కాంగ్రెస్ పార్టీ

Indian National Congress

ఉమ్మడి ఏపీ కాంగ్రెస్‌ చరిత్రను తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందు.. ఆ తర్వాత అని విభజించి చెప్పుకోవచ్చనడంలో ఏమాత్రం సందేహం లేదు. అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎదురులేకుండా పోయింది. ఆ పార్టీ అధిష్టానం నిర్ణయించిన వారే ముఖ్యమంత్రులుగా ఎన్నికయ్యేవారు. అయిదేళ్ల పదవీకాలంలో నలుగురయిదుగురు ముఖ్యమంత్రులను మార్చిన చరిత్ర కాంగ్రెస్‌ది.. అయినప్పటికీ 1983 వరకు కాంగ్రెస్ పార్టీనే ఏపీలో అధికారంలో ఉంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీ ఎదురయింది. తెలుగుదేశం పార్టీ ప్రాంతీయపార్టీ కావడం, దానికి ఎన్టీఆర్, చంద్రబాబు వంటి వారు నాయకత్వం వహించడంతో.. కాంగ్రెస్ పార్టీలో కూడా ఏక వ్యక్తి నాయకత్వం అనివార్యమయింది. వైఎస్ 2004లో తన పాదయాత్రతో రాజశేఖరరెడ్డి కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తెచ్చినా.. రాష్ట్ర విభజన కాంగ్రెస్‌ను కకావికలం చేసింది. ఏపీలో నష్టపోయినా తెలంగాణలో అధికారంలోకి వస్తామన్న కాంగ్రెస్ ఆశలు.. అడియాసలయ్యాయి. మొత్తానికి ఏకఛత్రాధపత్యంగా పాలన చేసిన చోటే.. దయనీయమైన పరిస్థితిని ఎదుర్కొనడం ఒక్క కాంగ్రెస్ పార్టీకే చెల్లింది. మొదట జవహార్‌లాల్ నెహ్రూ, ఆ తర్వాత ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రధానమంత్రులుగా పనిచేశారు. సోనియాగాంధీ, ఆమె తనయుడు రాహూల్ గాంధీ నాయకత్వంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు వెళ్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి కలిసి పూర్వవైభవం తెచ్చేందుకు ఇతర పార్టీలతో పొత్తులకు శ్రీకారం చుడుతున్నారు. బీజేపీని ఓడించేందుకు కర్ణాటక ఫార్ములాను కూడా అనుసరించేందుకు కాంగ్రెస్ సిద్ధపడుతోంది. ఈ క్రమంలోనే తనకు వ్యతిరేకంగా పుట్టిన తెలుగుదేశం పార్టీతో తెలంగాణలో పొత్తు పెట్టుకుంది.

స్వాతంత్ర్యం వచ్చాక తొలినాళ్లలో హైదరాబాద్ రాష్ట్రానికి ఎం.కే వెల్లోడి కాంగ్రెస్ తరపున ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఆయన 1950వ సంవత్సరం జనవరి 26 నుంచి 1952వ సంవత్సరం మార్చి ఆరో తారీఖు వరకు అంటే 770 రోజుల పాటు పదవిలో ఉన్నారు. ఆయన తర్వాత బూర్గుల రామకృష్ణారావును హైదరాబాద్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసింది. ఆయన 1952వ సంవత్సరం మార్చి ఆరు నుంచి 1956వ సంవత్సరం అక్టోబర్ 31వరకు ఆ పదవిలో ఉన్నారు. ఇటు ఆంధ్రరాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా టి. ప్రకాశం పంతులును కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసింది. ఆయన 1953 అక్టోబర్ 1నుంచి 1954 నవంబర్ 15వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన తర్వాత 135 రోజుల పాటు ఆంధ్రరాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కొనసాగింది. 1955 మార్చి 28న ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా బి.గోపాల రెడ్డిని కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసింది. ఆయన 1956 నవంబర్ 1వరకు అంటే 584 రోజుల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1956 నవంబర్ 1వ తారీఖున హైదరాబాద్ రాష్ట్రాన్ని, ఆంధ్రరాష్ట్రాన్ని పెద్దమనుషుల ఒప్పందం మేరకు ఒక్కటిగా చేశారు. ‘ఆంధ్రప్రదేశ్’ పేరుతో నూతన రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు.

తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలను కలిపితే ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 1956 నుంచి 1983 వరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే ముఖ్యమంత్రులుగా పనిచేశారు. దాదాపు 27 ఏళ్ల పాటు ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్‌కు ఎదురులేకుండా పోయింది. ఈ 27ఏళ్ల కాంగ్రెస్ పార్టీనుంచి ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారి పూర్తి వివరాలివి :

పేరు పదవీ కాలం మొత్తం రోజులు
దామోదరం సంజీవయ్య 11-1-1960 నుంచి 12-3-1962 1167
నీలం సంజీవరెడ్డి 12-3-1962 నుంచి 20-02-1964 719
కాసు బ్రహ్మానందరెడ్డి 21-02-1964 నుంచి 30-09-1971 2777
పీవీ నరసింహారావు 30-09-1971 నుంచి 10-01-1973 468
(11-01-1973 నుంచి 10-12-1973 వరకు రాష్ట్రపతి పాలన)
జలగం వెంగళరావు 10-12-1973 నుంచి 06-03-1978 1547
మర్రి చెన్నారెడ్డి 06-03-1978 నుంచి 11-10-1980 950
టంగుటూరి అంజయ్య 1-11-1956 నుంచి 11-1-1960 501
భవనం వెంకట్రామిరెడ్డి 24-02-1982 నుంచి 20-09-1982 208
కోట్ల విజయభాస్కర రెడ్డి 20-09-1982 నుంచి 09-01-1983 111

1956 నుంచి 1983 వరకు 27 ఏళ్లలో.. మొత్తం పది సార్లు ముఖ్యమంత్రులను కాంగ్రెస్ అధిష్టానం మార్చింది. ఢిల్లీ నుంచి వచ్చే సీల్డ్ కవర్‌పైనే ఏపీలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రుల భవిష్యత్ అధారపడి ఉండేది. హైదరాబాద్ విమానాశ్రయంలో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ తనయుడు రాజీవ్‌గాంధీ.. అప్పటి ఏపీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి టీ.అంజయ్యను తీవ్రంగా అవమానించడంతో 1982 మార్చి 29న సినీ హీరో నందమూరి తారకరామారావు ‘తెలుగుదేశం’ పార్టీని స్థాపించారు. అప్పటికే అయిదేళ్లలోనే వరుసగా నలుగురు ముఖ్యమంత్రులను మార్చడంతో కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత పెల్లుబికింది. ఆ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎన్టీఆర్ కనిపించడంతో.. ఆ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ప్రజలు పట్టం కట్టారు. కాంగ్రెస్ పార్టీలోని మహామహులు సైతం ఓటమి చవిచూశారు. 1983 జనవరి 9వ తారీఖున ఆంధ్రప్రదేశ్‌లో మొట్టమొదటి కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ప్రమాణస్వీకారం చేశారు.

నాదెండ్ల ఉదంతం.. కాంగ్రెస్‌కు అప్రదిష్ట 1984లో గుండెకు సంబంధించిన శస్త్ర చికిత్స కోసం ఎన్టీఆర్ అమెరికాకు వెళ్లిపోవడంతో.. ఏపీ రాజకీయాల్లో పెను మార్పులు సంభవించాయి. కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరి ఆర్ధికశాఖ మంత్రిగా ఉన్న నాదెండ్ల భాస్కరరావు.. తనకు మెజారిటీ ఉందంటూ గవర్నర్ అపాయింట్‌మెంట్ తీసుకున్నారు. ఎమ్మెల్యేల నుంచి సంతకాలు సేకరించి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇలా ఎన్టీఆర్ నుంచి ముఖ్యమంత్రి పదవిని నాదెండ్ల భాస్కర్‌రావుకు బదిలీ చేయడంలో అప్పటి గవర్నర్ రాంలాల్ ముఖ్య పాత్ర పోషించారు. అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ కనుసన్నల్లోనే ఈ తతంగమంతా జరిగింది. చికిత్స పూర్తయ్యాక అమెరికా నుంచి తిరిగి వచ్చిన ఎన్టీఆర్‌కు ఈ విషయం తెలిసి రగిలిపోయారు. డాక్టర్లు వద్దని వారిస్తున్నా, ఆరోగ్యం సహకరించకపోయినా మరోసారి ప్రజల్లోకి వెళ్లారు. ‘ప్రజాస్వామ్య పరిరక్షణ’ పేరుతో తనకు జరిగిన అన్యాయం గురించి వెలుగెత్తి చాటారు. దొడ్డిదారిన అధికార అందలమెక్కిన ఉదంతాన్ని ఊరూరా చాటిచెప్పారు. ఆయన అల్లుడు చంద్రబాబు నేతృత్వంలో ఎన్టీఆర్‌కు మద్ధతుగా ఉన్న ఎమ్మెల్యేలతో రాష్ట్రపతి భవన్ ఎదుట భారీ పరేడ్‌ను నిర్వహించారు. ఎన్టీఆర్ చేపట్టిన ఈ ఉద్యమానికి కాంగ్రెసేతర ప్రాంతీయ, జాతీయ పార్టీల మద్ధతును కూటగట్టడంలో చంద్రబాబు సఫలమయ్యారు. అప్పటికే జాతీయ రాజకీయాల్లో ఉన్న తెలుగువాడైన వెంకయ్యనాయుడు చంద్రబాబుకు, టీడీపీకి అండగా ఉన్నారు. ఎన్టీఆర్‌కు అప్పటి కాంగ్రెసేతర పార్టీలన్నీ మద్ధతు ప్రకటించడంలో కీలక పాత్ర వహించారు. జనతాపార్టీ, భారతీయ జనతాపార్టీ, వామపక్షాలు, డీఎంకే, నేషనల్ కాన్ఫరెన్స్ వంటి పార్టీలు ఎన్టీఆర్‌కు అండగా నిలిచాయి. నెలరోజుల పాటు జరిగిన తెలుగు ప్రజల ఆందోళనలతో కేంద్ర ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. గవర్నర్ రాంలాల్‌ను తొలగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. నూతన గవర్నర్‌గా శంకర్ దయాల్ శర్మను నియమించింది. నాదెండ్ల భాస్కర్‌రావును ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగిస్తున్నట్లు గవర్నర్ ప్రకటించారు. దీంతో మరోసారి ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ప్రమాణస్వీకారం చేశారు.

