భారతీయ జనతాపార్టీ

Bharatiya Janata Party

బీజేపీ పూర్వ రూపం జన్‌సంఘ్. దీన్ని 1952వ సంవత్సరంలో డా. శ్యామాప్రసాద్ ముఖర్జీ స్థాపించారు. అయితే ఆయన 1953వ సంవత్సరంలో కశ్మీర్ జైల్లో ఉండగా మరణించారు. ఈ తర్వాత జనసంఘ్ 24 సంవత్సరాల రాజకీయాలు చేసినా.. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో చెప్పుకోదగ్గ విజయాలను సాధించలేదు. తొలి సార్వత్రిక ఎన్నికల్లో మూడు స్థానాలను మాత్రమే పొందింది. క్రమక్రమంగా పుంజుకుంటూ వచ్చింది. తర్వాత దీనికి అటల్ బిహారీ వాజ్‌పాయి, లాల్ కృష్ణ ఆడ్వాణీ లాంటి వారు నాయకత్వం వహిస్తూ వచ్చారు. 1977 ఎన్నికల్లో ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా పోరాడి జనతాపార్టీని గెలిపించుకున్నారు. తర్వాత మురార్జీ దేశాయ్ నాయకత్వంలో ఏర్పడిన తొలి కాంగ్రేసేతర ప్రభుత్వంలో వాజ్‌పాయ్ విదేశాంగ మంత్రిగానూ, ఆడ్వాణీ సమాచార శాఖ మంత్రిగానూ కీలక బాధ్యతలు నిర్వహించారు. అయితే కాంగ్రెస్‌ను విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ఇరుకున పెట్టే క్రమంలో ‘మండల్ కమిషన్’ సిఫార్సులను అమలు చేయడంతో జనతా పార్టీలో చీలికలు ప్రారంభమయ్యాయి. అవి కాస్తా దాని పతనానికి దారి తీసింది. ఈ పరిణామాలతో జనసంఘ్ నాయకులు ఆ కూటమి నుంచి బయటికి వచ్చేశారు. అప్పుడే సీనియర్ నాయకులైన అటల్ బిహారీ వాజ్‌పాయి, లాల్ కృష్ణ ఆడ్వాణీలు కలిసి 1980వ సంవత్సరం ఏప్రిల్ 6 న భారతీయ జనతా పార్టీని స్థాపించారు. అటల్ బిహారీ వాజ్‌పాయ్ ఆ పార్టీకి తొలి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు.

హిందు సంస్కృతి, సమాజ పరిరక్షణే తమ ప్రధాన ధ్యేయంగా బీజేపీ రాజకీయాలు సాగిస్తూ ఉంటుంది. పార్టీ ఏర్పాటు నుంచే కాంగ్రెస్‌కు ప్రధాన ప్రత్యర్థిగా రాజకీయాలను నెరపింది. పార్టీ అవసరాల కోసం, దేశ వ్యాప్తంగా పార్టీని విస్తరించేందుకు, కాంగ్రెస్, వామపక్ష పార్టీల ధోరణులను తిప్పికొట్టేందుకు కొన్ని ప్రాంతీయ పార్టీలతో బీజేపీ పొత్తు కుదుర్చుకుంది. అన్ని రాష్ట్రాల్లోనూ పార్టీలకు శాఖలను ఏర్పాటు చేసి వాటికి అధ్యక్ష, కార్యదర్శులను నియమించుకుంది. దీనిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్‌కు కూడా బీజేపీని విస్తరించారు. ఏపీలో బీజేపీ రాష్ట్ర శాఖకు పి.వి. చలపతి రావు, వెంకయ్య నాయుడు, బంగారు లక్ష్మణ్, వి. రామారావు, చిలకం రామచంద్రా రెడ్డి, బండారు దత్తాత్రేయ, హరిబాబు, జి. కిషన్ రెడ్డి లాంటి వారు అధ్యక్షులుగా పనిచేస్తూ వచ్చారు. