టీఆర్ఎస్ ప్రొఫైల్

TELANGANA RASTRA SAMITI - TRS

తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంతో 2001 ఏప్రిల్ 27న కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలుగుదేశం పార్టీని వీడి ‘తెలంగాణ రాష్ట్ర సమితి’ పార్టీని స్థాపించారు. హైదరాబాద్ జలదృశ్యంలో ‘నీళ్లు- నిధులు- నియామకాలు’ పేరిట పార్టీ లక్ష్యాలను ప్రకటించారు. కేసీఆర్ ఆశయ సాధనకు టీడీపీ, కాంగ్రెస్ నేతల్లోని కొందరు నేతలు పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్‌లో చేరారు. ఉమ్మడి ఏపీలో అన్ని వ్యవస్థల్లోనూ తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతోందని ఊరూరా ప్రచారం చేశారు. తెలంగాణ భావనను ప్రజల్లో రేకెత్తింపజేశారు. ఉమ్మడి రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. పార్టీని ఏర్పాటు చేసిన రెండు నెలల వ్యవధిలోనే సిద్ధిపేటలో జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఆ పార్టీ జయకేతనం ఎగురవేసింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సానుకూలంగా ఉన్నామన్న కాంగ్రెస్ హామీతో టీఆర్‌ఎస్ 2004లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంది. టీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ ఆ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ 54 స్థానాల్లో పోటీ చేసి 26 అసెంబ్లీ స్థానాల్లో, 5 పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించింది. ఆ తర్వాత ప్రభుత్వంలో కూడా టీఆర్ఎస్ పార్టీ భాగస్వామి అయింది. కేంద్రంలో కూడా కేసీఆర్ కార్మిక శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు.

అయితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏర్పాటు విషయంలో ఇచ్చిన హామీపై వేచి చూసే ధోరణిని అవలంబించడం, కాలయాపన చేస్తూ ఉండటాన్ని కేసీఆర్ సహించలేకపోయారు. ఎన్ని సార్లు విజ్ఞప్తులు చేసినా కాంగ్రెస్ పార్టీ పట్టించుకోకపోవడంతో 2006 సెప్టెంబర్‌లో ఆ పార్టీతో టీఆర్ఎస్ తెగదెంపులు చేసుకుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వైదొలగింది. ఎమ్మెల్యే, ఎంపీ పదవులకు టీఆర్ఎస్ సభ్యులంతా మూకుమ్మడిగా రాజీనామా చేశారు. టీఆర్ఎస్ పార్టీ రాజకీయ వ్యూహాల్లో, తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ‘ఉప ఎన్నికలు’ ప్రముఖ పాత్ర వహించాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. దేశంలో ఏ రాష్ట్రానికి జరగనని ఉప ఎన్నికలు తెలంగాణలో జరిగాయి. కాంగ్రెస్‌తో పొత్తులో భాగంగా కరీంనగర్ నుంచి ఎంపీగా గెలిచిన కేసీఆర్ 2006లో కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసిన సవాల్‌తో రాజీనామా చేసి తిరిగి అదే స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసి అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. 2008 ఏప్రిల్‌లో టీఆర్‌ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయడంతో మేలో ఉప ఎన్నికలు జరిగాయి. అయితే ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ వ్యూహం ఫలించలేదు. కేసీఆర్ రాజకీయ వ్యూహాలకు వైఎస్ ప్రతివ్యూహాలు రచించారు. అధికారంలో ఉన్న పార్టీ కావడంతో వైఎస్ అన్ని అవకాశాలను వినియోగించుకుని ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు గట్టి షాకిచ్చింది. ఈ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ 16 ఎమ్మెల్యే స్థానాలకు గానూ 7 స్థానాలను మాత్రమే దక్కించుకోగలిగింది. నాలుగు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసి రెండింటిలో విజయం సాధించింది. ఈ ఉప ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో టీఆర్‌ఎస్‌ కాంగ్రెస్ నుంచి విమర్శలు ఎదుర్కోక తప్పలేదు.