1985 ఎన్నికల్లో ఓటమి.. 1989లో గెలుపు : ఎమ్మెల్యేల తిరుగుబాటు, మంత్రుల బెదిరింపు దోరణులతో విసిగిపోయిన ముఖ్యమంత్రి ఎన్టీఆర్.. మధ్యంతర ఎన్నికలకు వెళ్లారు. అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ దారుణ హత్యకు గురవడం.. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ అనుకూల పవనాలు వీస్తుండటంతో.. తమ గెలుపు ఖాయమని ఏపీ కాంగ్రెస్ నేతలు భావించారు. అయినప్పటికీ తెలుగు ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాకిచ్చారు. తెలుగుదేశం పార్టీకే మళ్లీ పట్టం కట్టారు. 1985 ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి పీఠమెక్కిన తర్వాత ఎన్టీఆర్ తీసుకున్న పలు వివాదాస్పద నిర్ణయాలు కాంగ్రెస్ పార్టీకి లాభించాయి. ప్రభుత్వ ఉద్యోగుల పదవీవిరమణ వయసును తగ్గించడం, అప్పట్లో కుల సంఘర్షణలు జరగడం, నక్సలైట్లు నిజమైన దేశభక్తులంటూ కీర్తించడం ఎన్టీఆర్‌కు చెడ్డ పేరు తీసుకొచ్చాయి. అంతేకాకుండా మంత్రి వర్గాన్ని అంతగా పట్టించుకోకపోవడం, తానే ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం, ఎన్నికలకు కొద్ది నెలలు ముందుగా మొత్తం మంత్రివర్గాన్ని రద్దు చేసి కొత్త మంత్రివర్గాన్ని ఎంపికచేసుకోవడం వంటి వింత పోకడలను ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. ఇలా ఎన్టీఆర్ వరుస స్వయంకృతాపరాధాలతో 1989లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అయితే గతంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకునే ప్రయత్నాలను కాంగ్రెస్ పార్టీ చేయలేకపోయింది. గతంలోలాగానే వరుసగా ముఖ్యమంత్రులను మార్చడం, అధిష్టానానికి ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటూ కాలం గడపడంతో కాంగ్రెస్ పార్టీపై ప్రజలు విసిగిపోయారు. ఆ సమయంలోనే ప్రధానమంత్రిగా పీవీ నరసింహారావు ఎన్నికవడం, నంద్యాల ఉప ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ చూపిన దౌత్యానికి తెలుగు ప్రజలు ఫిదా అయ్యారు. ‘తెలుగు వ్యక్తి దేశ పాలకుడు అవుతున్నారు. ఆయనపై తెలుగుదేశం పార్టీ పోటీచేయబోదు..’ అంటూ ఎన్టీఆర్ చేసిన ప్రకటన తెలుగు ప్రజల మెప్పును పొందింది. మొత్తానికి 1991 ఉప ఎన్నికల్లో పీవీ నరసింహారావుకు పోటీ పెట్టకుండా ఉండటం, తెలుగువ్యక్తి ప్రధానమంత్రి అవడం.. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గుర్తుంచుకోదగిన అంశమని చెప్పవచ్చు.

