సీపీఎం

COMMUNIST PARTY OF INDIA (MARXIST)- CPM

స్వాతంత్ర్యోద్యమంలో కమ్యూనిస్ట్ పార్టీ పాత్ర : స్వాంతంత్ర్యోద్యమంలో గాంధీజీ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రధాన భూమిక పోషించినా.. ప్రజల తరపున నూతన భావాలను ప్రతిపాదించింది కమ్యూనిస్టులే. భూస్వామ్య రాచరిక వ్యతిరేక పోరాటాలకు నాంది పలికారు. కేరళలో పున్నప్రా వయిలార్‌, బెంగాల్‌లో తెభాగ, త్రిపుర సంస్థానం, తెలుగునాట ఉత్తరాన మందసా నుంచి మునగాల పరగణా, చల్లపల్లి జమీందారు వంటి వారికి వ్యతిరేకంగా పోరాటాలు చేశారు. దీనంతటికి శిఖర స్థాయిలో వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నిర్వహించారు. ఆ విధంగా శ్రమజీవులనూ అణగారిన తరగతులను కదిలించి గొంతునిచ్చింది విముక్తి సమరాలకు ముందు నిలిచింది కమ్యూనిస్టులే. అప్పటి వరకూ మహజర్లకూ అధినివేశ ప్రతిపత్తి వంటి కోర్కెలకు పరిమితమైన కాంగ్రెస్‌... కమ్యూనిస్టులు వచ్చాకే సంపూర్ణ స్వాతంత్రం నినాదమిచ్చింది. అమరజీవి భగత్‌సింగ్‌తో సహా ఎందరో జాతీయ విప్లవ యోధులు కమ్యూనిస్టు భావజాలం వైపు ఆకర్షితులైనారు. ఆయన బృందాన్ని ఉరితీసినా మిగిలిన సహచరులంతా కమ్యూనిస్టు పార్టీ వైపు వచ్చారు. ఈ కారణం చేతనే బ్రిటిష్‌ పాలకులు కమ్యూనిస్టు పార్టీపై ప్రత్యేకంగా కక్ష గట్టారు. దశాబ్దాలుగా వుంటున్న కాంగ్రెస్‌పై ఎన్నడూ ఏ నిషేధం విధించని బ్రిటీష్ పాలకులు.. కమ్యూస్టుపార్టీని మాత్రం నిషేదించారు. పార్టీ నాయకులు, సానుభూతి పరుల మీద కేసుల పెట్టి వేధించారు. కొన్ని వేలమంది కమ్యూనిస్టులను బ్రిటీష్ పాలకులు ఊచకోత కోశారు. జైళ్లపాలు చేశారు. కమ్యూనిస్టులు గాంధీజీ లాగే దేశీయ ఆర్థికాభివృద్ధిని కోరుకున్నారు. 1920లలోనే దేశంలో కమ్యూనిస్టులు, మరో వైపున ఆరెస్సెస్‌ ముందుకొచ్చాయి. కమ్యూనిస్టులు కుల, మత బేధం లేకుండా ప్రజలతో మమేకమవుతుంటే ఆరెస్సెస్‌ మాత్రం కేవలం ముస్లిం వ్యతిరేకతే ప్రధానమన్నట్టు వ్యవహరిస్తూ ఉండేది. బ్రిటిష్‌ వారు కూడా మతతత్వ రాజకీయాలను పెంచి పోషించడంతో చివరకు దేశ విభజన పరిణామాలు ఘోర మతమారణహోమం చూడవలసి వచ్చింది. స్వాతంత్రం వచ్చిన ఆరు నెలలకే మత రాజకీయాలకు గాంధీజీ బలయ్యారని కమ్యూనిస్టులు ఇప్పటికీ నమ్ముతుంటారు.

