తెలుగుదేశం పార్టీ

TELUGU DESAM PARTY (TDP)

తెలుగు ప్రజలకు రాజకీయాల గురించి అవగాహన, ఆసక్తి కలిగించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగువారి ఆత్మగౌరవం పేరిట ఆవిర్భవించి.. జాతీయ రాజకీయాల్లో కూడా టీడీపీ చక్రం తిప్పింది.. ఒక ప్రాంతీయ పార్టీగా ఉండి కేంద్రంలో లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష స్థానాన్ని సంపాదించింది. ఏపీలో మొట్టమొదటి కాంగ్రెసేతర ముఖ్యమంత్రిని అందించడమే కాకుండా కేంద్రంలోనూ కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని సమర్ధవంతంగా ఏర్పాటు చేసి రాజకీయాల్లో నూతన సమీకరణలకు శ్రీకారం చుట్టింది. 1982వ సంవత్సరంలో ఏర్పడిన ఈ పార్టీ.. నేటి వరకు ఎన్నో ఆటు పోట్లను ఎదుర్కొని, మరెన్నో విజయాలను నమోదు చేసి తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన రాజకీయ పార్టీగా వెలుగొందుతోంది.

తెలుగు సినీ హీరోగా, దేవతామూర్తుల పాత్రల్లో అభిమానుల మదిలో దేవుడిలా ‘ఎన్టీఆర్’ నిలిచిపోయారు. తన 60వ దశకంలో ఇంతగా అభిమానించిన తెలుగు ప్రజలకు సేవచేయాలనే సంకల్పంతో తీవ్ర ఆలోచన చేశారు. ఆయన నటించిన బొబ్బిలిపులి, సర్దార్ పాపారాయుడు వంటి సినిమాలు.. ‘ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తున్నారు’.. అన్న సందేశాన్ని ప్రజల్లోకి బలంగా పంపాయి. ఈ క్రమంలోనే అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ తనయుడు రాజీవ్ గాంధీ హైదరాబాద్ విమానాశ్రయంలో ఆనాటి ఏపీ ముఖ్యమంత్రి టి.అంజయ్యను తీవ్రంగా అవమానించారు. అంతేకాకుండా ఆ అయిదు సంవత్సరాల కాలంలోనే అయిదుగురు ముఖ్యమంత్రులను కాంగ్రెస్ అధిష్టానం మార్చేసింది. ఈ పరిణామాలు ఎన్టీఆర్‌ను తీవ్రంగా ఆలోచింపజేశాయి. చివరకు పార్టీ పెడుతున్నట్లు ప్రకటించిన ఆయన.. 1982 మార్చి 29న ఆ పార్టీ పేరును ‘తెలుగుదేశం పార్టీ’గా ప్రకటించారు. అశేష అభిమానుల నడుమ పార్టీ పేరును, చిహ్నాన్ని ప్రకటించి తన రాజకీయ ప్రస్థానానికి పునాది వేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ప్రసంగం నేటికీ తెలుగుదేశం పార్టీ అభిమానులకు గుర్తే..

పార్టీని ప్రకటించిన నాటి నుంచి వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయాలని సంకల్పించారు. రోడ్డు రవాణా వ్యవస్థ సరిగా లేని ఆ కాలంలో.. తన యాత్రకు కనీస సౌకర్యాలతో.. ఓ వాహనాన్ని తయారు చేయించారు. దానికి ‘చైతన్య రథం’ అన్న పేరును పెట్టారు. ఆ చైతన్య రథం ఇప్పటికీ ఉందంటే.. తెలుగుదేశం ప్రస్థానంలో దానికి ఎంత ప్రముఖ పాత్ర ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఆ చైతన్య రథంపై ఎన్టీఆర్ కూర్చుని నాలుగు మూలలు కలిసిన చోటల్లా ఆగి ప్రసంగించేవారు. ఆయన తనయుడు నందమూరి హరికృష్ణ ఆ చైతన్య రథ సారథిగా వ్యవహరించారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా తొమ్మిది నెలలపాటు కొన్ని వేల కిలోమీటర్ల దూరం ఆ చైతన్య రథం ప్రయాణించింది. రాష్ట్రంలోని ఊరూరా తిరుగుతూ ప్రసంగిస్తూ, ప్రజలను చైతన్య పరిచారు. ‘తెలుగువారిని అవమానించిన కాంగ్రెస్‌ పార్టీ’కి బుద్ధి చెప్పాలంటూ ప్రజలకు ఎన్టీఆర్ పిలుపునిచ్చారు. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లయినా పేద ప్రజల్లో అభివృద్ధి కనిపించడం లేదనీ, పేదలు ఇంకా నిరుపేదలుగా మారుతున్నారంటూ ఆయన చేసిన ప్రసంగాలకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చేది. ఆయన రాక కోసం రేయింబవళ్లు ప్రజలు ఎదురు చూస్తూ ఉండేవారు. ఖాకీ దుస్తులు ధరించి, ఎక్కడ వీలయితే అక్కడ అన్నపానియాలు స్వీకరిస్తూ ఆయన యాత్ర సాగేది. సదుపాయాలు అంతగా లేకపోవడంతో రోడ్డు మీదే స్నానాలు చేసిన ఉదంతాలు కూడా ఉన్నాయి. సినీ రంగం నుంచి రావడంతో.. మంచి సాహిత్యంతో పార్టీకి ప్రత్యేకమైన పాటలను ఎన్టీఆర్ రాయించి, రికార్డు చేయించారు. ‘చేయెత్తి జై కొట్టు తెలుగోడా.., మా తెలుగు తల్లికి మల్లెపూదండ, ఇది తెలుగు గడ్డ.. గాండ్రించు పులిబిడ్డ..’ వంటి పాటలు ఇప్పటికీ ఎన్నికల్లో వినిపిస్తూనే ఉన్నాయి. ఈ పాటలతో, ఎన్టీఆర్ ప్రసంగాలతో ప్రజలు మైమరచిపోయేవారు. అన్నలు, చెల్లెళ్లు, ఆడపడుచులూ అంటూ ఎన్టీఆర్ చేసే ప్రసంగాలు జనాలను సమ్మోహనం గావించేవి. ఆయన చైనత్యరథ యాత్రకు ప్రజలు అడ్డు తగిలి ‘మా ఊరికి రావాల్సిందే..’ అంటూ పట్టుబట్టి తీసుకెళ్లేవారు. 16000 కిలోమీటర్ల మేర.. రాష్ట్ర వ్యాప్తంగా ఈ యాత్ర కొనసాగింది.