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ శాఖకు కన్నా లక్ష్మీనారాయణ, తెలంగాణ శాఖకు కె. లక్ష్మణ్ అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పార్టీ జనసంఘ్‌గా ఉన్నప్పుడు మహారాష్ట్ర నుంచి వచ్చిన ఆరెస్సెస్ నాయకుడు గోపాల్‌రావు ఠాకూర్ మొట్టమొదటి జనరల్ సెక్రెటరీగా బాధ్యతలు నిర్వహించారు. ఆయన తర్వాత రాజమండ్రికి చెందిన ప్రముఖ న్యాయవాది అవసరాల రామారావు జనసంఘ్ ఆంధ్రప్రదేశ్ శాఖకు అధ్యక్షులుగా పనిచేశారు. 1956, 62 లో జరిగిన ఎన్నికల్లో జనసంఘ్ కూడా పాల్గొంది. అయితే మొదటిసారి ఎన్నికల్లో నెల్లూరు నియోజకవర్గం నుంచి అన్నదాత మాధవరావు శాసన సభ్యుడిగా గెలుపొందారు. 1966 లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసన మండలి గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గాలపై జనసంఘ్ దృష్టి సారించింది. ఈ ఎన్నికల్లో జూపూడి యజ్నా నారాయణ, సి.ఎస్. రాజు, వి. రామారావు, అన్నదాత మాధవరావు ఈ నలుగురూ వరుసగా శాసన మండలి సభ్యులుగా ఎన్నికవుతూ వచ్చారు. వి. రామారావు 1966, 72, 78, 84 సంవత్సరాల్లో జరిగిన శాసనమండలి ఎన్నికల్లో వరుసగా నాలుగు సార్లు విజయం సాధించారు. ఆ తర్వాత జనసంఘ్ బీజేపీగా మారిన తర్వాత 1984 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో కూడా ఎమ్మెల్సీగా కొనసాగారు. అప్పటి ఎన్టీఆర్ ప్రభుత్వం శాసన మండలిని రద్దు చేసే వరకు బీజేపీ శాసన మండలి సభా పక్ష నేతగా కొనసాగారు. అంతే కాకుండా 1993 నుంచి 2001 వరకు బీజేపీ ఆంధ్రప్రదేశ్ శాఖకు అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించారు.

1978వ సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌‌లో ఉదయగిరి నియోజకవర్గం నుంచి జనతా పార్టీ అభ్యర్థిగా ముప్పవరపు వెంకయ్య నాయుడు గెలుపొందారు. తర్వాత 1980 నుంచి శాసన సభలో భారతీయ జనతాపార్టీ శాసన సభా పక్ష నేతగా వ్యవహరించారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ప్రకటించిన తర్వాత తొమ్మిది నెలలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేసింది. అయితే ఈ ఎన్నికల్లో మళ్లీ అదే నియోజకవర్గం నుంచి వెంకయ్య నాయుడు శాసన సభ్యునిగా ఎన్నికై 1985 వరకు కొనసాగారు. వీరితో పాటు 1983 ఎన్నికల్లో హిమాయత్ నగర్ నియోజవకర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఉపేంద్రపై ఆలె నరేంద్ర పోటీ చేసి బీజేపీ శాసనసభ్యునిగా గెలుపొందారు. ఆ ఎన్నికల్లో ఎన్టీఆర్ గెలుపు, చికిత్స కోసం అమెరికా వెళ్లిన సమయంలో నాదెండ్ల భాస్కర్ రావు ముఖ్యమంత్రి అవడం ఒక సంవత్సరం కాలంలోనే జరిగిపోయాయి. అమెరికా నుంచి తిరిగొచ్చిన ఎన్టీఆర్.. ప్రజాస్వామ్య పరిరక్షణ పేరిట రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపట్టారు. ఆ ఉద్యమానికి కాంగ్రెసేతర ప్రభుత్వాలు మద్ధతు పలికారు. ఈ నేపథ్యంలోనే బీజేపీకి-టీడీపీకి సత్సంబంధాలు