1994 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఘోర పరాభవం 1989లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. స్వయంగా ఎన్టీఆర్ ఓ చోట ఓటమి పాలయ్యారు. ఆ గెలుపును తదుపరి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నిలుపుకోలేకపోయింది. ఈ అయిదేళ్ల కాలంలో ముగ్గురు ముఖ్యమంత్రులను మార్చింది. 03-12-1989 నుంచి 17-12-1990 వరకు మర్రి చెన్నారెడ్డి, ఆయన తర్వాత 09-10-1992 వరకు నేదురుమల్లి జనార్ధనరెడ్డి, ఆ తర్వాత 12-12-1994 వరకు కోట్ల విజయభాస్కరరెడ్డి ముఖ్యమంత్రులుగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ స్వీయ తప్పిదాలతోపాటు ఎన్టీఆర్ ప్రకటించిన సంక్షేమ పథకాలు కూడా 1994 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపునకు కారణమయ్యాయి. రెండు రూపాయలకే కిలోబియ్యం, సంపూర్ణ మధ్యపాన నిషేధం.. వంటి వినూత్న సంక్షేమ పథకాలకు ఎన్టీఆర్ శ్రీకారం చుట్టారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలయింది. టీడీపీ ఆవిర్భావం తర్వాత మొట్టమొదటిసారి 1983లో గెలుపొందిన సీట్ల కంటే ఎక్కువ అసెంబ్లీ స్థానాలను సాధించింది. ఆ ఎన్నికల్లో టీడీపీ మొత్తం 296 సీట్లకు గానూ 226 సీట్లను తెలుగుదేశం పార్టీ హస్తగతం చేసుకుంది. ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ప్రమాణస్వీకారం చేశారు.

పదేళ్లు అధికారానికి దూరంగా కాంగ్రెస్ : 1994లో ఓటమి తర్వాత కాంగ్రెస్ పార్టీ పదేళ్ల పాటు అధికారానికి దూరంగా ఉండిపోయింది. 1995లో ఎన్టీఆర్ నుంచి చంద్రబాబుకు అధికార మార్పిడి జరిగింది. టెక్నాలజీ, ఐటీ పెట్టుబడుల వంటి వినూత్న చర్యలతో చంద్రబాబు యువతకు దగ్గరయ్యారు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంపూర్ణమధ్యపాన నిషేధాన్ని చంద్రబాబు నీరుగార్చినా, రూ.2 బియ్యాన్ని రూ.5 చేసినా చంద్రబాబు వ్యూహాత్మక చర్యలతో 1999 ఎన్నికల్లో గెలుపొంది అధికారాన్ని నిలబెట్టుకోగలిగారు. ఆ ఎన్నికల్లో బీజేపీతో పొత్తుపెట్టుకుని టీడీపీ విజయకేతనం ఎగురవేసింది. దీంతో 1999 నుంచి 2004 వరకు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలోనే ఉండిపోవాల్సి వచ్చింది. ప్రధాన ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అనుకూల పవనాలు బలంగా వీచిన సమయంలో ఎన్నికల్లో గెలిచిన వారిలో ముఖ్యుడయిన వైఎస్ రాజశేఖరరెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం గుర్తించింది. ఆయనకు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలను అప్పజెప్పింది. తన రాజకీయ చతురతతో, వ్యూహాత్మక నిర్ణయాలతో ఏపీలో కాంగ్రెస్‌కు పునర్వైభవం తీసుకువచ్చేందుకు వైఎస్ తీవ్రంగా కృషిచేశారు.

వైఎస్ పాదయాత్ర.. 2004లో అధికారంలోకి కాంగ్రెస్ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రోజురోజుకు బలపడిపోవడంతో.. కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చేందుకు వైఎస్ రాజకీయ వ్యూహాలను అనుసరించారు. చంద్రబాబు ఎక్కడయితే తప్పులను చేస్తూ వచ్చారో.. వాటినే ఆయన ఆయుధాలుగా మార్చుకున్నారు. 2004 ఎన్నికలకు ముందు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రకు పూనుకున్నారు. మండువేసవిలో మూడు నెలల పాటు 1475 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తెచ్చారు. 2004లో జరిగిన ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఉండేందుకు అన్ని పార్టీలను కలుపుకుని పోయారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం 2001లో టీడీపీకి రాజీనామా చేసి ‘తెలంగాణ రాష్ట్ర సమితి’ పార్టీని పెట్టిన కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుతో చర్చలు జరిపారు. తెలంగాణకు తాము అనుకూలమేనని కేంద్రంలోని ముఖ్యులతో చెప్పించి ఆ పార్టీతో పొత్తుకు లైన్‌క్లియర్ చేసుకున్నారు. వామపక్షాలను కూడా కలుపుకుని 2004 ఎన్నికల్లో ‘మహాకూటమి’ని వైఎస్ ఏర్పాటు చేశారు. టీడీపీ-బీజేపీ కూటమి, కాంగ్రెస్-టీఆర్ఎస్-వామపక్షాల కూటమి మధ్య జరిగిన పోరులో... మహాకూటమి విజయం సాధించింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే అంతకుముందులా ముఖ్యమంత్రులను మార్చడానికి కాంగ్రెస్ పార్టీ సాహసించలేకపోయింది. పాదయాత్రతో రాష్ట్ర వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సాధించడంతోపాటు ఏపీ కాంగ్రెస్‌పై వైఎస్ పూర్తి పట్టు సాధించారు. దీంతో ఆ అయిదేళ్ల పాటు వైఎస్‌నే ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ కొనసాగించింది.

