జనసేన పార్టీ

Janasena Party

2009వ సంవత్సరంలో మెగాస్టార్ చిరంజీవి ‘ప్రజారాజ్యం’ పార్టీ ఓ విఫల ప్రయోగంగా మిగిలిపోవడంతో ఆయన సోదరుడు పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం అధ్యక్షుడిగా పనిచేసిన పవన్.. అప్పట్లో కాంగ్రెస్ నేతలపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ‘కాంగ్రెస్ నేతల పంచెలు ఊడేలా తరిమి కొట్టండి’ అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. ఆయనతోపాటు కుటుంబంలోని సినీ హీరోలంతా పార్టీ కోసం ఆ ఎన్నికల్లో ప్రచారం చేశారు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తామనుకుంటే కేవలం 18 స్థానాలకే పరిమితం కావడం, చిరంజీవి స్వయంగా సొంత నియోజకవర్గంలో ఓటమి పాలవడం, రాష్ట్రమంతటా తిరిగి ప్రచారం చేసినా సరైన ఫలితం కానరాకపోవడంతో రాజకీయాలకు తాత్కాలిక విరామమిచ్చి సినిమాలకు దగ్గరయ్యారు. కాంగ్రెస్‌లో ప్రజారాజ్యం పార్టీ విలీనం, తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర విభజన సమయంలోనూ రాజకీయ ప్రాధాన్యతను సంతరించే ఎలాంటి వ్యాఖ్యలను పవన్ చేయలేదు. ఆయన నటించిన ‘కెమెరామన్ గంగతో రాంబాబు’ సినిమా మాత్రం తెలంగాణ ఉద్యమకారుల నుంచి తీవ్ర నిరసనలను ఎదుర్కొంది. రాష్ట్ర విభజన పరిణామాలు ఏపీ ప్రజల్లో కాంగ్రెస్‌పై వ్యతిరేకతను పెంచాయి. ఆ పార్టీ నుంచి కేంద్రమంత్రిగా పనిచేసిన చిరంజీవి రాజకీయ జీవితానికి దారులు మూసుకుపోవడంతో సినీరంగానికి తిరిగి రావాలనుకోవడం.. పవన్ కొత్త పార్టీ పెట్టాలనుకోవడం.. దాదాపుగా ఒకేసారి జరిగాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్.. రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత.. పవన్ కల్యాణ్ కొత్త పార్టీని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. గతంలోని ప్రజారాజ్యం పార్టీనే ఆయన మళ్లీ తెరపైకి తెస్తారని అంతా భావించారు. కానీ 2014వ సంవత్సరం మార్చి 14న జరిగిన పార్టీ ఆవిర్భావ సభలో పవన్ కొత్త పార్టీ పేరును ‘జనసేన’గా ప్రకటించారు. రాష్ట్ర విభజన గురించే ప్రముఖంగా ప్రస్తావించిన ఆయన.. రెండు రాష్ట్రాలుగా విడిపోవడం తనను బాధించిందన్నారు. 12 రోజుల పాటు అన్నం తినలేదంటూ వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీ రెండు రాష్ట్రాల్లోనూ ఉంటుందనీ, తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి దోహదపడుతుందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

2014 ఎన్నికల్లో పవన్ పోటీ చేస్తారని అంతా భావించారు. కానీ ఊహించని నిర్ణయంతో తెలుగు ప్రజలను పవన్ సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున అభ్యర్థులు ఎవరూ పోటీ చేయబోరంటూ సంచలనం సృష్టించారు. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీకి ఎన్నికల్లో మద్ధతు ప్రకటించి రాజకీయాల్లో సరికొత్త చరిత్రకు నాంది పలికారు. ఆ ఎన్నికల సమయంలో స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబు.. పవన్ కల్యాణ్ నివాసానికి వెళ్లడం, చర్చలు జరపడం, టీడీపీకి మద్ధతునిస్తున్నట్లు ప్రకటించడం వెంటవెంటనే జరిగిపోయాయి. ఆ ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి ఏర్పడింది. టీడీపీ-బీజేపీ అభ్యర్థులకు జనసేన అండగా నిలిచింది. రెండు రాష్ట్రాల్లో జరిగిన పలు సభల్లో మోదీ, చంద్రబాబుతోపాటు పవన్ కల్యాణ్ కూడా పాల్గొన్నారు. కూటమిని గెలిపించాల్సిందిగా జనసేన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆ ఎన్నికల్లో ఏపీలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడగా.. తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పడ్డాక.. జనసేన పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పురోగతి కనిపించలేదు. పార్టీ కార్యాలయం కూడా ఏర్పాటు చేయకపోవడం, కేవలం ట్వీట్లలో మాత్రమే స్పందిస్తుండటంపై ఆయా పార్టీల నుంచి విమర్శలను పవన్ కల్యాణ్ ఎదుర్కొన్నారు. ప్రత్యేక హోదా కోసం యువత అంతా విశాఖకు వస్తే.. పవన్ మాత్రం ట్విటర్‌కే పరిమితమవడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఏపీలో సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం, వాటి పరిష్కార మార్గాలను చూపించడం వంటి విషయాల్లో జనసేన విశేష భూమిక పోషించింది. రాజధాని ప్రాంత గ్రామాల్లో పర్యటించి.. అండగా ఉంటానంటూ ప్రజలకు పవన్ అభయహస్తం ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లాలోని ఉద్ధానం ప్రాంతంలో కిడ్నీ బాధితులకు అండగా నిలిచారు. విదేశాల నుంచి నిపుణులను రప్పించి వైద్య పరీక్షలు చేయించారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉండేలా పోరాడారు.