ఆ యాత్రల్లో ఉండగానే అప్పటికప్పుడు.. ఆయా నియోజకవర్గాల నుంచి ఎవరెవరు పోటీ చేయబోతున్నారనే విషయాన్ని ఎన్టీఆర్ ప్రకటించేవారు. ఇతర పార్టీల నుంచి చేరిన వారే కాకుండా.. ఏ మాత్రం రాజకీయ పరిజ్ఞానం లేని వారికి కూడా ఎన్టీఆర్ టికెట్లు ఇచ్చారు. ఆయా నియోజకవర్గ పరిథిలో పేరు ప్రఖ్యాతులు సాధించిన డాక్టర్లు, ఉపాధ్యాయులు, ఐఏఎస్‌లు, న్యాయవాదులు.. ఇలా అన్ని వర్గాల వారిని గుర్తించి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేవారు. తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తొమ్మిది నెలల్లోనే ఎన్నికలను ఆ పార్టీ ఎదుర్కొంది. 1982వ సంవత్సరాంతంలో జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. సంజయ్ విచార్ మంచ్‌తో కలిసి పోటీ చేసి.. 294 అసెంబ్లీ స్థానాలకు గానూ 202 స్థానాలను గెలుచుని అఖండ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. 199 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు గెలువగా.. మరో మూడు స్థానాల్లో మిత్ర పక్షం సంజయ్ విచార్ మంచ్ అభ్యర్థులు విజయం సాధించారు. 1983వ సంవత్సరం జనవరి 9వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా నందమూరి తారకరామారావు ప్రమాణస్వీకారం చేశారు. ఆ ప్రమాణస్వీకారానికి రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాదిగా జనం తరలివచ్చారు. అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న ఎన్టీఆర్ అల్లుడు నారా చంద్రబాబు నాయుడు.. టీడీపీ ప్రభంజనం సృష్టించిన తర్వాత పార్టీలో చేరారు.

అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నో అభివృద్ధి పథకాలను ఎన్టీఆర్ ప్రవేశ పెట్టారు. తెలంగాణ రాష్ట్రంలోని భూస్వామ్య వ్యవస్థను, పటేల్ పట్వారీ విధానాన్ని రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మండల వ్యవస్థను ఏర్పరచి ప్రభుత్వ సేవలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ఆడబిడ్డలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించారు. మహిళా యూనివర్శిటీలను ఏర్పాటు చేశారు. సినిమా రంగంలోని ‘స్లాబ్ విధానాన్ని’ అమలు చేశారు. హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్‌పై సుప్రసిద్ధులైన తెలుగువారి విగ్రహాలను ఏర్పాటు చేయించే బాధ్యతను డాక్టర్ సి.నారాయణరెడ్డికి అప్పగించారు. ఇలా ఎన్నో సంచలన నిర్ణయాలను తీసుకున్న ఎన్టీఆర్‌‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. 1984లో గుండెకు సంబంధించిన శస్త్ర చికిత్స కోసం ఎన్టీఆర్ అమెరికాకు వెళ్లిపోవడంతో.. ఏపీ రాజకీయాల్లో పెను మార్పులు సంభవించాయి. కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి చేరిన నాదెండ్ల భాస్కరరావు.. తనకు మెజారిటీ ఉందంటూ గవర్నర్ అపాయింట్‌మెంట్ తీసుకున్నారు. ఎమ్మెల్యేల నుంచి సంతకాలు సేకరించి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇలా ఎన్టీఆర్ నుంచి ముఖ్యమంత్రి పదవిని నాదెండ్ల భాస్కర్‌రావుకు బదిలీ చేయడంలో అప్పటి గవర్నర్ రాంలాల్ ముఖ్య పాత్ర పోషించారు. అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ కనుసన్నల్లోనే ఈ తతంగమంతా జరిగింది.

