తెలంగాణ జన సమితి

TELANGANA RASTRA SAMITI - TRS

తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించి.. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జరిగిన మొట్టమొదటి ఎన్నికల్లో స్తబ్ధుగా ఉండిపోయిన కోదండరాం.. అనూహ్య రీతిలో నూతన రాజకీయ పార్టీ ప్రకటన చేశారు. 2018వ సంవత్సరం ఏప్రిల్ 29న తెలంగాణ జనసమితి ఆవర్భావ సభను నిర్వహించడంతో.. రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ప్రొఫెసర్ కోదండరాం రాజకీయాలను బాగా చదివినవారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో సంస్థలను స్థాపించారు. అంతేకాకుండా వివిధ సంస్థలలో క్రియాశీలక పాత్ర పోషించారు. ఆంధ్రప్రదేశ్ సివిల్ లిబర్టీస్ కమిటీ(ఏపీసీఎల్‌సీ), హ్యూమన్ రైట్స్ ఫోరమ్(హెచ్‌.ఆర్.ఎఫ్), సెంటర్ ఫర్ వరల్డ్ సాలిడారిటీ(సీడబ్ల్యూఎస్), వరల్డ్ సోషల్ ఫోరమ్, తెలంగాణ విద్యావంతుల వేదిక(టీవీవీ) వంటి సంస్థలతో కలిసి పనిచేశారు. ఆహార భద్రత సమస్యకు సంబంధించి సుప్రీంకోర్టు కమిషనర్‌కు సలహాదారుగా కూడా ఆయన పనిచేశారు. తెలంగాణ సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్‌తో కలిసి పోరాడారు. రాజకీయ పార్టలను, ఉద్యోగ సంఘాలను ఏకతాటి పైకి తీసుకొచ్చే క్రమంలో తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ(టీజేఏసీ)ని 2009 డిసెంబర్‌లో స్థాపించడంతో దానికి కన్వీనర్‌గా కోదండరామే నియమితులయ్యారు. సహాయ నిరాకరణ, మిలియన్ మార్చ్, వంటా వార్పు, సకల జనుల సమ్మె, సాగర హారం, చల్‌మైనో హైదరాబాద్ వంటి ఎన్నో ఉద్యమ పోరాటాలు విజయవంతమయ్యాయంటే అది టీజేఏసీ పోషించిన పాత్ర వలనే అని చెప్పాలి. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం, వెనువెంటనే కేసీఆర్ ముఖ్యమంత్రి అవ్వడం జరిగిపోయాయి.

కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక కొంతకాలం పాటు కోదండరాం రాజకీయాల జోలికి వెళ్లలేదు. దాదాపు రెండేళ్ల తర్వాత ప్రభుత్వ పనితీరుపై సునిశిత విమర్శలు చేయడం ప్రారంభించారు. రైతుల ఆత్మహత్యలు, పార్టీల ఫిరాయింపులు, ఉద్యమంలో కీలక పాత్ర వహించిన వారిని కాదని, నాడు తెలంగాణ ద్రోహులంటూ దూషించిన వారికే పదవులు కట్టబెట్టడం వంటి విషయాలపై కేసీఆర్ సర్కారుపై విమర్శలు గుప్పించారు. నిరుద్యోగుల సమస్యలను భుజానికెత్తుకుని.. ఉద్యమపంథాను ఎంచుకున్నారు. ఆ తర్వాత పలు ఉద్యమ సంస్థలతో, జేఏసీ సభ్యులతో చర్చల అనంతరం తెలంగాణలో సరికొత్త రాజకీయ పార్టీని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. 2018వ సంవత్సరం ఏప్రిల్ 29న ‘తెలంగాణ జన సమితి’ పార్టీ ఆవిర్భావ సభను ఘనంగా నిర్వహించారు. పార్టీ ఏర్పాటు సభ జరగనివ్వకుండా టీఆర్ఎస్ సర్కారు అడ్డంకులు సృష్టించినా.. కోర్టుల్లో పోరాడిమరీ అనుమతులు తెచ్చుకుని కోదండరాం సభను దిగ్విజయం చేశారు. ఆ సభలో ప్రభుత్వ పనితీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ఉద్యమ కారులను పక్కనపెట్టడం, తెలంగాణ ఉద్యమంలో ఎవరినైతే ద్రోహులంటూ దూషించారో వారికే పదవులను కట్టబెట్టడం, రైతు ఆత్మహత్యలు, ధర్నాచౌక్ తరలింపు, నీటిపారుదల ప్రాజెక్టుల రీడిజైన్లు, నిరుద్యోగుల సమస్యలు, మిగులు బడ్జెట్‌తో ఏర్పడిన రాష్ట్రం అప్పుల పాలవడం... వంటి అంశాలను కోదండరాం ప్రముఖంగా ప్రస్తావించారు. మొదటగా పలు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామనీ, అయినప్పటికీ వాటిని పరిష్కరించడంలో సర్కారు తీవ్ర అలక్ష్యం వహిందన్నారు. దీంతో రాజకీయ రంగంలోకి ప్రవేశించకుండా పాలనలో మార్పు తీసుకురాలేమని, అందుకే తెలంగాణ జనసమితి పార్టీని ప్రారంభించినట్లు కోదండరాం స్పష్టం చేశారు. ఉద్యమంలో కీలక పాత్ర వహించిన కొందరు నాయకులు, ఓయూ విద్యార్థులు, పలువురు ప్రవాసులు టీజేఎస్‌లో చేరారు. పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించే పనిలో కోదండరాం ఉన్నారు. దీనికోసం ప్రతి జిల్లాలోనూ సభలు నిర్వహిస్తున్నారు.