2009లో మరోసారి అధికారంలోకి... 2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనేక ఆటుపోట్లను ఎదుర్కొంది. 2004లో ఏ పార్టీలతో అయితే కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుందో... అవే పార్టీలు టీడీపీతో జతకట్టాయి. టీడీపీ-టీఆర్ఎస్-వామపక్షాలు కలిసి ‘మహాకూటమి’గా ఏర్పడి ఆ ఎన్నికల్లో పోటీ చేశాయి. వాటికి తోడు సినిమాల్లో మెగాస్టార్‌గా వెలిగిన చిరంజీవి కొత్తగా ‘ప్రజారాజ్యం’ పార్టీని స్థాపించారు. ఆ పార్టీ కూడా 2009 ఎన్నికల బరిలోకి దిగింది. వీటితోపాటు బీజేపీ, లోక్‌సత్తా పార్టీలు కూడా ఎన్నికల్లో పోటీ చేశాయి. తెలంగాణ అంశం ఆ ఎన్నికల్లో తీవ్రంగా ప్రభావం చూపింది. ప్రత్యేక తెలంగాణ ఇస్తామని చెప్పి తమతో 2004 ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నారనీ, ఆ తర్వాత మాట మార్చి కాలయాపన చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి కాంగ్రెస్‌పై మండి పడింది. కాంగ్రెస్‌ను తెలంగాణలో దోషిగా నిలబెట్టాలనుకుంది. అయితే ఆ ఎన్నికల్లో అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రాగలిగింది. తెలంగాణలో మొదటి విడతలో పోలింగ్ పూర్తి కాగానే వైఎస్ చేసిన కొన్ని వ్యాఖ్యలు సీమాంధ్రలో జరగబోయే పోలింగ్‌పై తీవ్రంగా ప్రభావం చూపాయి. ‘మహాకూటమి అధికారంలోకి వస్తే హైదరాబాద్‌కు వెళ్లేందుకు సీమాంధ్రులు పాస్‌పోర్ట్ తీసుకోవాల్సి వస్తుంది’ అంటూ తెలంగాణలో పోలింగ్ ముగిసిన వెంటనే సీమాంధ్రలో ప్రచారంలో ఉన్న వైఎస్ వ్యాఖ్యానించడంతో పరిస్థితులున్నీ ఒక్కసారిగా తారుమారయ్యాయి. వీటితోపాటు ప్రభుత్వ వ్యతిరేక ఓటును ప్రజారాజ్యం పార్టీ, లోక్‌సత్తా పార్టీ భారీగా చీల్చాయి. దీంతో చంద్రబాబు నాయకత్వంలో ఏర్పడిన టీడీపీ కూటమికి పరాజయం తప్పలేదు.

