీయ నిర్ణయాలకు అంకురార్పణ జరిపింది. కాంగ్రెస్ అధిష్టానం వ్యూహాత్మకంగా వ్యవహరించి ప్రజారాజ్యం పార్టీతో చర్చలు జరిపారు. ఎన్నికల పేరుతో ప్రజాధనాన్ని వృధా చేయరాదన్న కారణంతో తాము కిరణ్ సర్కారుకు మద్ధతిస్తున్నట్లు ఆ పార్టీ అధినేత చిరంజీవి ప్రకటించారు. తమకు ఉన్న 18 మంది ఎమ్మెల్యేలతో అవిశ్వాసానికి వ్యతిరేకంగా ఓటు వేయిస్తామంటూ ప్రకటన చేసింది. దీంతోపాటు సభలో నుంచి టీడీపీ సభ్యులు వాకౌట్ చేయడంతో కిరణ్ సర్కారు అవిశ్వాసం వేటు నుంచి బయటపడగలిగింది. కాంగ్రెస్, టీడీపీలు తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయాలతో.. ప్రభుత్వం పడిపోయి మధ్యంతర ఎన్నికలు వస్తే.. అధికారంలోకి రావచ్చునన్న జగన్ ఆశలు నెరవేరలేదు. ఆ తర్వాత.. తండ్రి మరణాన్ని తట్టుకోలేక మరణించిన వారిని పరామర్శించేందుకు తలపెట్టిన ‘ఓదార్పు యాత్ర’కు కూడా సీనియర్లు అడ్డు పడటం, అధిష్టానం కూడా నిరాకరించడంతో తాను తీవ్రంగా కలత చెందాననీ, వైఎస్ పథకాలకు కిరణ్ సర్కారు తూట్లు పొడుస్తోందంటూ లేఖ రాసి.. కాంగ్రెస్ పార్టీకి జగన్ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన తండ్రికి రాజకీయ జన్మనిచ్చి, ముఖ్యమంత్రిని చేసిన కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ ద్వారా సంక్రమించిన పదవులకు గుడ్‌బై చెప్పి కొత్త పార్టీ ప్రకటన చేశారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్థానం: 2011వ సంవత్సరం మార్చి నెలలో జగన్.. ‘వైఎస్ఆర్ కాంగ్రెస్’ పార్టీని స్థాపించారు. వైఎస్‌పై ఉన్న విపరీతమైన సానుభూతి, జగన్‌ వైపు సానుకూల పవనాలు వీయడంతో కాంగ్రెస్, టీడీపీ నుంచి 18 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీలో చేరారు. ఆయా ఎమ్మెల్యేలు రాజీనామా చేసి జగన్ పార్టీలో చేరడంతో కొన్నాళ్లకే ఉప ఎన్నికలు వచ్చాయి. వీరితోపాటు తెలంగాణ కోసమంటూ టీఆర్ఎస్ నాయకులు కూడా రాజీనామాలు చేశారు. మొత్తానికి రెండు ప్రాంతాల్లో 2011లో జరిగిన ఉఫ ఎన్నికల్లో జగన్ రికార్డు సృష్టించారు. కడప ఎంపీగా పోటీ చేసిన ఆయనకు ఏకంగా 5లక్షల 45వేల 672 ఓట్ల మెజారిటీ లభించింది. పులివెందుల స్థానంలో వైఎస్ సతీమణి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ అభ్యర్థులు పోటీ చేసినా రికార్డు స్థాయి మెజారిటీతో గెలుపొందారు. అటు టీఆర్ఎస్ అభ్యర్థులు కూడా విజయం సాధించారు. ఆ తర్వాత వైసీపీ గెలుపుతో టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి హేమాహేమీలు జగన్ పార్టీలో చేరారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో అక్రమాస్తుల కేసులో 16 నెలలు జైల్లో గడిపారు. ఈ 16 నెలల పాటు పార్టీని బతికించుకోవడం కోసం వైఎస్ కుటుంబ సభ్యులు తీవ్రంగా కృషి చేశారు. జగన్ సోదరి షర్మిళ.. పాదయాత్ర చేశారు. ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేసి పార్టీకి కష్టకాలంలో అండగా ఉన్నారు. 16 నెలల తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చిన జగన్ పార్టీ కార్యకలాపాలను వేగవంతం చేశారు. రాష్ట్రంలో ఎక్కడకు వెళ్లినా విపరీతమైన ఆదరణ, ప్రజల నుంచి స్పందన వస్తుండటంతో కాబోయే సీఎంను తానేనని జగన్ భావించారు. 2014లో రాష్ట్ర విభజన జరగడంతో పూర్తిగా ఏపీ రాజకీయాలపైనే జగన్ దృష్టి సారించారు. ఆ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో అభ్యర్థులను నిలబెట్టినా నామమాత్రంగానే ప్రచారం చేశారు. విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏపీలో పూర్తిగా బలహీనం అవడంతో.. కాంగ్రెస్ కేడర్ అంతా తనకు సహకరిస్తారని జగన్ భావించారు. ఆ నమ్మకంతోనే 2014 ఎన్నికల్లో ఒంటరిపోరుకు మొగ్గు చూపారు. కాంగ్రెస్, టీడీపీ నుంచి భారీస్థాయిలో వలసలను ప్రోత్సహించారు. అయితే విభజన పరిణామాలు తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబుకు కలిసి వచ్చాయి. దానికితోడు గెలుపు కోసం చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరించి పవన్, బీజేపీతో పొత్తు పెట్టుకోగా.. జగన్ మాత్రం ఒంటరిపోరుకే మొగ్గు చూపారు. దీనికి తోడు చివరి క్షణాల్లో ఆపార్టీ నుంచి వీడిని నేతలు చేసిన ఆరోపణలు వైసీపీ ఓటమికి దారి తీశాయి. ఆ ఎన్నికల్లో చంద్రబాబు-మోదీ-పవన్ కల్యాణ్ కూటమి విజయం సాధించింది. 