వైఎస్‌ను మరోసారి గెలవనీయకుండా చేసేందుకు తాను ఏపార్టీనుంచి బయటకు వచ్చానో.. అదే పార్టీతో కేసీఆర్ పొత్తు ప్రక్రియలకు తెరలేపారు. తెలంగాణకు మద్ధతు ఇస్తే పొత్తుకు సిద్ధమేనంటూ టీడీపీకి వర్తమానం పంపారు. దీంతో తెలుగుదేశం పార్టీ కూడా ప్రత్యేక తెలంగాణకు తాము అడ్డుపడబోమనీ, తమకు ఏమాత్రం అభ్యంతరం లేదని ప్రకటించడంతో టీఆర్‌ఎస్‌తో పొత్తు చర్చలు నడిచాయి. ఎన్నికల ఏడాదిలో మెగాస్టార్ చిరంజీవి ‘ప్రజారాజ్యం పార్టీ’ని పెట్టారు. ఓ దశలో పీఆర్పీతో పొత్తు పెట్టుకోవాలని కొందరు నాయకులు ప్రతిపాదించినా.. కేసీఆర్ మాత్రం చంద్రబాబు వైపే మొగ్గుచూపారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో వామపక్షాలు, టీడీపీతో కలిసి టీఆర్ఎస్ పార్టీ ‘మహాకూటమి’గా ఏర్పాటయింది. ఆ ఎన్నికల్లో గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం చేసింది. అయితే ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘోరంగా పరాజయం పాలయింది. కూటమి పొత్తుల్లో భాగంగా.....45 సీట్లలో పోటీ చేసి.. 10 ఎమ్మెల్యే సీట్లను మాత్రమే గెలుచుకోగలిగింది. ఆ ఎన్నికల్లో వైఎస్ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ రెండోసారి విజయం సాధించారు. ఆ ఎన్నికల పలితాలు రాకముందే... టీఆర్ఎస్ పార్టీ కేంద్రంలోని బీజేపీకి తమ మద్ధతు ఉంటుందనీ, బీజేపీ మాత్రమే తెలంగాణ ఇవ్వగలదన్న నమ్మకం తమకుందని తొందరపాటు ప్రకటన చేసింది. అయితే ఫలితాలు వచ్చాక మాత్రం సీన్ రివర్స్ అయింది. శాసన సభలోచర్చలో భాగంగా... టీఆర్ఎస్ ఎన్ని సీట్లలో గెలిచిందన్న లెక్కలు చెబుతూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గేలి చేయడాన్ని కేసీఆర్ సీరియస్‌గా తీసుకున్నారు. అప్పటి వరకు రాజకీయ వ్యూహాలతో, ఉప ఎన్నికలతో తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టిన టీఆర్ఎస్.. తన పంథాను మార్చుకుంది. 2009లో వైఎస్ మరణం తర్వాత రోశయ్య ముఖ్యమంత్రి పదవిని చేపట్టాక.. పూర్తి స్థాయిలో ఉద్యమానికి గులాబీ బాస్ శ్రీకారం చుట్టారు. 2009, నవంబర్ 29వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్‌తో కేసీఆర్ నిరవధిక నిరాహార దీక్షకు దిగారు.