చికిత్స పూర్తయ్యాక అమెరికా నుంచి తిరిగి వచ్చిన ఎన్టీఆర్‌కు ఈ విషయం తెలిసి రగిలిపోయారు. డాక్టర్లు వద్దని వారిస్తున్నా, ఆరోగ్యం సహకరించకపోయినా మరోసారి ప్రజల్లోకి వెళ్లారు. ‘ప్రజాస్వామ్య పరిరక్షణ’ పేరుతో తనకు జరిగిన అన్యాయం గురించి వెలుగెత్తి చాటారు. దొడ్డిదారిన అధికార అందలమెక్కిన ఉదంతాన్ని ఊరూరా చాటిచెప్పారు. చంద్రబాబు నేతృత్వంలో ఎన్టీఆర్‌కు మద్ధతుగా ఉన్న ఎమ్మెల్యేలతో రాష్ట్రపతి భవన్ ఎదుట భారీ పరేడ్‌ను నిర్వహించారు. ఎన్టీఆర్ చేపట్టిన ఈ ఉద్యమానికి కాంగ్రెసేతర ప్రాంతీయ, జాతీయ పార్టీల మద్ధతును కూటగట్టడంలో చంద్రబాబు సఫలమయ్యారు. అప్పటికే జాతీయ రాజకీయాల్లో ఉన్న తెలుగువాడైన వెంకయ్యనాయుడు చంద్రబాబుకు, టీడీపీకి అండగా ఉన్నారు. ఎన్టీఆర్‌కు అప్పటి కాంగ్రెసేతర పార్టీలన్నీ మద్ధతు ప్రకటించడంలో కీలక పాత్ర వహించారు. జనతాపార్టీ, భారతీయ జనతాపార్టీ, వామపక్షాలు, డీఎంకే, నేషనల్ కాన్ఫరెన్స్ వంటి పార్టీలు ఎన్టీఆర్‌కు అండగా నిలిచాయి. నెలరోజుల పాటు జరిగిన ఈ ఉద్యమ సమంయలో ఎన్టీఆర్‌కు మద్ధతుగా నిలబడిన ఎమ్మెల్యేలను ఓ రహస్య ప్రాంతంలో దాచారు. విద్యార్థులు, ఉద్యోగులు, తెలుగుదేశం శ్రేణులు రోజుల తరబడి నిరసన కార్యక్రమాలను చేపట్టారు. ఆసుపత్రిలో వేసుకున్న కట్లుతోనే ప్రచారం చేస్తూ, తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకుంటున్న ఎన్టీఆర్‌ను చూసి ప్రజలు కాంగ్రెస్‌పై రగిలిపోయారు. తెలుగు ప్రజల ఆందోళనలతో కేంద్ర ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. గవర్నర్ రాంలాల్‌ను తొలగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. నూతన గవర్నర్‌గా శంకర్ దయాల్ శర్మను నియమించింది. నాదెండ్ల భాస్కర్‌రావును ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగిస్తున్నట్లు గవర్నర్ ప్రకటించారు. దీంతో మరోసారి ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ప్రమాణస్వీకారం చేశారు. అధికారం తిరిగిరావడంతో చంద్రబాబు చేసిన కృషిని ఎన్టీఆర్ ప్రశంసించారు. ఆయనను పార్టీ జనరల్ సెక్రటరీగా నియమిస్తున్నట్లు ఎన్టీఆర్ ప్రకటించారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ప్రభుత్వానికి అనవసర ఖర్చంటూ ‘శాసన మండలి వ్యవస్థ’ను ఆయన రద్దు చేశారు.

కాంగ్రెస్‌ గెలుపు కోసం తమిళనాడులో ప్రచారం: 1984లో ఎన్టీఆర్ మళ్లీ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన కొద్ది నెలలకే తమిళనాడులో ఎన్నికలు వచ్చాయి. ఎన్టీఆర్‌కు అత్యంత సన్నిహితుడు ఎంజీఆర్.. అన్నాడీఎంకే పార్టీకి అధినేత. 1980లోనే ముఖ్యమంత్రి అయిన ఎంజీఆర్.. 1984లో వచ్చిన ఎన్నికల్లో అనారోగ్య కారణాలతో ప్రచారం చేయలేకపోయారు. అమెరికాలో ఎంజీఆర్ చికిత్స తీసుకుంటున్నారు. ఆ ఎన్నికల్లో అన్నాడీఎంకే తరపున స్టార్ క్యాంపెయినర్ ఎవరూ లేకపోవడం ఆ పార్టీ కార్యకర్తలను డీలా పడేసింది. దీంతో వ్యూహాత్మకంగా వ్యవహరించిన అన్నాడీఎంకే.. ఎన్టీఆర్‌ను రంగంలోకి దించింది. తమిళనాడు ఎన్నికల్లో ప్రచారం చేయాల్సిందిగా ఆహ్వానం పంపింది. తన మిత్రుడు అత్యంత కష్టకాలంలో పంపిన ఆ ఆహ్వానాన్ని మన్నించి.. తన బద్ధ శత్రువైన కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న అన్నాడీఎంకేకు ఎన్నికల్లో గెలుపుకోసం ఎన్టీఆర్ ప్రచారం చేశారు. తనకు కలిసి వచ్చిన ‘చైతన్య రథాన్ని’ మొట్టమొదటిసారిగా రాష్ట్రం సరిహద్దులు దాటించి తమిళనాడు పురవీధుల్లో పరుగులు తీయించారు. తమిళం కూడా అనర్గళంగా మాట్లాడే ఆయన.. ప్రసంగాలకు తమిళ తంబీలు నీరాజనాలు పట్టారు. మొత్తానికి ఆ ఎన్నికల్లో కాంగ్రెస్- అన్నాడీఎంకే కూటమి విజయకేతనం ఎగురవేసింది.