సీపీఎం పార్టీ ఏర్పాటు : స్వాతంత్రానంతరం కాంగ్రెస్‌ పాలకులు విదేశీ రుణాలపై మారుటోరియం ప్రకటించి బ్రిటిష్‌పెట్టుబడులను స్వాధీనం చేసుకునే బదులు వారితో మరింతగా కుమ్మక్కయ్యారు. ప్రజా వ్యతిరేక విధానాలతో ధనస్వాములను భుజాన మోశారు. అవకాశవాద పోకడలతో అస్తవ్యస్త పరిస్థితి సృష్టించారు. ఈ నేపథ్యంలో మరింత సమరశీల పోరాటాలకు సిద్ధమయ్యే బదులు వారిపట్ల మెతక వైఖరి అనుసరించాలని కమ్యూనిస్టు ఉద్యమంలోనే కొందరు ప్రతిపాదించారు. దాంతో విభేదించిన పుచ్చలపల్లి సుందరయ్య, ఎ.కె.గోపాలన్‌, బి.టి.రణదివే, హరికిషన్‌ సింగ్‌ సూర్జిత్‌, పి.రామమూర్తి, ప్రమోద్‌దాస్‌గుప్తా, మాకినేని బసవపున్నయ్య, జ్యోతిబసు, నంబూద్రిపాద్‌, ముజఫర్‌ అహ్మద్‌, తదితరులు తీవ్ర సైద్ధాంతిక పోరాటం నడిపారు. అంతేగాక విప్లవ కర సిద్ధాంత స్వచ్చత కోసం ప్రజా పోరాటాల పదును పెంచడం కోసం నూతన సంస్థను స్థాపించాలన్న నిర్ణయానికి వచ్చారు.. ఈ ఏర్పాటులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సుందరయ్య, బసవపున్నయ్య, మోటూరు హనుమంతరావు, నండూరి ప్రసాదరావు, తరిమెల నాగిరెడ్డిలతో పాటు ఇంకా అనేకులు ముఖ్యపాత్ర వహించారు. వారు ఈ ఆలోచనలు చేస్తున్న దశలోనే 1962లోనే చైనా యుద్ధాన్ని సాకుగా చూపి కమ్యూనిస్టు ఉద్యమంలో ముఖ్య భూమిక పోషించిన ఒక వర్గాన్ని జైలుపాలు చేశారు. అయినా గట్టిగా నిలబడి 1964 జులై7 నుంచి జులై 12 వరకూ తెనాలిలో జాతీయ సదస్సు జరిపి నూతన పార్టీ స్థాపనకై నిర్ణయించారు.మొత్తం మీద నిర్బంధం మధ్యనే 1964 నవంబరు7న భారత కమ్యూనిస్టు పార్టీ(మార్క్సిస్టు) ఏర్పడింది. పుచ్చలపల్లి సుందరయ్య తొలి ప్రధాన కార్యదర్శి అయ్యారు. అప్పటినుండి ఇప్పటివరకు సిపిఎం ఎప్పుడూ స్వతంత్ర విధానాన్నే అనుసరిస్తోంది.