కుదిరాయి. నాదెండ్ల భాస్కర్ రావు ప్రభుత్వాన్ని భర్తరఫ్ చేయడం, ఎన్టీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవడంలో అప్పటి బీజేపీ నాయకులు వెంకయ్య నాయుడు విశేష పాత్ర పోషించారు దీంతో ఆ తర్వాత జరిగిన 1985 ఎన్నికల్లో బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకుంది. ఈ ఎన్నికల్లో హిమాయత్ నగర్ నుంచి ఆలె నరేంద్ర, మెట్‌పల్లి నుంచి చెన్నమనేని విద్యాసాగర్ రావు, కార్వాన్ నుంచి బద్దం బాల్ రెడ్డి, మలక్ పేట నుంచి ఇంద్రసేనా రెడ్డి విజయం సాధించారు. వీరితో పాటు ఆంధ్రప్రదేశ్ నుంచి మరో నలుగురు మొత్తం 8 మంది విజయం సాధించారు. ఆ తర్వాత 1989, 1994 ఎన్నికల్లో టీడీపీతో పొత్తు లేకుండా బీజేపీ ఒంటరిగానే పోటీ చేసింది. ఆ సమయంలో మూడు ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంది. పెద్దపల్లి నుంచి విద్యాసాగర్ రావు, సికింద్రాబాదు నుంచి బండారు దత్తాత్రేయ, రాజమండ్రి నుంచి ఎస్. పి.బి.కే సత్యనారాయణ రాజు విజయం సాధించారు. అదే సమయంలో ‘ఒక ఓటు- రెండు రాష్ట్రాలు’ అన్న తీర్మానాన్ని కాకినాడలో ప్రవేశపెట్టారు. దీన్నే ‘కాకినాడ తీర్మానం’ అని కూడా అంటారు. ఉమ్మడి ఏపీ విభజనకు ఆనాడే బీజేపీ తీర్మానం చేసింది.

1999వ సంవత్సరంలో టీడీపీతో పొత్తు పెట్టుకొని 5 ఎంపీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. బాల కోటయ్య (తిరుపతి), చెన్నమనేని విద్యాసాగర్ రావు (పెద్దపల్లి), బండారు దత్తాత్రేయ (సికింద్రాబాదు), గిరిజాల వెంకట స్వామి నాయుడు (రాజమండ్రి), కృష్ణంరాజు (కాకినాడ) ఎంపీలుగా గెలుపొందారు. చెన్నమనేని విద్యాసాగర్ రావు వాజ్‌పాయి హయాంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆనాటి టీడీపీ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబుకు వాజ్‌పేయి అమిత ప్రాధాన్యమిచ్చేవారు. వాజ్‌పేయి చేయూతతోనే హైదరాబాద్ అభివృద్ధి జరిగిందని బీజేపీ నేతలు ఇప్పటికీ చెప్పుకుంటుంటారు. ఎన్డీఏ హయాంలో టీడీపీ సర్కారు కట్టిన హైటెక్ సిటీకి.. ప్రధాని హోదాలో వాజ్‌పేయి ప్రారంభోత్సవం చేశారు. ఆ తర్వాత 2004వ సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో మళ్లీ టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుని ఎన్నికల్లోకి వెళ్లింది. అటు టీఆర్ఎస్, వామపక్షాలతో కలిసి కాంగ్రెస్ మహాకూటమిని ఏర్పాటు చేసింది. ఆ ఎన్నికల్లో వైఎస్ అధికారంలోకి రాగా.. టీడీపీ-బీజేపీ కూటమి ఓటమి పాలయింది. బీజేపీ కేవలం రెండు స్థానాల్లోనే గెలవగలిగింది. హైదరాబాద్‌లోని హిమాయత్ నగర్ నుంచి జి. కిషన్ రెడ్డి విజయం సాధిస్తే, మరోకటి ఆంధ్రప్రదేశ్ లోని పిఠాపురం నియోజకవర్గం నుంచి పెండెం దొరబాబు విజయం సాధించారు.