1985లో ప్రభుత్వం రద్దు.. ఉప ఎన్నికలు అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ హత్యానంతరం దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ అనుకూల పవనాలు వీచాయి. 1984లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 404 స్థానాలను కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. అయితే దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీచినా ఏపీలో మాత్రం ఎన్టీఆర్‌కే ప్రజలు మద్ధతుగా ఉన్నారు. 30 ఎంపీ స్థానాలను తెలుగుదేశం పార్టీ గెలుపొందింది. ఆ ఏడాది లోక్ సభలో కాంగ్రెస్ తర్వాత అత్యధిక ఎంపీ సీట్లను గెలుచుకున్న పార్టీగా తెలుగుదేశం చరిత్రకెక్కింది. తద్వారా లోక్ సభలో ప్రధాన ప్రతిపక్షంగా టీడీపీ ప్రముఖ పాత్ర పోషించింది. పార్లమెంట్‌లో ఎన్నికల్లో ఘన విజయం తర్వాత ఎన్టీఆర్ కొత్త ఆలోచనలు చేశారు. తాను అంతగా నమ్మి.. గెలిపించిన ఎమ్మెల్యేలు తనను కాదని నాదెండ్ల భాస్కర్‌రావును సీఎం పీఠం ఎక్కించారన్న భావన ఎన్టీఆర్‌ను తీవ్రంగా కలిచివేసింది. అంతేకాకుండా పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు మితిమీరి ప్రవర్తించడం ఎన్టీఆర్‌కు నచ్చలేదు. దీంతో మరోసారి ప్రజల ముందుకు వెళ్లాలనీ, ఎన్నికల్లో తాడోపేడో తేల్చుకోవాలని ఎన్టీఆర్ నిర్ణయించుకున్నారు. ప్రభుత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఏ ఒక్క ఎమ్మెల్యేకు, మంత్రికి కూడా తెలియకుండానే తతంగాన్నంతా పూర్తి చేశారు. మొత్తానికి 1985 ఎన్నికల్లో ఉప ఎన్నికలకు వెళ్లి.. మళ్లీ చైతన్యరథాన్ని రాష్ట్రంలో పరుగులు తీయించారు. నమ్మిన వారే మోసం చేసిన వైనాన్ని ప్రజలకు వివరించారు. ఆ ఎన్నికల్లో చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఎన్టీఆర్ సీట్లివ్వలేదు. ఆ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ విజయఢంకా మోగించినా.. తెలుగునాట మాత్రం తెలుగుదేశం పార్టీ విజయబావుటా ఎగురవేసింది. 202 సీట్లలో గెలిచి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే ముఖ్యమంత్రి అయ్యాక ఎన్టీఆర్ పలు వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయింది. ‘నక్సలైట్లు నిజమైన దేశభక్తులు’ అంటూ వ్యాఖ్యానించడంతో అధికారుల్లో కూడా నిరసనను ఎదుర్కొన్నారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి పదవిలో ఉంటూనే సినిమాల్లో నటించడం, గండిపేట నుంచే పాలనను నడిపించడం చేశారు. ముఖ్యమంత్రిగా ఒక్క రూపాయి మాత్రమే జీతం ఆయన జీతం తీసుకునేవారు. పాలనలో తెలుగు వాడకానికి ప్రాధాన్యం ఇచ్చేవారు. తనకు సినీభిక్ష పెట్టిన తమిళనాడుకు.. తెలుగు గంగ ప్రాజెక్టు రూపంలో తాగునీరు అందించారు.

టీడీపీ ఆధ్వర్యంలో నేషనల్ ఫ్రంట్.. కేంద్రంలో కాంగ్రెసేతర ప్రభుత్వం 1989 ఎన్నికలకు ముందు... దేశవ్యాప్తంగా కాంగ్రెసేతర పార్టీలను ఏకం చేసే చర్యలకు ఎన్టీఆర్ శ్రీకారం చుట్టారు. జనతాదల్, డీఎంకే, అసోం గణపరిషత్, ఇండియన్ కాంగ్రెస్ (సోషలిస్ట్) వంటి ప్రధాన పార్టీలతో ‘నేషనల్ ఫ్రంట్‌’ను ఆయన ఏర్పాటుచేశారు. దానికి ఆయనే కన్వీనర్‌గా ఉన్నారు. ఈ ఫ్రంట్‌లోని పలు పార్టీల అభ్యర్థన మేరకు ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి కూడా వెళ్లారు. హిందీ ప్రసంగాన్ని తెలుగులోకి రాసుకుని ఆయన ప్రసంగించేవారు. మొత్తానికి 1989 ఎన్నికల్లో నేషనల్ ఫ్రంట్ గణనీయమైన స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ, వామపక్షాల మద్ధతుతో ‘నేషనల్ ఫ్రంట్’ కేంద్రంలో అధికారాన్ని చేపట్టింది. వీపీ సింగ్ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. అలా కేంద్రంలో కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ.. ఆ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయింది. రాష్ట్రం వదిలి జాతీయ రాజకీయాల్లో దృష్టిపెట్టడం, ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును తగ్గించడం వంటి పలు వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడంతో తెలుగుదేశం పార్టీ అధికారాన్ని కోల్పోయింది. ఎమ్మెల్యేలు, మంత్రివర్గంపై నమ్మకం లేక అన్నీ తానై ప్రభుత్వాన్ని నడపటం కూడా చేటు తెచ్చింది. 1989లో ఎన్నికలకు కొద్ది నెలలు ముందు మొత్తం మంత్రివర్గాన్ని రద్దు చేసి కొత్త మంత్రుల్ని ఆయన తీసుకున్నారు. ఆ సమయంలో జరిగిన కుల ఘర్షణలు ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చాయి.

తెలుగుదేశం అంటే తెలుగువారికోసమేనంటూ.. 1991లో నంద్యాల లోక్‌సభకు ఉపఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా అప్పటి ప్రధానమంత్రి పీవీ నరసింహారావు నిలబెట్టారు. 1989లో టీడీపీ ఓటమి చెందినా.. ఆ తర్వాత మూడేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పగా సాధించిందేమీ లేదు. దీంతో 1991 ఉప ఉన్నికల్లో పీవీ నరసింహారావుపై తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని నిలబెడితో ఆయన ఓటమి ఖాయమని చాలామంది రాజకీయ విశ్లేషకులు భావించారు. అయితే ఎన్టీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరించి సంచలన నిర్ణయం ప్రకటించారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని నిలబెట్టబోదంటూ కీలక ప్రకటన చేశారు. ఓ తెలుగువాడు దేశానికి ప్రధాని అవడాన్ని తాము అడ్డుకోమంటూ, తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల అభ్యున్నతే కోరుకుంటుందంటూ ఎన్టీఆర్ ప్రకటించారు.