వైఎస్ మరణం- తెలంగాణ ఉద్యమం : 2009లో మరోసారి గెలిచి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆ ఎన్నికల్లో గెలుపొందాక సీఎం పీఠం కోసం చాలామంది సీనియర్ నేతలు పోటీ పడినా అధిష్టానం మాత్రం వైఎస్‌ వైపే మొగ్గు చూపింది. ఎన్నికల్లో గెలుపొందాక ‘రచ్చబండ’ పేరుతో గ్రామయాత్రలకు బయలుదేరిన వైఎస్.. అనూహ్య రీతిలో విమాన ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. 2009వ సంవత్సరం సెప్టెంబర్ 2న ఆయన మరణించారు. ఆయన తర్వాత ముఖ్యమంత్రి పదవిని.. ఆయన తనయుడు జగన్‌ మోహన్‌ రెడ్డి ఆశించినా.. కాంగ్రెస్ అధిష్టానం కొణిజేటి రోశయ్యను ముఖ్యమంత్రిగా ఎంపికచేసింది. ‘మీ భవిష్యత్తుకు మాదీ హామీ’.. అంటూ జగన్‌కు సోనియా, రాహూల్ భరోసా ఇచ్చారు. రోశయ్య ముఖ్యమంత్రి అయ్యాక ఏపీ రాజకీయాల్లో పెను మార్పులు సంభవించాయి. ప్రత్యేక తెలంగాణ కోసం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడం, తెలంగాణ ఉద్యమం తారస్థాయికి చేరడం వంటివి వెంటవెంటనే జరిగిపోయాయి. ప్రత్యేక రాష్ట్రం విద్యార్థులు, ఉద్యోగులు, తెలంగాణలోని అన్ని పార్టీల నాయకులు ఒత్తిళ్ల మధ్య సీఎంగా రోశయ్య పనిచేయలేకపోయారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై 2010 ఫిబ్రవరి 3న శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర సర్కారు ప్రకటించింది. అదే ఏడాది డిసెంబర్ 30లోపు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై నివేదిక అందించాల్సిందిగా డెడ్‌లైన్ విధించింది. అయితే కమిటీని ఏర్పాటు చేసి తెలంగాణ ఉద్యమాన్ని తాత్కాలికంగా ఆపగలిగిన కాంగ్రెస్.. సొంత పార్టీలోని అసమ్మతిని మాత్రం ఎదుర్కొనలేకపోయింది. తనను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించండంటూ అధిష్టానానికి ఆయన విన్నవించుకున్నారు. దీంతో తదుపరి ముఖ్యమంత్రిగా జగన్‌ను అధిష్టానం ఎంపిక చేస్తుందని అంతా భావించారు. అయితే కాంగ్రెస్ పార్టీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రిగా కిరణ్‌కుమార్ రెడ్డిని ఎంపిక చేసినట్లు ప్రకటించింది. దీంతో 2010వ సంవత్సరం నవంబర్ 25న కిరణ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. దీంతో కాంగ్రెస్‌లో మంత్రి పదవిని చేపట్టుకుండా ముఖ్యమంత్రి అయిన వ్యక్తిగా కిరణ్‌కుమార్ రెడ్డి రికార్డులకెక్కారు.

జగన్ వేరు కుంపటి.. అవిశ్వాసం.. రాష్ట్ర విభజన : రోశయ్య తర్వాత ముఖ్యమంత్రిగా కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. కిరణ్‌ను ముఖ్యమంత్రిని చేయడంతో కాంగ్రెస్‌లోని జగన్ వర్గం భరించలేకపోయింది. వైఎస్‌ పథకాలను కిరణ్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందంటూ ప్రకటనలు చేసి సర్కారుకు కొత్త తలనొప్పులు తీసుకురావడం జగన్ అనుకూలురు ప్రారంభించారు. దీంతోపాటు కిరణ్ ముఖ్యమంత్రి అయిన రెండు నెలలకే 2011వ సంవత్సరం జనవరి 6న శ్రీకృష్ణ కమిటీ సమగ్ర నివేదికను కేంద్ర సర్కారుకు అందించింది. తెలంగాణ ఏర్పాటు అవసరం లేదంటూ ఆ కమిటీ తీర్మానించింది. ఆ ప్రాంత అభివృద్ధి కోసం కొన్ని చట్టాలు, నిధులు ఇస్తే సరిపోతుందని పేర్కొంది. విభజన వల్ల మరిన్ని సమస్యలు ఉత్పన్నమవుతాయని వెల్లడింది. ఈ రిపోర్టులపై తెలంగాణ ప్రజలు భగ్గుమన్నారు. మరోసారి మలిదశ ఉద్యమం మొదలయింది. విద్యార్థులు, ఉద్యోగులు, సామాన్య ప్రజలు కూడా తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకున్నారు. వారిని నిలువరించలేని పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వానిది. అదే సమయంలో కాంగ్రెస్‌లోని జగన్ వర్గం గట్టి షాకిచ్చింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశ పెట్టిన అనేక పథకాలకు కిరణ్ సర్కారు తూట్లు పొడిచిందని ఆరోపిస్తూ.. అవిశ్వాస తీర్మానాన్ని జగన్ తల్లి విజయమ్మ ప్రతిపాదించింది. దాదాపు 15మందికి పైగా ఎమ్మెల్యేలు జగన్ వైపు ఉంటారని నిర్ణయానికి వచ్చిన కిరణ్ సర్కారు రాజకీయ నిర్ణయాలకు అంకురార్పణ జరిపింది. కాంగ్రెస్ అధిష్టానం వ్యూహాత్మకంగా వ్యవహరించి ప్రజారాజ్యం పార్టీతో చర్చలు జరిపారు. ఎన్నికల పేరుతో ప్రజాధనాన్ని వృధా చేయరాదన్న కారణంతో తాము కిరణ్ సర్కారుకు మద్ధతిస్తున్నట్లు ఆ పార్టీ అధినేత చిరంజీవి ప్రకటించారు. తమకు ఉన్న 18 మంది ఎమ్మెల్యేలతో అవిశ్వాసానికి వ్యతిరేకంగా ఓటు వేయిస్తామంటూ ప్రకటన చేసింది. దీంతోపాటు సభలో నుంచి టీడీపీ సభ్యులు వాకౌట్ చేయడంతో కిరణ్ సర్కారు అవిశ్వాసం వేటు నుంచి బయటపడగలిగింది. ఆ తర్వాత.. తండ్రి మరణాన్ని తట్టుకోలేక మరణించిన వారిని పరామర్శించేందుకు తలపెట్టిన ‘ఓదార్పు యాత్ర’కు కూడా సీనియర్లు అడ్డు పడటం, అధిష్టానం కూడా నిరాకరించడంతో కాంగ్రెస్ పార్టీకి జగన్ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