టీఆర్‌ఎస్‌ కార్యకర్తలతోపాటు ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు కేసీఆర్‌కు మద్ధతుగా ఉద్యమంలో పాల్గొన్నాయి.. రోడ్ల పైనే వంటా వార్పు చేపట్టాయి. రైలో రోఖో, జైల్ భరో.. వంటి నిరసన కార్యక్రమాలు తెలంగాణ వ్యాప్తంగా జరిగాయి. తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్శిటీ ప్రధాన పాత్ర పోషించింది. ఆ యూనివర్శిటీలో జరిగిన లాఠీ చార్జ్‌తో తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థులంతా ఒక్కటయ్యారు. పరీక్షలను బహిష్కరించడం చేశారు. తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులు కూడా పెన్‌డౌన్ చేయడం వంటివి చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావం కోసం నల్లగొండ జిల్లాకు చెందిన నిరుద్యోగ యువకుడు శ్రీకాంత చారి.. ఎల్బీ నగర్‌లో రింగ్ రోడ్‌లో నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడటం.. తెలంగాణ వాదులనే కాదు.. కరుడుగట్టిన సమైఖ్య వాదులను కూడా కలిచి వేసింది. ఆ సంఘటన తర్వాత తెలంగాణ వ్యాప్తంగా ప్రజలంతా ఉద్యమానికి ఊపిరిలూదారు. కేసీఆర్ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేసి ఖమ్మం జైలుకు తరలించారు. అయినప్పటికీ.. కేసీఆర్ జైలులో కూడా దీక్షను కొనసాగించారు. ఈ పరిణామంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ దీక్షకు మద్దతుగా తెలంగాణ వ్యాప్తంగా ఊరుఊరులో.. వాడవాడలో నిరాహార దీక్షలు జరిగాయి. ఉద్యమం తీవ్రరూపం దాల్చడంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా యూపీఏ ప్రభుత్వం డిసెంబర్ 9, 2009న ప్రకటన చేసింది. శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లోని పరిస్థితులను అంచనా వేసి.. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు గురించి త్వరితగతిన నివేదిక అందించాల్సిందిగా కేంద్రం కోరింది. దాదాపు ఏడాదిన్నర సమయం తీసుకుని శ్రీకృష్ణ కమిటీ ఓ రిపోర్టును అందజేసింది. తెలంగాణ రాష్ట్రం ప్రకటించనవసరం లేదంటూ తేల్చిచెప్పింది. ఆ ప్రాంత అభివృద్ధి కోసం చట్టాల్లో కొన్ని మార్పులు, కొన్ని నిధులు ఇస్తే సరిపోతుందంటూ కేంద్రానికి తెలిపింది.

ఈ నివేదికతో తెలంగాణ ప్రజలు భగ్గుమన్నారు. టీఆర్ఎస్ పార్టీ మరోసారి మలివిడత ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. ప్రొఫెసర్ కోదండరాం అధ్యక్షతన రాజకీయ జేఏసీ ఏర్పాటయింది. తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలతో కలిసి ఏర్పడిన ఈ రాజకీయ జేఏసీలో టీఆర్ఎస్ మాటే చెల్లుబాటు అయింది. ఈ క్రమంలో టీఆర్ఎస్ పార్టీ దేశంలోని ఇతర ప్రాంతీయ పార్టీలను ఒప్పించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్ధతును సంపాదించింది. తెలంగాణ జేఏసీ పేరుతో కోదండరామ్ అధ్యక్షతన జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటైంది. ఈ దశలోనే... తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఏపీలో సమైక్యాంధ్ర ఉద్యమం మొదలైంది. ఇటు తెలంగాణ ఏర్పాటు ఉద్యమం, అటు సమైక్యాంధ్ర ఉద్యమం తీవ్రమైన వేళ పలు గందరగోళ పరిణామాల మధ్య.. దాదాపు నాలుగేళ్ల తర్వాత 2013లో ఏపీ పునర్విభజన చట్టానికి పార్లమెంట్‌లో ఆమోద ముద్ర పడింది. తెలంగాణలో గెలుస్తామన్న ధీమాతో.. కాంగ్రెస్ పార్టీ రాజకీయ నిర్ణయం తీసుకుంది. ఏపీలో ఒక్క సీటుకూడా రాదని తెలిసి.. ఎన్నికలకు ముందు రాష్ట్ర విభజనను పూర్తి చేసింది. అయితే ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే.. పార్టీని విలీనం చేస్తానన్న కేసీఆర్.. వ్యూహాత్మకంగా వ్యవహరించి కాంగ్రెస్‌కు హ్యాండిచ్చారు. తెలంగాణను సాధించింది తామేనంటూ ఢిల్లీనుంచి హైదరాబాద్‌కు వచ్చి భారీ ర్యాలీ నిర్వహించారు. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు లేకుండా మొట్టమొదటిసారిగా తెలంగాణలోని అన్ని స్థానాల్లోనూ పోటీ చేసింది. మొత్తం 119 అసెంబ్లీ స్థానాల్లో 63 స్థానాల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా టీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రమాణస్వీకారం చేశారు. అయితే ప్రభుత్వానికి అత్తెసరు మెజారిటీ మాత్రమే ఉండటంతో కేసీఆర్ ‘ఆపరేషన్ ఆకర్ష్‌’కు తెరలేపారు. ఒకే రాష్ట్రంలో రెండు ప్రాంతీయ పార్టీలు ఉండటం తమకు చేటు తెస్తుందని భావించి తెలంగాణ తెలుగుదేశం పార్టీపై గురిపెట్టారు. ఆ పార్టీకి చెందిన మెజారిటీ ఎమ్మెల్యేలను పార్టీలోకి రప్పించారు. అంతేకాకుండా ఓటమి పాలయిన సీనియర్ నాయకులను, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇతర ప్రముఖ నాయకులను పార్టీలో చేర్చుకున్నారు. తద్వారా ప్రభుత్వ బలాన్నే కాదు.. తెలంగాణ వ్యాప్తంగా పార్టీ బలాన్ని కూడా పెంచుకున్నారు.