1994లో ఘనవిజయం: అధికారం లేనప్పటికీ కాంగ్రెస్ వైఫల్యాలపై ఎన్టీఆర్ పోరాడారు. కాంగ్రెస్ తన స్వీయ తప్పిదాలను కొనసాగించడం వల్ల క్రమంగా ప్రాభవం కోల్పోయింది. అయిదేళ్ల కాలంలో ముగ్గురు ముఖ్యమంత్రులను మార్చడంతో ప్రజలు కాంగ్రెస్ పట్ల విసిగిపోయారు. ఆ అయిదేళ్ల కాలంలో మర్రి చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్ధనరెడ్డి, కోట్ల విజయభాస్కర రెడ్డి ముఖ్యమంత్రులుగా పనిచేశారు. 1989 నుంచి 94 వరకు ఎన్టీఆర్ రాజకీయ జీవితంలో ఎన్నో అవమానాలు పొందారు. శాసన సభలో అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం ఉండేది. ఈ అయిదేళ్ల కాలంలో తొమ్మిదిసార్లు టీడీపీ సభ్యులను సభ నుంచి బహిష్కరించారు. దీంతో తాము మళ్లీ అధికారంలోకి వచ్చేవరకు సభకు వచ్చేది లేదంటూ సంచలన ప్రకటన చేశారు. అసెంబ్లీ బహిష్కరణ చేశారు. ఓ వైపు రాజకీయాలు చేస్తూనే మరోవైపు నాలుగు సినిమాల్లోనూ నటించారు.1993లో వచ్చిన మేజర్ చంద్రకాంత్ సినిమా.. ఎన్టీఆర్ రాజకీయ జీవితానికి బాగా పనికి వచ్చిందనే చెప్పవచ్చు. అదే సమయంలో అల్లుడు నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని గ్రామగ్రామానా విస్తరించడంలో వ్యూహాత్మకంగా వ్యవహరించారు. బూత్ స్థాయి వరకు పార్టీని విస్తరించి రాష్ట్ర వ్యాప్తంగా పటిష్టం చేశారు. కార్యకర్తలు, జిల్లాస్థాయి నాయకులతో చంద్రబాబు సత్సంబంధాలు పెంచుకున్నారు. ‘పార్టీలో ఏ పని కావాలన్నా చంద్రబాబు వద్దకు వెళ్తే.. సరిపోతుంది.. ఎన్టీఆర్‌ను ఒప్పించి చేయించగలరు’ అన్న పేరును తెచ్చుకున్నారు. అదే సమయంలో లక్ష్మీపార్వతిని రెండో పెళ్లిచేసుకున్నారు. 1994 ఎన్నికల ప్రచారంలో లక్ష్మీపార్వతితో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు. ఓ బహిరంగ వేదికపైనే ఆమెను పెళ్లిచేసుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో సంబంధాలు చెడిపోయాయి. అయినప్పటికీ 1994 ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. పార్టీపెట్టి మొట్టమొదటిసారి అధికారంలోకి వచ్చిన నాటికంటే అత్యధిక సీట్లను గెలుపొంది చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. ఏకంగా 226సీట్లను గెలుపొంది మరోసారి ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ పదవీబాధ్యతలు చేపట్టారు. రెండు రూపాయలకే కిలోబియ్యం, సంపూర్ణ మధ్యపాన నిషేధం.. వంటి సంక్షేమ పథకాలకు ఎన్టీఆర్ ఆనాడే నాంది పలికారు. ప్రభుత్వానికి ఆర్థికంగా భారం అయినా సంక్షేమ పథకాల అమలును కొనసాగించారు.

1995లో చంద్రబాబు తిరుగుబాటు.. అధికార మార్పిడి.. అధికారంలోకి వచ్చిన ఏడాదికే తెలుగుదేశం పార్టీలో అంతర్గత పోరు తారస్థాయికి చేరింది. ఎన్టీఆర్ భార్యగా వచ్చిన లక్ష్మీపార్వతి.. అంతర్గత ప్రభుత్వాన్ని నడుపుతున్నారన్న వార్తలు షికారు చేశాయి. ప్రభుత్వంలో, ఎన్టీఆర్ వద్ద ఏ పని కావాలన్నా.. ముందు లక్ష్మీ పార్వతిని కలవాల్సి రావడంతో సీనియర్ నేతల్లో, పార్టీ ప్రముఖుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఒక దశలో లక్ష్మీ పార్వతిని ముఖ్యమంత్రిగా చేసి, తాను జాతీయ రాజకీయాల్లోకి వెళ్తానంటూ ఎన్టీఆర్ చెప్పినట్లుగా పుకార్లు పుట్టాయి. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ లక్ష్మీపార్వతి పాత్ర అంతకంతకు పెరిగిపోవడంతో, ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందంటూ చంద్రబాబు నాయకత్వంలోని కొందరు ఎమ్మెల్యేలు ఎన్టీఆర్‌పై తిరుగుబాటు చేశారు. దీనికి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కూడా జతకలిశారు. వీరిలో హరికృష్ణ, బాలకృష్ణ, కుమార్తె పురంధరేశ్వరి, ఆమె భర్త, ఎన్టీఆర్ పెద్ద అల్లుడయిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా ఉన్నారు. మెజారిటీ ఎమ్మెల్యేలు చంద్రబాబు వర్గం వైపు నిలిచారు. 1995 సెప్టెంబర్ 1న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేశారు. ఎమ్మెల్యేల తిరుగుబాటు వల్ల ఎన్టీఆర్ అధికారం కోల్పోయినా.. అసెంబ్లీలోనూ, బయట ప్రభుత్వ పనితీరుపై విమర్శలు చేసేవారు. 1996 జనవరి 18న ఎన్టీఆర్ మరణించడంతో టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానం ముగిసింది.