ఏపీకి ప్రత్యేక ప్యాకేజీని కేంద్రం ప్రకటించిన సమయంలో.. ‘పాచిపోయిన లడ్డూలు’ అంటూ పవన్ వ్యాఖ్యలు చేశారు. పాచిపోయిన లడ్డూల కోసం ప్రాకులాడతారో.. ప్రత్యేక హోదా కోసం పోరాడతారో తేల్చుకోవాలంటూ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. ప్రత్యేక హోదా, రాష్ట్ర విభజన సమస్యలను పరిష్కరించడంలో కేంద్రం, రాష్ట్రం అలక్ష్యం వహిస్తున్నాయంటూ ఆయన విమర్శించారు. అప్పటి వరకు పలు సందర్భాల్లో చంద్రబాబుకు, టీడీపీ ప్రభుత్వానికి మద్ధతుగా మాట్లాడిన పవన్.. 2018 మార్చి 14న జరిగిన పార్టీ ఆవిర్భావ సభలో ప్రసంగం ద్వారా ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారారు. టీడీపీ ప్రభుత్వం అవినీతికి పరాకాష్ట అనీ, తనను వాడుకుని వదిలేశారనీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు చేస్తున్న అవినీతి గురించి మీకు తెలియదా..? అంటూ చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. 2019 ఎన్నికల్లో పోటీ చేయబోతున్నామంటూ అదే సభలో ప్రకటించి జనసేన కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. రాబోయే ఎన్నికల్లో నిర్ణయాత్మక శక్తిగా మారి జనసేన సత్తా ఏంటో నిరూపించాలని పవన్ లక్ష్యంగా పెట్టుకున్నారు. జనసేన వల్లే ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చిందని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని అధికారంలోకి రాకుండా చేయడమే తమ ఏకైక లక్ష్యమని పవన్ స్పష్టం చేశారు. ఏపీలో ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన ఆయన.. తెలంగాణలో కేసీఆర్ పాలన బాగుందని కితాబిచ్చారు. తెలంగాణలోని ముందస్తు ఎన్నికల్లో జనసేన పోటీ చేయడంపై ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయాలని కార్యకర్తలు కోరుతుండటంతో.. త్వరలోనే నిర్ణయం తీసుకుంటారన్న వార్తలు వచ్చాయి.

ఏపీలో ఇటు వైసీపీకి, అటు జనసేనకు టీడీపీ టార్గెట్‌గా మారింది. ఒక దశలో వైసీపీ జనసేన పొత్తు పెట్టుకుంటుందని పుకార్లు కూడా వచ్చాయి. వైసీపీకి చెందిన మాజీ ఎంపీ వరప్రసాద్ చేసిన వ్యాఖ్యలు కూడా అందుకు బలాన్నిచ్చాయి. వచ్చే ఎన్నికల్లో వైసీపీ-జనసేన పోటీ చేస్తాయని ఆయన చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించాయి. అయితే అవి గాలి వార్తలేనని తొందరగానే తేలిపోయాయి. ‘కార్లను మార్చినట్లు భార్యను మారుస్తారంటూ’ పవన్‌పై జగన్ చేసిన కామెంట్స్ ఇరు పార్టీల మధ్య దూరాన్ని పెంచాయి. అయితే జగన్ తనకు శత్రువేమీ కాదనీ, అయితే కేవలం ముఖ్యమంత్రి కొడుకునన్న కారణంతోనే తాను కూడా ముఖ్యమంత్రిని అవ్వాలనుకోవడం జగన్‌కు తగదని పవన్ హితవు పలికారు. బీజేపీ వెనకుండి పవన్‌ను ప్రోత్సహిస్తుందని, ప్రభుత్వంపై బురదజల్లిస్తోందని టీడీపీ చేస్తున్న ఆరోపణలను జనసేన కొట్టి పారేస్తోంది. బీజేపీని, మోదిని మొట్టమొదటగా నిలదీసింది తామేనని పవన్ స్పష్టం చేశారు. రాజకీయ లబ్ధి కోసమే టీడీపీ.. బీజేపీతో బంధాన్ని తెంపుకుందని, తాము మాత్రం ఏపీ ప్రయోజనాలకోసం బీజేపీపై పోరాడుతున్నామని తెలిపారు. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో వైసీపీతో కలిసి జనసేన పయనిస్తుందా..? లేక ఒంటరిగా పోటీ చేస్తుందా..? వైసీపీ, టీడీపీ, జనసేన.. పోరులో విజయం ఎవరిని వరిస్తుంది..? పవన్ కింగ్ అవుతారా..? జనసేన కింగ్ మేకర్‌గా నిలుస్తుందా..? టీడీపీని మళ్లీ అధికారంలోకి రానివ్వనన్న పవన్ పంతం నెరవేరుతుందో..? లేదో..? వేచిచూడాలి.