2011వ సంవత్సరం మార్చి 12న జగన్ ‘వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ’ని స్థాపించారు. ఆయనతోపాటు పలువురు ఎమ్మెల్యేలు కూడా పార్టీకి, పదవులకు రాజీనామా చేసి జగన్ పార్టీలో చేరారు. దీంతో కాంగ్రెస్ పార్టీ బలహీన పడటం మొదలయింది. ఇటు జగన్ వైపు నిలిచిన ఎమ్మెల్యేలు, అటు తెలంగాణ కోసం రాజీనామా చేసిన ఎమ్మెల్యేలతో రాష్ట్రంలో ఉప ఎన్నికలు వచ్చాయి. అధికార పార్టీ కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం.. ఆ ఉప ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని పొందాయి. టీఆర్ఎస్, వైసీపీ సభ్యులు విజయం సాధించారు. కడప ఎంపీగా జగన్, పులివెందుల ఎమ్మెల్యేగా ఆయన తల్లి విజయమ్మ గెలుపొందారు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం బలపడటం, సకలజనుల సమ్మెతో కాంగ్రెస్ అధిష్టానం దిగొచ్చింది. ‘ప్రత్యేక తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తా’నన్న కేసీఆర్ హామీతో తెలంగాణ ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఏపీలో సమైఖ్యాంధ్ర ఉద్యమం నడిచినా, ఏపీ ఎంపీలు పార్లమెంట్‌లోనే నిరసనలు చేపట్టినా, ఏకంగా కాంగ్రెస్ పార్టీకే చెందిన సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి సమైఖ్యాంధ్ర కావాలంటూ అసెంబ్లీలో తీర్మానం చేసి పంపినా కాంగ్రెస్ అధిష్టానం ఏమాత్రం వెనకడుగు వేయలేదు. చివరకు సీఎం కిరణ్ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించినా పార్లమెంట్‌లో ‘ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014’ను ఆమోదింపజేసింది. ఏపీకి ప్రత్యేక హోదా, పలు జాతీయ విద్యాసంస్థలు, లోటు బడ్జెట్‌ను పూడ్చటం, రాజధానికి నిధులివ్వడం వంటి హామీలతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను రెండు రాష్ట్రాలుగా విభజించింది.