నేషనల్ ఫ్రంట్ ఏర్పాటులో టీడీపీ భాగస్వామ్యం.. 1996లో కేంద్రంలో టీడీపీ మరోసారి చక్రం తిప్పింది. జనతాదళ్, సమాజ్‌వాదీ పార్టీ, డీఎంకే, టీడీపీ, ఏజీపీ, ఆల్ ఇండియా ఇందిరా కాంగ్రెస్(తివారీ), నాలుగు వామపక్ష పార్టీలు, తమిళ్ మానిలా కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, మహారష్ట్రవాది గోమంతక్ పార్టీ.. వంటి 13 పార్టీలతో నేషనల్ ఫ్రంట్ ఏర్పాటయింది. వేరే వేరు లక్ష్యాలున్న ప్రాంతీయ పార్టీలను ఒక్క తాటిపైకి తెచ్చి.. ఫ్రంట‌్‌ను ఏర్పాటు చేసిన ఘనత టీడీపీకి దక్కుతుంది. ఈ ఫ్రంట్ కన్వీనర్‌గా చంద్రబాబు నాయుడు వ్యవహరించారు. బయటి నుంచి కాంగ్రెస్ పార్టీ మద్ధతుతో మొదట జనతాదళ్‌ పార్టీకి చెందిన హెచ్‌డీ దేవెగౌడ ప్రధానమంత్రి అయ్యారు. జ్యోతిబసు, చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి పదవిని చేపట్టేందుకు సుముఖంగా లేకపోవడంతో దేవెగౌడ తర్వాత ఐకే గుజ్రాల్ ప్రధానమంత్రి అయ్యారు. ఈ రెండు ప్రభుత్వాలకు కాంగ్రెస్ పార్టీ బయటినుంచి మద్ధతునిచ్చింది. అయితే కొన్ని కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీ మద్ధతును ఉపసంహరించుకోవడంతో ప్రభుత్వం పడిపోయింది.

టెక్నాలజీ చంద్రబాబు.. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక విద్యుత్ చార్జీలను పెంచారు. సబ్సిడీలను తగ్గించారు. రాష్ట్రంలో పెట్టుబడులను రప్పించేందుకు తీవ్రంగా కృషిచేశారు. అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్, యూకే ప్రధాన మంత్రి టోనీ బ్లెయిర్‌లను కలిసి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడే బిల్ క్లింటన్ హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. 1999 ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని టీడీపీ పోటి చేసింది. ఆ ఎన్నికల్లో కూడా మరోసారి టీడీపీ విజయకేతనం ఎగురవేసింది. దీంతో మరిన్ని పెట్టుబడులను రప్పించేందుకు చంద్రబాబు విజన్ 2020 ప్రణాళికను రూపొందించారు. ఆరోగ్యం, విద్యను ప్రైవేటీకరణ చేశారు. ప్రాజెక్టులు, పెట్టుబడుల సమయంలో భూమిని కోల్పోయే రైతులకు పెద్దమొత్తంలో పరిహారాన్ని అందజేసేలా చట్టాల్లో మార్పులు తెచ్చారు. టీడీపీ హయాంలోనే హైదరాబాద్ రూపురేఖలు మారిపోయాయని చెప్పవచ్చు. మైక్రోసాఫ్ట్ కంపెనీ రాకతో ఇతర ఐటీ కంపెనీలన్నీ క్యూకట్టాయి. సాఫ్ట్‌వేర్ కంపెనీలు, ఫార్మా కంపెనీలు, కోచింగ్ సెంటర్లతో హైదరాబాద్ కళకళలాడిపోయింది. హైటెక్ సిటీని తొమ్మిది నెలల్లో యుద్ద ప్రాతిపదికన నిర్మించారు. అప్పటి ప్రధానమంత్రి వాజ్‌పేయి దీన్ని ప్రారంభించారు. శిల్పారామం, సైబరాబాద్‌లకు రూపకల్పన చేశారు. హైదరాబాద్ విస్తీర్ణం పెరిగింది. శంషాబాద్ విమానాశ్రయానికి కూడా అప్పుడే పునాదులు పడ్డాయి. రెండోసారి అధికారంలోకి వచ్చాక చంద్రబాబుకు అప్పటి ప్రధాని వాజ్‌పేయి అమిత ప్రధాన్యం ఇచ్చేవారు. కేంద్రంలో టీడీపీ మద్ధతు కూడా అవసరం ఉండటంతో చంద్రబాబు కోరిన ప్రతిపనిని వెంటనే చేసేవారు. తెలంగాణ ప్రాంతంలోని కొంతమంది నేతలు ప్రత్యేక తెలంగాణ వాదనను అప్పుడే తెరపైకి తెచ్చారు. మొత్తానికి 2001లో ప్రత్యేక తెలంగాణ కోసమంటూ కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు టీడీపీకి రాజీనామా చేసి ‘తెలంగాణ రాష్ట్ర సమితి’ పార్టీని పెట్టుకున్నారు. ఆ సమయంలో కొంతమంది తెలంగాణ లీడర్లు ఆయనతోపాటు పార్టీని వీడారు. అయినప్పటికీ కార్యకర్తల బలంగా ఉండటంతో తెలంగాణలో పార్టీ నిలదొక్కుకుంది. 2003వ సంవత్సరంలో చంద్రబాబు.. తిరుపతి సమీపంలో ల్యాండ్‌మైన్ పేలి తీవ్రంగా గాయపడ్డారు. దీంతో అదే సంవత్సరం ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లారు.