సీపీఎంపై కాంగ్రెస్ దాడి పూర్తిగా ఏర్పడక ముందే సీపీఎంపై ప్రభుత్వం దాడి ప్రారంభించింది. చైనాతో తలెత్తిన సరిహద్దు సంఘర్షణను సంప్రదింపులతో పరిష్కరించుకోవాలని చెప్పడాన్ని సాకుగా చూపించి దాడిని తీవ్రతరం చేసింది. చైనాతో స్నేహ సంబంధాలు పెంచుకోవాలని మోదీతో సహా గతంలో ప్రధాని పీఠాన్ని అధిరోహించిన వారంతా చెబుతూనే ఉన్న మాటలను ఆ రోజుల్లోనే సీపీఎం చెప్పింది. దీంతో సీపీఎం నేతలపై చైనా ఏజంట్లని అప్పటి ప్రభుత్వం ముద్ర వేసింది.. లోక్‌సభలో అప్పటి హోంమంత్రి గుల్జారీ లాల్‌ నందా సీపీఎంపై ఆరోపణలతో ఒక చిట్టా చదివారు. అంతేగాక దేశమంతటా ఉన్న సీపీఎం నేతలను అర్థరాత్రి అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాల్లో ముఖ్యమైన నాయకులంతా జైళ్లపాలయ్యారు. బ్రిటిష్‌ వారు ఏ విధంగా కాంగ్రెస్‌ను గాక కమ్యూనిస్టుపార్టీని నిషేధించారో అలాగే కాంగ్రెస్‌ కేంద్ర ప్రభుత్వం కూడా సీపీఎంపై కక్ష గట్టి ఆదిలోనే దాడి చేసింది. ఇందుకోసం ప్రివెంటివ్‌ డిటెన్షన్‌(పీడీ)చట్టాన్ని పెద్ద ఎత్తున ప్రయోగించింది. అయితే అలా నాయకులందరినీ అరెస్టు చేసి జైళ్లలో కుక్కినా అప్పుడప్పుడే ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు ఎంతో ధైర్యంగా ప్రజల పక్షాన నిలబడ్డారు. సమస్యలపై ఉద్యమాలు సాగించారు. బంజరు భూముల పంపిణీ, డ్రైనేజీల మరమ్మత్తులు వంటి అంశాలపై పోరాడారు. ప్రజాశక్తి పత్రిక స్థానంలో ఎన్నో త్యాగాలు చేసి సమిష్టి కృషితో నిర్మించుకున్న విశాలాంధ్ర పత్రిక సిపిఐ చేతికిపోగా సిపిఎం తరపున డి.వి.సుబ్బారావు తదితరులు జనశక్తి పత్రికను స్థాపించారు. అరెస్టయిన నాయకుల విడుదల కోసం ఎందరో మేధావులు పౌర హక్కుల ఉద్యమం నడిపించారు. కొద్ది రోజుల తర్వాత ఆ మేధావులను కూడా అరెస్టు చేశారు.జైళ్లలోని డిటెన్యూల భార్యలు పిల్లలూ ప్రత్యేకంగా పోరాడిన తర్వాతనే ప్రభుత్వం కనీస హక్కులు, సదుపాయాలు కలిగించింది.

ఉద్యమాలకు తోడ్పాటు : నాటి కాలంలో శాసనసభలో సీపీఎం నేతలు రాజకీయంగా గట్టి పోరాటం చేసేవారు. శాసనసభలో సుందరయ్య సీపీఎం పక్ష నేతగా ఉండగా తరిమెల నాగిరెడ్డి ఉపనేతగా పనిచేశారు. ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాల సమస్యలపై ఆ రోజుల్లో అనేక హక్కులు సాధించుకోగలిగారు. 1966లో విశాఖ ఉక్కు ఉద్యమం ఆంధ్రప్రదేశ్‌ను ఊపేసింది. ఆ సమయంలో సీపీఎం శాసన సభ్యులందరూ రాజీనామా చేసి సంఫీుభావం ప్రకటించారు. అంతేగాక వివిధ సమస్యలపై జిల్లాలలోనూ విస్తారమైన ఉద్యమాలు నడిచాయి.

రూపాయికి కిలోబియ్యం : ఆనాటి ప్రభుత్వ విధానాల కారణంగా దేశంలో నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ముఖ్యంగా రాష్ట్రంలో బియ్యం ధరలు మండిపోయాయి. అలాంటి తరుణంలో చౌకదుకాణాల ద్వారా రూపాయకు కిలో బియ్యం అందించాలని సీపీఎం ఆందోళన చేసింది. ప్రభుత్వానికి కనువిప్పు కలిగించేందుకు రూపాయికే కిలోబియ్యాన్ని గన్నవరం ప్రాంతంలో ప్రజలకు పంచిపెట్టింది. మరికొన్ని చోట్ల కూడా ఇలాంటి కార్యక్రమాలనే చేపట్టారు. ఈ విధంగా ఒక ప్రతిపక్ష పార్టీ ఈ విధమైన కార్యక్రమం అమలు చేయడం అదే ప్రథమం. సహజంగానే ఇది ప్రభుత్వానికి మింగుడుపడలేదు. 1972లోనే పశ్చిమ బెంగాల్‌లో ఇందిరాగాంధీ బీభత్స కాండ సాగించి ఎన్నికలను బూటకంగా మార్చివేశారు. ఆ సమయంలో జ్యోతిబసును రాష్ట్రానికి ఆహ్వానించి ముఖ్య కేంద్రాలలో సభలు జరిపి సంఫీుభావం ప్రకటించింది.