ఏపీలో ఘోర పరాభవం.. తెలంగాణలోనూ ఓటమి ప్రత్యేక రాష్ట్రం ప్రకటిస్తే పార్టీని విలీనం చేస్తానన్న కేసీఆర్.. మాట మార్చడం, పార్టీని విలీనం చేయకపోవడంతో కాంగ్రెస్ పార్టీ ఖంగుతింది. అయినా తేరుకుని తెలంగాణ తెచ్చిన క్రెడిట్ తమదేనంటూ కాంగ్రెస్ పార్టీ ప్రకటించుకుంది. 2014 ఎన్నికల్లో ఏపీ, తెలంగాణలో ఒంటరిగా పోటీ చేసింది. కేంద్ర మంత్రిగా పనిచేసిన పురంధరేశ్వరి, కావూరి సాంబశివరావు వంటి వారితోపాటు ఉండవల్లి అరుణ్ కుమార్, సబ్బం హరి, లగడపాటి రాజగోపాల్, పనబాక లక్ష్మి వంటి సీనియర్లలో కొందరు పార్టీలు మారడం, ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండటం చేశారు. తాము వద్దంటున్న విభజన చేసిందని ప్రకటనలు చేసి ఏపీలో కాంగ్రెస్ అడ్రస్ గల్లంతు చేశారు. దీంతోపాటు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా చేసిన కిరణ్ కుమార్ రెడ్డి సమైఖ్యాంధ్ర పార్టీని ఏర్పాటు చేశారు. మెజారిటీ కాంగ్రెస్ ఓటు బ్యాంక్ జగన్ పార్టీ వైపు మళ్లింది. 2014లో జరిగిన ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు గల్లంతయ్యాయి. ఒక్కటంటే ఒక్క ఎమ్మెల్యే సీటును కూడా కాంగ్రెస్ గెలుచుకోలేకపోయింది. సరైన న్యాయం చేయకుండా రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిందన్న కసితో ఏపీ ప్రజలు కాంగ్రెస్‌ను ఓడించారు. ఆ ఎన్నికల్లో తానే అధికారంలోకి వస్తానని జగన్ అనేకసార్లు ప్రకటించారు. అయితే అనూహ్యంగా చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ విజయం సాధించింది. టీడీపీకి 102 సీట్లు రాగా ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న బీజేపీ 5 సీట్లను గెలుచుకుంది. నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటమి తప్పలేదు. తెలంగాణ పునర్నిర్మాణం తెరాసాతోనే సాధ్యమని కేసీఆర్ చేసిన ప్రచారం తెలంగాణ ప్రజలను ఆకట్టుకుంది. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ 63 అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందగా టీడీపీ 15 స్థానాల్లో విజయం సాధించింది. ఏపీలో నష్టపోయినా ఫర్వాలేదనుకుని రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్‌కు 21 స్థానాలు మాత్రమే దక్కాయి. ఎంఐఎం, వైసీపీ, బీజేపీ, బీఎస్పీ, సీపీఐ, సీపీఎం పార్టీలు మిగతా సీట్లలో విజయం సాధించాయి. అయితే టీఆర్ఎస్‌కు అత్తెసరు మెజారిటీ ఉండటం ఏనాటికయినా నష్టమేనని భావించిన కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరతీశారు. టీడీపీ నుంచి గెలుపొందిన 12మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారు. ఇద్దరు బీఎస్పీ సభ్యులను, వైసీపీ సభ్యులకు పార్టీ కండువా కప్పారు. వీరితోపాటు పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. మొత్తానికి టీఆర్ఎస్ బలం 90కి చేరుకుంది. ఎమ్మెల్యేల చేరికలతోనే కేసీఆర్ ఆగిపోలేదు. తెలంగాణలో టీడీపీ, కాంగ్రెస్‌లను బలహీనం చేయాలని సంకల్పించారు. ఓటమి పాలయిన సీనియర్ లీడర్లను కూడా చేర్చుకున్నారు. ప్రధాన ప్రతిపక్షమయిన కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు శాసన సభ్యులపై సస్పెన్షన్ వేటు వేశారు. ప్రత్యర్థి పార్టీలన్నీ బలహీనం అయ్యాక రాజకీయ నిర్ణయాలకు శ్రీకారం చుట్టారు. పూర్తి కాలం పదవిలో కొనసాగకుండా.. 9 నెలలు పదవీ కాలం ఉండగానే ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నట్లు కేసీఆర్ ప్రకటించి సంచలనం సృష్టించారు. అభ్యర్థులను కూడా ప్రకటించి ప్రత్యర్థి పార్టీలను ఖంగుతినిపించారు.

టీడీపీతో తొలిసారి పొత్తు : కేసీఆర్‌ను ఎదుర్కొనేందుకు, ఆయనను ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన చేసింది. తనకు వ్యతిరేకంగా పుట్టిన టీడీపీతోనే కాంగ్రెస్ పార్టీ పొత్తుకు తలుపులు తెరిచింది. తెలంగాణలో టీడీపీకి ఇప్పటికీ బలమైన ఓటుబ్యాంకు ఉండటం తమకు కలిసి వస్తుందని ఆ పార్టీ ఆశిస్తోంది. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కోదండరాం ‘తెలంగాణ జనసమితి’ని ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పెద్దలు ఆ పార్టీతో కూడా పొత్తు చర్చలు సాగించారు. మొత్తానికి తెలుగుదేశం-తెలంగాణ జన సమితి-సీపీఐ పార్టీలతో కలిసి కాంగ్రెస్ పార్టీ మహాకూటమిని ఏర్పాటు చేస్తోంది. ఈ మహాకూటమి టీఆర్ఎస్‌ను అధికారంలోకి రానీయకుండా అడ్డుకోగలుగుతుందో.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతుందో లేదో.. వేచిచూడాలి. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సారధ్యంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందో లేదో కొద్ది రోజుల్లోనే తేలనుంది. ఇక ఏపీలో కూడా తాము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తామన్న హామీతో జనాల్లోకి వెళ్తోంది. గతంలో కోల్పోయిన కేడర్‌ను తిరిగి పార్టీలోకి రప్పించుకుంటోంది. 2014లో ఎన్నికలకు దూరంగా ఉన్న నాయకులను పార్టీలో యాక్టివ్‌గా ఉంచుతోంది. మాజీ సీఎం కిరణ్‌కుమార్ రెడ్డిని మళ్లీ పార్టీలోకి రప్పించింది. వచ్చే ఓటింగ్ శాతాన్ని పెంచుకుంటామని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ధీమాగా చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో వేచిచూడాలి.