2004, 2009 ఎన్నికల్లో టీడీపీ పరాజయం అయితే అప్పటికే రైతాంగాన్ని తీవ్రంగా నిర్లక్ష్యం చేశారన్న అపవాదును చంద్రబాబు ప్రభుత్వం మూటకట్టకుంది. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్, వామపక్షాలు కలిసి పోటీ చేశాయి. వైఎస్ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఆయన చేసిన పాదయాత్ర కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేలా చేసింది. ఆ ఎన్నికల్లో 294 అసెంబ్లీ సీట్లకు గాను కేవలం 47సీట్లను టీడీపీ గెలుచుకుంది. 42 ఎంపీ స్థానాలకు గానూ అయిదు స్థానాల్లోనే టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. ఓ వైపు ప్రభుత్వంపై పోరాడుతూనే టీడీపీని గెలిపించేందుకు చంద్రబాబు వ్యూహాలు రచించారు. ఆ సమయంలో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున్న ఎగసిపడింది. ప్రత్యేక తెలంగాణ కోసం టీడీపీలో నెంబర్ 2గా ఎదిగిన దేవేందర్‌గౌడ్ రాజీనామా చేశారు. ‘నవ తెలంగాణ ప్రజాపార్టీ’ని ఏర్పాటు చేశారు. అనేక ఒత్తిళ్లు, రాజకీయ వ్యూహాల నడుమ ప్రత్యేక తెలంగాణకు టీడీపీ మద్ధతివ్వక తప్పలేదు. 2004 ఎన్నికల్లో ఏ పార్టీలతో అయితే కలిసి వైఎస్ కూటమికట్టారో.. అవే పార్టీలను టీడీపీకి మద్ధతిచ్చేలా చంద్రబాబు వ్యూహరచన చేశారు. 2009 ఎన్నికల్లో వైఎస్‌ను ఓడించేందుకు టీఆర్ఎస్, వామపక్షాలతో కలిసి టీడీపీ మహాకూటమిగా ఏర్పడింది. అయితే ఆ ఎన్నికల్లో మహాకూటమి ఆశించిన విజయం సాధించలేకపోయింది. తగినంత బలం లేకున్నా టీఆర్ఎస్‌కు ఎక్కువ సీట్లు ఇవ్వడం టీడీపీకి చేటు తెచ్చింది. అయితే 2004తో పోల్చితే టీడీపీ బలం రెట్టింపయింది. 2009లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 92 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. ఈ ఎన్నికల సమయంలోనే ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ రాజకీయ రంగ ప్రవేశం చేశారు. టీడీపీ గెలుపు కోసం ప్రచారం చేశారు. హరికృష్ణ తనయుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా టీడీపీకి విస్తృతంగా ప్రచారం చేశారు. తాత ఎన్టీఆర్‌లాగానే ఖాకీ దుస్తులు ధరించి, చైతన్య రథాన్ని పోలిన వాహనాన్ని రూపొందించి జూనియర్ ఎన్టీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. నందమూరి కుటుంబమంతా ఆ ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం పనిచేసింది. అయినప్పటికీ ఆ ఎన్నికల్లో వరుసగా రెండోసారి టీడీపీ ఓటమి పాలయింది. ఆదే సమయంలో చిరంజీవి పెట్టిన పీఆర్పీ, జయప్రకాశ్ నారాయణ ‘లోక్‌సత్తా’ పార్టీలు టీడీపీ ఓటమికి పరోక్షంగా కారణమయ్యాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఈ రెండు పార్టీలు చీల్చాయి. దీంతో కేవలం వెయ్యి నుంచి 2000వేల ఓట్ల తేడాతో చాలా చోట్ల టీడీపీ ఓటమిపాలయింది.

వైఎస్ రెండోసారి గెలుపొందాక టీడీపీని బలహీన పరిచే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. పార్టీలోని సీనియర్లను, ఎమ్మెల్యేలను నయానో భయానో పార్టీలోకి రప్పించుకోవడం చేశారు. వైఎస్ చేపట్టిన ‘ఆపరేషన్ ఆకర్ష్’ నుంచి టీడీపీని కాపాడుకునేందుకు చంద్రబాబు చాలా కష్ట పడ్డారు. అయితే అనుకోకుండా హెలికాఫ్టర్ ప్రమాదంలో వైఎస్ చనిపోవడం, ఆయన తర్వాత రోశయ్య ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారంచేయడం వెంటవెంటనే జరిగిపోయాయి. ఇదే సమయంలో ప్రత్యేక తెలంగాణ కోరుతూ టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. దీంతో 2009 నుంచి 2014వరకు తెలంగాణలో టీడీపీ అనేక ఆటుపోట్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రత్యేక తెలంగాణ కోసమంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం.. ఆయా స్థానాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ డిపాజిట్లను కోల్పోవడంతో కార్యకర్తల్లో గుబులు రేగింది. దీంతో టీడీపీని కాపాడుకోవడం కోసం, ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం చంద్రబాబు కఠిన నిర్ణయం తీసుకున్నారు. 63 ఏళ్ల వయసులో పాదయాత్రకు పూనుకున్నారు. ‘వస్తున్నా మీకోసం’ పేరిట 2012వ సంవత్సరం అక్టోబర్ 2 నుంచి జనవరి 26 2013వరకు నాలుగు నెలల పాటు ఆయన చేపట్టిన పాదయాత్ర దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమయింది. మొత్తం 117 రోజుల్లో 2340 కిలోమీటర్ల పాదయాత్ర చేసి రికార్డు సృష్టించారు. రోజుకు ఎనిమిది గంటల పాటు ఆయన పాదయాత్ర చేశారు. ఈ పాదయాత్ర సమయంలోనే ప్రత్యేక తెలంగాణకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. రెండు రాష్ట్రాల్లో పార్టీని కాపాడుకోవడం కోసం చంద్రబాబు చేపట్టిన పాదయాత్ర విజయవంతమయింది.