పత్తి రైతుల ఆత్మహత్యలు- అప్పుల భారం : ప్రకాశం జిల్లాలో ప్రత్తి రైతులకు ధర పడిపోయి 1984, 85 సంవత్సరాల్లో ఆత్మహత్యలు ప్రారంభమైనప్పుడు సీపీఎం రైతుసంఘం దేశంలోనే మొదటిసారిగా ముందుగా ఆ సమస్యను గుర్తించాయి. గిట్టుబాటు ధర సమస్యను రంగం మీదకు తెచ్చాయి. ప్రత్తికి ధర కావాలంటూ నిర్భందాలను ఎదిరించి పోరాడారు. కొన్ని రాయితీలు సాధించేవరకు ఉద్యమం నడిచింది.

కరువులో ప్రజలకు అండగా : రాజకీయాలు, ఉద్యమాలతో పాటు సేవా కార్యక్రమాలలో కూడా సీపీఎం తనదైన పాత్రను పోషించింది. 1986లో మహబూబ్‌నగర్‌లో తీవ్రమైన కరువు ఏర్పడింది. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ యంత్రాంగం అశ్రద్ధ వల్ల ప్రజలు సహాయం అందక నానా బాధలు పడుతున్నారు. ఆ సమయంలో సీపీఎం దాతల సహాయంతో నిర్వహించిన గంజి కేంద్రాలు ఎంతో ఉపశమనం కలిగించాయి. అనంతపురంలో వరదులు విలయతాండవం చేసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సీపీఎం తన కేడర్‌ను పూర్తిగా రంగంలోనికి దింపి, శక్తికి మంచి ప్రజలకు సహాయ సహకారాలు అందించింది.

సారా వ్యతిరేకోద్యమం : 1992, 93లోనే జన విజ్ఞాన వేదిక, మహిళా సంఘం ఆధ్వర్యంలో సారా వ్యతిరేక ఉద్యమం ఊపందుకుంది. నెల్లూరు జిల్లాలో మొదలైన ఈ ఉద్యమం కొద్ది కాలంలోనే రాష్ట్రమంతటా వ్యాపించింది. సీపీఎం ఈ ఉద్యమానికి అండగా నిలిచింది. ఈ ఉద్యమమే 1994 ఎన్నికల్లో ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ‘సంపూర్ణ మధ్యపాన నిషేధం’ పథకాన్ని ప్రకటించేందుకు ఒక కారణమని చెప్పవచ్చు. మతతత్వానికి వ్యతిరేకంగా పోరాడుతూనే సీపీఎం కులతత్వాలపై కూడా సమరశంఖం పూరించింది. కుల వివక్షతా వ్యతిరేక పోరాట సంఘం(కెవిపిఎస్‌)ను స్థాపించి సమరశీల ఉద్యమానికి నడుం కట్టింది. సీపీఎం పోరాట ఫలితంగా చివరకు వెనకబడిన కులాల పరిస్థితిని అధ్యయనం చేసేందుకు జస్టిస్‌ పున్నయ్య అధ్యక్షతన ఒక కమిషన్‌ను నియమించాల్సి వచ్చింది. ఇది సామాజిక రంగంలో పెద్ద విజయం. 2000వ సంవత్సరం ఆగస్టు 28న విద్యుత్ సమస్యలపై సీపీఎం పార్టీ సమరశంఖం పూరించింది. చలో అసెంబ్లీ పిలుపునిచ్చింది. ఈ నిరసనలో బషీర్‌బాగ్ వద్ద జరిగిన పోలీసుల కాల్పుల్లో ముగ్గురు కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారు. ఇది అప్పటి చంద్రబాబు సర్కారుకు ఇబ్బందికర పరిస్థితులను తెచ్చింది. నీటి మీటర్లు, యూజర్‌చార్జీలు, ఔట్‌ సోర్సింగు వంటి అనర్థక పద్ధతుల ప్రమాదాన్ని ప్రారంభంలోనే గుర్తించి హెచ్చరించడమే గాక వాటికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేసింది. ఆ దశలో జరిగిన అంగన్‌వాడీ వర్కర్ల ఉద్యమం, ఆర్టీసీలో సమ్మెలకు మద్దతూ నిచ్చి వాటి విజయాల్లో రాజకీయ పాత్ర పోషించింది.