2009వ సంవత్సరంలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేసింది. వామపక్షాలు, టీఆర్ఎస్, టీడీపీ కలిసి మహాకూటమిగా ఏర్పడ్డాయి. వైఎస్ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ కూడా ఒంటరిగానే పోటీచేసింది. ఆ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వచ్చింది. మహాకూటమి ఓటమిపాలయింది. బీజేపీ నుంచి కిషన్ రెడ్డి విజయం సాధించారు. వైఎస్ మరణం తర్వాత కేసీఆర్ చేపట్టిన నిరాహార దీక్షతో తెలంగాణ ఉద్యమం తారస్థాయికి చేరడం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బీజేపీ మద్ధతు పలకడం జరిగాయి. తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఉప ఎన్నికలు సంభవించడంతో నిజామాబాద్, మహబూబునగర్ స్థానాల నుంచి యెండల లక్ష్మీనారాయణ, యెన్నం శ్రీనివాస్ రెడ్డి విజయం సాధించారు. యెన్నం మధ్యలోనే బీజేపీ నుంచి వెళ్లిపోయారు. ఉద్యమం తీవ్ర రూపం దాల్చడంతో కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. 2014వ సంవత్సరంలో లోక్ సభలో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఆ సమయంలో రాజధానిని కోల్పోయి లోటు బడ్జెట్‌లో కూరుకుపోయిన ఏపీ కోసం రాజ్యసభలో బీజేపీ నాయకుడు వెంకయ్య నాయుడు అవిశ్రాంత కృషిచేశారు. అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌తో ఏపీకి పదేళ్లపాటు ప్రత్యేక హోదాను ఇస్తామని ప్రకటింపజేశారు. కాంగ్రెస్ విభజన తీర్మానం, బీజేపీ పార్లమెంట్‌లో బీజేపీ మద్ధతుతో ఏపీ.. రెండు రాష్ట్రాలుగా విడిపోయింది. ఏపీలో కాంగ్రెస్‌లోని సీనియర్ నాయకులు పలువురు బీజేపీలో చేరారు. కాంగ్రెస్ హయాంలో కేంద్రమంత్రిగా పనిచేసిన పురంధరేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ వంటి వారు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం కన్నా లక్ష్మీనారాయణ ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కూటమికి నూతనంగా ఏర్పడిన జనసేన పార్టీ మద్ధతు ప్రకటించింది. ఏపీలో టీడీపీ-బీజేపీ కూటమి అధికారంలోకి రాగా.. తెలంగాణలో పొత్తు ఫలించలేదు. తెలంగాణలో బీజేపీకి అయిదు అసెంబ్లీ, ఒక ఎంపీ స్థానంలో గెలుపొందింది. ఆ ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్‌పై తీవ్ర వ్యతిరేకత రావడంతో బీజేపీకి ప్రజలు అత్యధిక స్థానాలు కట్టబెట్టారు. ప్రధానిగా మోదీ ప్రమాణస్వీకారం చేశారు. కేంద్రంలో టీడీపీ సభ్యులు మంత్రివర్గంలో చేరగా.. రాష్ట్రంలో ఎమ్మెల్యేలు టీడీపీ సర్కారులో భాగం పంచుకున్నారు. అయితే వీరి బంధం కొన్నాళ్ల పాటేసాగింది.

ఏపీ విభజన హామీలను అమలు చేయడంలో మోదీ సర్కారు అలక్ష్యం వహిస్తోందంటూ టీడీపీ తిరగబడింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని, ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించినా ఓకే చెప్పిన టీడీపీ.. దాని అమలులో తీవ్ర జాప్యాన్ని సహించలేకపోయింది. ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధం చేయాలని కోరినా బీజేపీ పట్టించుకోలేదు. అంతేకాకుండా రాష్ట్ర రాజధాని అమరావతికి నిధులను అంతగా ఇవ్వకపోవడం, పొలవరం ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేయకపోవడం, హుద్‌హుద్ తుఫాను సమయంలో విశాఖకు ప్రకటించిన వెయ్యి కోట్ల ఆర్థిక సాయంలో కూడా అరకొరగానే నిధులు విడుదల చేయడంతో బీజేపీతో టీడీపీ తెగదెంపులు ప్రక్రియ మొదలయింది. మొదట కేంద్ర ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి ఒత్తిడి మొదలుపెట్టిన టీడీపీ.. ఆ తర్వాత ఎన్డీఏ నుంచి వైదొలిగింది. ఇటు రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వాములయిన బీజేపీ సభ్యులు కూడా తమ మంత్రి పదవులకు రాజీనామా చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో మోదీ సర్కారుపై టీడీపీ అవిశ్వాస తీర్మానాన్ని పెట్టి సంచలనం సృష్టించింది. అయినప్పటికీ మెజారిటీ ఉండటంతో ప్రభుత్వం పడిపోలేదు. మొత్తానికి 2014లో మిత్రులయిన వారే.. నేడు బద్ధ శత్రువులయ్యారు. టీడీపీ అవినీతిలో కూరుకుపోయిందనీ, అందుకే మోదీ నిధులు విడుదల చేయడం లేదని రాష్ట్ర బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. చంద్రబాబును ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రానివ్వబోమని పదే పదే బీజేపీ నేతలు తేల్చిచెబుతున్నారు.

తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేయడంతో ముందస్తు ఎన్నికలు వచ్చాయి. టీడీపీతో తెగదెంపులు చేసుకోవడంతో.. తెలంగాణలో ఈసారి బీజేపీ ఒంటరి పోరు చేస్తోంది. తెలంగాణ జనసమతితో పొత్తుకు ప్రయత్నాలు చేపట్టినా.. కోదండరాం బీజేపీవైపు మొగ్గు చూపలేదు. దీంతో అటు అధికార టీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ ,టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌ల ‘మహాకూటమి’ మధ్య బీజేపీ అభ్యర్థులు గెలుపు కోసం పోరాడుతున్నారు. కేసీఆర్ నియంతలా పాలిస్తున్నాడంటూ రాష్ట్ర బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నా.. మోదీతో, కేసీఆర్‌కు సత్సంబంధాలే ఉన్నాయని విశ్లేషకుల వాదన. మోదీతో లోపాయికారీ ఒప్పందం వల్లే ముందస్తు ఎన్నికలు సాధ్యమయ్యాయనీ, పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్.. ఎన్డీఏలో చేరే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ప్రస్తుతం బీజేపీ చేస్తున్న ఒంటరి పోరు.. ఆపార్టీకి తెలంగాణలో మేలు చేస్తుందో, లేదో వేచిచూడాలి. అటు ఏపీలో కూడా బీజేపీ దాదాపుగా ఒంటరిగానే పోటీచేయనుంది. కాంగ్రెస్ అన్యాయం చేస్తే.. బీజేపీ నమ్మించి మోసం చేసిందనీ, వెంకన్న సాక్షిగా తిరుపతిలో మోదీ ‘ప్రత్యేక హోదా’ మాట ఇచ్చి తప్పారనీ, ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. దీంతో గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు జరిగిన పరాభవమే.. ఏపీలో బీజేపీకి కూడా జరుగుతుందని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఐటీ, సీబీఐలను అడ్డుపెట్టుకుని ఏపీలో టీడీపీ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలని చూస్తోందని టీడీపీ అనుమానం వ్యక్తం చేస్తోంది. అంతేకాకుండా జగన్, పవన్‌‌కు కూడా బీజేపీతో లోపాయికారీ ఒప్పందం కుదిరిందన్న బలమైన నమ్మకంతో టీడీపీ ఉంది. బీజేపీతో ఇప్పటికీ టీడీపీకి రహస్య సంబంధాలు ఉన్నాయని వైసీపీ కూడా ఆరోపిస్తోంది. దీంతో వచ్చే ఎన్నికల్లో ఏపీలో రాజకీయాలు బీజేపీ కేంద్రంగా జరగనున్నాయి. చంద్రబాబును జైలుకు పంపిస్తామంటూ జీవీఎల్ నరసింహారావు వంటి వారు తీవ్ర వ్యాఖ్యలు చేస్తుండటం, ఏపీలో టీడీపీ నాయకులపై ఐటీ దాడులు జరుగుతూ ఉండటం రాజకీయ దుమారం రేపుతోంది. మొత్తానికి ఏపీలో బీజేపీ భవిష్యత్ ఎలా ఉండబోతోంది..? టీడీపీని ఓడించేందుకు ఎలాంటి విధానాలను బీజేపీ అమలు చేయబోతోంది..? నోట్ల రద్దు, జీఎస్టీ, రాఫెల్ కుంభకోణం, ప్రభుత్వ వ్యవస్థలను నీరుగార్చడం వంటి ఉదంతాలు జరిగినా మరోసారి మోదీ ప్రధాని అవుతారా..? లేదా..? అన్నది వేచిచూడాలి.