2014లో రాష్ట్ర విభజన.. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు టీడీపీ కూడా ప్రత్యేక తెలంగాణకు మద్ధతుగా లేఖను ఇవ్వడంతో అప్పటి కాంగ్రస్ సర్కారు రాష్ట్ర విభజన ప్రక్రియను వేగవతం చేసింది. ప్రత్యేక తెలంగాణను ఇస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఊహించని రీతిలో ఏపీలో సమైఖ్యాంధ్ర ఉద్యమం ఊపందుకుంది. ఓ వైపు ప్రత్యేక తెలంగాణ, మరోవైపు సమైఖ్యాంధ్ర ఉద్యమాలతో తెలుగుదేశం పార్టీ పరిస్థితి తీసికట్టుగా తయారయింది. ఏ నిర్ణయం తీసుకున్నా.. రెండో వైపు పార్టీ భవిష్యత్‌ను ప్రశ్నార్థకమయే పరిస్థితి ఏర్పడింది. దీంతో తనకు రెండు ప్రాంతాలు రెండు కళ్లు వంటివనీ, ఇరు ప్రాంతాలకు న్యాయం చేయాలంటూ ఢిల్లీలో చంద్రబాబు నిరాహార దీక్ష చేపట్టారు. సమన్యాయం చేయాలంటూ తొమ్మిది రోజుల పాటు నిరాహార దీక్ష చేశారు. ఆ తర్వాత 2014లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు వేరువేరుగా ఎన్నికలు జరిగాయి.

ఏపీలో గెలుపు, తెలంగాణలో.. 2014 ఎన్నికల్లో విభజిత ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఘనవిజయం సాధించింది. రాజధాని లేకుండా రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం, లోటు బడ్జెట్‌లో రాష్ట్రం ఉండటం, ఉద్యోగాలు లేక, పరిశ్రమలు లేక, పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాలన్నీ హైదరాబాద్‌లో ఉండిపోవడంతో అనుభవజ్ఞుడయిన చంద్రబాబుకు ఏపీ ప్రజలు పట్టం కట్టారు. ఆ ఎన్నికల్లో ఏపీకి న్యాయం చేస్తామన్న మోదీ హామీ ఇవ్వడంతో బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్లారు. విజయం మీద అతివిశ్వాసంతో ఉన్న జగన్‌కు ఓటర్లు గట్టి షాకిచ్చారు. ఎన్నికలు పూర్తయ్యాక.. ‘తెలంగాణలో నేను.. ఏపీలో జగన్ అధికారంలోకి వస్తాడు.. మేం ఇద్దరం కలిసి మెలిసి రెండు రాష్ట్రాలను అభివృద్ధి చేస్తాం’ అని కేసీఆర్ వ్యాఖ్యానించడం గమనార్హం. 2014 ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసిన టీడీపీకి ఏపీలో 102 సీట్లు రాగా బీజేపీ 5 సీట్లను గెలుచుకుంది. 16మంది ఎంపీ స్థానాలను గెలుచుకుంది. తెలంగాణలో టీడీపీ 15 అసెంబ్లీ, ఒక ఎంపీ స్థానాన్ని గెలుచుకుంది. ఏపీలో అధికారంలోకి వచ్చిన వెంటనే రుణమాఫీ, వృద్ధాప్య పింఛన్‌ను 1000 రూపాయలకు పెంచడం, 24గంటల విద్యుత్, డ్వాక్రా రుణాల మాఫీ.. వంటి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసింది. ఏపీ రాజధాని ‘అమరావతి’ని ఎంపిక చేసి వేలాది ఎకరాల భూమిని రైతుల నుంచి సేకరించింది. దేశంలో ఎక్కడా లేని విధంగా భూ సమీకరణ చేశారు. పోలవరం ముంపు గ్రామాలను ఏపీలో కలిపేవరకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయలేదు. దీంతో పోలవరం ముంపు మండలాలను ఏపీలో కలుపుతూ కేంద్ర సర్కారు ఆర్డినెన్స్ జారీ చేసింది. పోలవరం ప్రాజెక్టుకు లైన్ క్లియర్ చేసింది. ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ ఫుల్ జోష్‌లో ఉండగా.. తెలంగాణలో టీడీపీ ఆటుపోట్లకు గురయింది.

ఒక రాష్ట్రంలో రెండు ప్రాంతీయపార్టీలు ఉండటం తనకు నష్టమేనని టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భావించడంతో.. పెద్ద ఎత్తున ఆపరేషన్ ఆకర్ష్‌కు శ్రీకారం చుట్టారు. తెలంగాణలోని టీడీపీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్‌లో చేర్చుకున్నారు. తుమ్మల నాగేశ్వరరావు వంటి ఓడిపోయిన బలమైన టీడీపీ అభ్యర్థులను పార్టీలోకి రప్పించుకుని మరీ మంత్రి పదవులిచ్చారు. తెలంగాణ వ్యాప్తంగా టీడీపీలోని నాయకులను టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకునేలా చేశారు. రేవంత్ రెడ్డి, సీతక్క వంటినేతలు కొందరు టీఆర్‌ఎస్‌లో ఇమడలేమని కాంగ్రెస్‌లో చేరారు. దీంతో కొంతమంది సీనియర్ నేతలతోనే తెలంగాణలో టీడీపీ ఎదురీదుతోంది. నాయకులు పోయినా.. కార్యకర్తలు తమ పార్టీ వెంటే ఉన్నారని టీడీపీ బలంగా నమ్ముతోంది. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రావడంతో టీడీపీ చరిత్రలో మొట్టమొదటిసారిగా కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంది. అటు ఏపీలోనూ గెలుపుపై నమ్మకంతో ఉంది. తాము చేసిన అభివృద్ధి పనులే తమను గెలిపిస్తాయని టీడీపీ ధీమాతో ఉంది.