67చోట్ల వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో విశాఖ ఎంపీగా వైసీపీ తరపున పోటీ చేసిన వైఎస్ సతీమణి విజయమ్మ.. బీజేపీ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. ఇది వైసీపీ కేడర్‌కు మింగుడు పడని అంశంగా మిగిలిపోయింది. మొత్తానికి మొదటిసారి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతిపక్షంలో వైసీపీ కూర్చుంది. అసెంబ్లీలో టీడీపీ, వైసీపీ మధ్య హోరాహోరీ చర్చలు జరిగాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలతో సభ కురుక్షేత్రాన్ని తలపించేది. ‘కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు నాతో టచ్‌లో ఉన్నారు. నేను తలచుకుంటే ప్రభుత్వం కుప్పకూలిపోతుంది..’ అంటూ జగన్ ఓ తరుణంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో అధికార తెలుగుదేశం పార్టీ ఉలిక్కిపడింది. వెంటనే అప్రమత్తమయి ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరతీసింది. వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలను చేర్చుకునే ప్రయత్నాలను మొదలుపెట్టింది. 20మందికి పైగా వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారు. దీంతో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు వేయాలంటూ స్పీకర్‌కు వైసీపీ నోటీసులిచ్చింది. అయినా స్పీకర్ వాటిని పరిగణనలోకి తీసుకోకపోవడంతో సభను బహిష్కరిస్తున్నట్లు జగన్ ప్రకటించారు. జగన్ తీసుకున్న ఈ నిర్ణయం.. నష్టమేనని పార్టీ సీనియర్లు అంచనా వేశారు. ప్రత్యేక హోదా కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నామని పదేపదే చెప్పుకునే జగన్‌కు ఈ సారి ముఖ్యమంత్రి కావడం అనివార్యంగా మారింది. వచ్చే ఎన్నికల్లో సీఎం పీఠం దక్కకుంటే అటు పార్టీకి, ఇటు తన రాజకీయ భవిష్యత్తుకు కష్టమేనని జగన్ భావిస్తున్నారు.

కేవలం రెండు శాతం ఓట్లతో అధికారం చేజారిపోయిందన్న బలమైన నమ్మకంతో ఉన్న జగన్.. ఈ సారి సీఎం పీఠాన్ని కైవసం చేసుకునేందుకు వినూత్న ఎత్తుగడలతో ముందుకెళ్తున్నారు. 2014 ఎన్నికల్లో తెలంగాణలో అభ్యర్థులను నిలబెట్టిన జగన్.. ఈసారి మాత్రం పూర్తిగా వదిలేశారు. తెలంగాణ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులను నిలబెట్టలేదు. పూర్తిగా ఏపీ రాజకీయాలపైనే జగన్ ద‌ృష్టిసారించారు. 2014 ఎన్నికల్లో మితృపక్షాలుగా ఉన్న బీజేపీ, జనసేన కూడా టీడీపీ నుంచి దూరం కావడం.. వైసీపీకి లాభిస్తుందని జగన్ ఆశిస్తున్నారు. గత ఎన్నికల్లో ఆ కూటమికి వచ్చిన ఓట్లు చీలిపోతాయని, తద్వారా వైసీపీ అభ్యర్థుల గెలుపు సునాయాసమేనని వైసీపీ నేతలు కూడా నమ్ముతున్నారు. 2014లో జరిగిన తప్పులను మరోసారి జరగకుండా ఉండేందుకు తండ్రి నమ్మిన ‘పాదయాత్ర’ సిద్ధాంతానికి శ్రీకారం చుట్టారు. ప్రజా సంకల్ప యాత్రతో జనాల్లోకి వెళ్తున్నారు. నవరత్నాలు పేరిట వినూత్న పథకాలకు నాంది పలికారు. వీటితోపాటు మరిన్ని పథకాలను పాదయాత్రలో జగన్ ప్రకటించారు. ‘ఒక్కసారి సీఎం పీఠంపై కూర్చుంటే.. ముప్ఫై ఏళ్లపాటు అధికారంలో ఉంటాననీ, రాజన్న రాజ్యాన్ని మళ్లీ తెస్తాను..’ అంటూ ప్రకటనలు చేస్తుంటారు. ముఖ్యమంత్రిని అయితే తండ్రిని మరపించేలా పాలిస్తానంటుంటారు. ప్రశాంత్ కిషోర్‌ను ఎన్నికల వ్యూహకర్తగా రంగంలోకి దింపారు. సోషల్ మీడియా ద్వారా ప్రచారంతో రాష్ట్ర రాజకీయాలను హోరెత్తిస్తున్నారు. ఈ సారి కూడా ఒంటరిపోరుకే సిద్ధమయ్యారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీతో కుమ్మక్కయ్యారంటూ వైసీపీపై టీడీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ.. బీజీపీని జగన్ విమర్శించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. మరి టీడీపీ చేస్తున్న ప్రచారం జగన్‌కు మైనస్ అవుతుందో.. ఈ సారైనా జగన్.. సీఎం అవుతారో.. లేదో.. ఆయన ఆకాంక్ష నెరవేరుతుందో లేదో వేచిచూడాలి.