జూన్ 2,2014న తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ 4సంవత్సరాల మూడు నెలల 4రోజుల పాటు పరిపాలన బాధ్యతల్లో కొనసాగారు. మొత్తం 1546రోజుల పాటు తెలంగాణ సీఎంగా బాధ్యతలు నిర్వహించారు. అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్ల తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయం తీసుకుంది. దాదాపు 9 నెలల ముందుగానే సెప్టెంబర్ 6వ తారీఖున ప్రభుత్వాన్ని రద్దు చేసి.. ఎన్నికలకు వెళ్తున్నట్లు గులాబీ బాస్ ప్రకటించారు. టీఆర్ఎస్‌ను ఓడించేందుకు మొట్టమొదటిసారిగా తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు ఒక్కటయ్యాయి. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కోదండరాం కూడా ‘తెలంగాణ జన సమితి’ పేరుతో ప్రత్యేక పార్టీని ప్రారంభించి కాంగ్రెస్, టీడీపీలతో జతకట్టారు. మొత్తానికి టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రి కానీవకుండా ఉండేందుకు సీపీఐ, కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్ కలిసి మహాకూటమిగా ఏర్పడ్డాయి. ఒంటరిగానే తాము ఎన్నికలకు వెళ్తున్నట్లు టీఆర్ఎస్ ఇప్పటికే ప్రకటించింది. వచ్చే ఎన్నికల్లో గెలుపొందేందుకు, అధికారాన్ని నిలుపుకునేందుకు టీఆర్ఎస్ మరిన్ని పథకాలకు శ్రీకారం చుట్టింది. నిరుద్యోగ భృతి, వృద్ధాప్య పింఛన్‌ అర్హత వయసును తగ్గించడం, వృద్ధాప్య, వికలాంగ పింఛన్లను పెంచడం, రైతు రుణమాఫీ.. వంటి మరెన్నో పథకాలను కేసీఆర్ ప్రకటించారు. మొత్తానికి 2018 ఎన్నికల పోరు టీఆర్ఎస్‌కు ప్రతిష్టాత్మకంగా మారిందనడంలో ఏమాత్రం సందేహం లేదు. మరోసారి గెలిచి...తెలంగాణలో తమకు ప్రత్యామ్నాయం లేదని టీఆర్ఎస్ నిరూపిస్తుందో లేదో వేచిచూడాలి. డిసెంబర్ 7న తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 11న ఫలితాలు వెలువడనున్నాయి. టీఆర్‌ఎస్ పార్టీ ప్రచారంలో దూసుకుపోతూ.. విజయం సాధిస్తామనే ధీమాలో ఉంది.