ఉద్యమంలో ఉన్న సమయంలో కోదండరాం‌ను నాలుగు కోట్ల ప్రజలకు చిహ్నం.. కేసీఆర్ కీర్తించిన విషయం అందరికీ తెలిసిందే. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోదండరాం విమర్శలు చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి టీఆర్ఎస్ నాయకులు ఆయనను టార్గెట్‌గా చేసుకున్నారు ‘వార్డు మెంబర్‌గా కూడా గెలవనోడు’ అంటూ ఏకంగా సీఎం కేసీఆరే తీవ్ర పదజాలంతో దూషించారు. టీఆర్ఎస్ నేతలు, టీజేఎస్ నేతల మధ్య మాటల తూటాలు పేలాయి. గతంలో తనకు ఎంపీ సీటు ఇస్తాననీ కేసీఆర్ ఆఫర్ చేశారనీ, కానీ దాన్ని తాను సున్నితంగా తిరస్కరించినట్లు కోదండరాం చెబుతూ ఉంటారు. ఉద్యమకారులను పూర్తిగా పక్కనపెట్టేశారనీ, కనీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాచరిక పాలన చేస్తున్న కేసీఆర్‌ను గద్దె దింపుదామంటూ తెలంగాణ ప్రజలకు కోదండరాం పిలుపునిస్తున్నారు. ఇంకా తొమ్మిది నెలల సమయం ఉండగానే.. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లడంతో.. టీజేఎస్ కూడా అంతే వేగంగా రాజకీయ నిర్ణయాలను తీసుకుంది. అప్పటి వరకు ఒంటరిగానే పోటీ చేయాలని భావించిన కోదండరాం.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకూడదనే కారణంతో కాంగ్రెస్‌తో పొత్తు ప్రక్రియలకు శ్రీకారం చుట్టారు. టీడీపీ-కాంగ్రెస్-సీపీఐ పార్టీలతో పాటు టీజేఎస్ కూడా చేరి ‘మహాకూటమి’గా మారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో కూటమి తరపున టీజేఎస్ 10 స్థానాల్లో పోటీచేసే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కూటమికి అధ్యక్షుడిగా కోదండరాం పేరునే ప్రకటించనున్నారు. మహాకూటమి అధికారంలోకి వస్తే ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవిని ఇస్తారని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి.

తెలంగాణ ఉద్యమంలో వందలమంది యువత ఆత్మహత్యలకు కారణమయిన టీడీపీ, కాంగ్రెస్‌తో ఎలా పొత్తు పెట్టుకున్నారంటూ కేటీఆర్ పదే పదే కోదండరాంను ప్రశ్నిస్తుండగా.. తెలంగాణ ద్రోహులంటూ నిందించిన వారినే మీరెలా పార్టీలో చేర్చుకున్నారో వివరణ ఇవ్వాలంటూ టీజేఎస్ ధీటుగా సమాధానం ఇస్తోంది. ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మరి టీఆర్ఎస్ సర్కారును గద్దె దించాలన్న కోదండరాం లక్ష్యం నెరవేరుతుందా..?. పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు, ఉద్యమకారులు కోదండరాంకు మద్ధతుగా ఉండటం గమనార్హం. ఈ మద్ధతును టీజేఎస్ ఓట్లుగా మలుచుకోగలదా..? కాంగ్రెస్‌ను గెలిపించి ప్రభుత్వంలో భాగస్వామి అవుతుందా..? టీఆర్ఎస్ గెలుపునకు పరోక్షంగా కారణమవుతుందా..? అనేది కొద్ది రోజుల్లోనే తేలనుంది.