ఉదృతంగా భూపోరాటం : పేదలకు కనీస గృహ వసతికల్పించాలకి కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా సాగిన భూపోరాటం ప్రజల మనన్నలు పోందింది. ఈ పోరాటంలో అనేక మంది నాయకులు జెలు పాలు అయ్యారు. ఖమ్మం జిల్లా ముదిగొండలో ఈ పోరాటంపై కాల్పులు జరిపి ఏడుగురి ప్రాణాలు బలిగొనడం తీవ్ర ఆగ్రహానికి దారి తీసింది. సీపీఎం కుల వివక్షతా వ్యతిరేక పోరాట సంఘం తరపున నిరాహారదీక్ష జరిపి ఎస్సీ-ఎస్టీ సబ్‌ప్లాన్‌ను సాధించింది. జిల్లాలలో సమగ్రాభివృద్ధి యాత్రలు, సాగునీటి పాదయాత్రలు నిర్వహించింది. భాషారాష్ట్ర విభజనకు సీపీఎం వ్యతిరేకం. ఏపీ విభజనతో రెండు రాష్ట్రాల్లోనూ పార్టీ శాఖలను ప్రకటించింది. వాటికి కార్యదర్శులను నియమించింది. ఏపీ సీపీఎం కార్యదర్శిగా పెనుమల్లి మధుకు ... తెలంగాణ సీపీఎం కార్యదర్శిగా తమ్మినేని వీరభద్రంకు బాధ్యతలను అప్పగించింది.

2014 ఎన్నికల్లో దక్కని ప్రాతినిధ్యం : 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ పూర్తి మెజార్టీ తెచ్చుకోవడం, కాంగ్రెస్‌తో పాటు వామపక్షాల బలం కూడా బాగా తగ్గిపోవడం విధితమే.. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అయితే సీపీఎంకు ప్రాతినిధ్యం కూడా లేకుండా పోయింది. తెలుగు రాష్ట్రాల్లో విభజన తర్వాత కనీవినీ ఎరుగని స్థాయిలో పార్టీ ఫిరాయింపుల నడుమ జరిగిన ఎన్నికల్లో ప్రజా సమస్యలకు తావులేకుండా పోయింది. వామపక్షాలకు దేశంలో స్థానం లేకుండా చేయాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకోగా.. పోరాటాల ద్వారా ప్రజల మనసును గెలిచి పూర్వ వైభవాన్ని పొందాలని కమ్యూనిస్టులు భావిస్తున్నారు. దీనిలో భాగంగానే రైతు సమస్యలను భుజాన వేసుకున్నారు. తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌లకు సమదూరం పాటిస్తోంది. కాంగ్రెస్‌-టీడీపీ-టీజేఎస్ కూటమిలో సీపీఐ చేరినా.. సీపీఎం మాత్రం ఇతర కమ్యూనిస్టు పార్టీలతో పొత్తు పెట్టుకుని ‘బహుజన లెఫ్ట్ ఫ్రంట్’ను ఏర్పాటు చేసింది. దానికి కన్వీనర్‌గా తమ్మినేని వీరభద్రం వ్యవహరిస్తున్నారు. తెలంగాణలో జరుగుతున్న ముందస్తు ఎన్నికల్లో సత్తా చాటడంతోపాటు ఏపీలోనూ బలాన్ని పెంచుకునేందుకు సీపీఎం సమాయత్తమవుతోంది.