ఏఐఎంఐఎం

All India Majlis-e-ittehad-ul Muslimeen

ది ఆలిండియా మజ్లిస్-ఇ-ఉల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) తెలంగాణ కేంద్రంగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ. దీని ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లోని అఘాపురాలో ఉంది. 1927లో నాటి హైదరాబాద్ రాష్ట్ర నిజాం నవాబ్ ఉస్మాన్ అలీఖాన్ సలహా మేరకు నవాబ్ మహమూద్ నవాజ్ ఖాన్ ఖిలేదా ఈ పార్టీని ప్రారంభించారు. ప్రారంభంలో మత, సాంస్కృతిక కార్యకలాపాలను బలోపేతం చేసేందుకు ఈ సంస్థ పనిచేసింది. 1938లో బహదూర్ యార్ జంగ్ అధ్యక్షుడైన తర్వాత ఎంఐఎం రాజకీయ పార్టీగా రూపుదిద్దుకుంది. 1944లో బహదూర్ యార్ జంగ్ మరణానంతరం పార్టీ బాధ్యతలను ఖాసిం రాజ్వీ చేపట్టారు. హైదరాబాద్‌ను భారతదేశంలో విలీనం చేయడాన్ని ఆయన గట్టిగా వ్యతిరేకించారు. స్వతంత్ర హైదరాబాద్ చేజారిపోకుండా కాపాడుకునేందుకు ఖాసిం రాజ్వీ నేతృత్వంలో రజాకార్లు అమాయక ప్రజలు, పేదలపై దారుణ హింసకు, అకృత్యాలకు పాల్పడినట్టు చెబుతారు. హైదరాబాద్ రాష్ట్రం విలీనం తర్వాత ఎంఐఎంపై నిషేధం విధించారు. ఖాసిం రాజ్వీని 1948 నుంచి 1957 వరకు జైల్లో ఉంచారు. తర్వాత ఆయన దేశం విడిచి పాకిస్తాన్ వెళ్లిపోవాలన్న షరతు మీద జైలు నుంచి విడుదల చేశారు.

రాజ్వీ దేశం నుంచి వెళ్లిపోతూ ఎంఐఎం బాధ్యతలను వృత్తిరీత్యా న్యాయవాది అయిన అబ్దుల్ వహేద్ ఒవైసీకి అప్పగించారు. పార్టీ ప్రస్తుత రూపమైన ఆలిండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్-ముస్లిమీన్‌గా మార్చింది ఒవైసీనే. 1975లో పార్టీ బాధ్యతలను సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ చేపట్టారు. ఆయన నాయకత్వంలో ఎంఐఎం పాతనగరంలో బలమైన రాజకీయ పార్టీగా అవతరించింది. 1984 నుంచి హైదరాబాద్ నియోజకవర్గం ఎన్నికల్లోనూ, హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ ఎన్నికల్లోనూ ఆ పార్టీ ఏకఛత్రాధిపత్యం సాధిస్తూ వచ్చింది. 1984లో సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ హైదరాబాద్ నియోజకవర్గం ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. 2004 వరకు ఆయనే ఆ స్థానంలో వరుసగా ఆరుసార్లు గెలిచారు. అంతకుముందు 1962లోనే హైదరాబాద్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1984 నుంచి 2004వరకు వరుసగా ఆరుసార్లు.. ఏకంగా 20 ఏళ్ల పాటు ఎంపీగా గెలుపొందిన సలావుద్దీన్.. కుమారుడు అసదుద్దీన్ ఓవైసీకి మజ్లిస్ పార్టీ బాధ్యతలను అప్పగించి రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకున్నారు. తండ్రి సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న అసదుద్దీన్ ఓవైసీ.. మజ్లిస్ పార్టీని సమర్ధవంతంగా నడిపిస్తున్నారు.

1994లోనే చార్మినార్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంఐఎం తరపున పోటీ చేసి గెలుపొందడంతో అసదుద్దీన్ ఓవైసీ రాజకీయ ప్రస్థానం మొదలయింది. ఆ తర్వాత 1999 ఎన్నికల్లో కూడా అదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తండ్రి రాజకీయాల నుంచి తప్పుకోవడంతో.. జాతీయ రాజకీయాల్లో ఎంఐఎం ప్రాతినిథ్యం ఉండాలన్న భావనతో.. 2004 ఎన్నికల్లో అసదుద్దీన్ ఓవైసీ హైదరాబాద్ ఎంపీగా మొట్టమొదటిసారి పోటీ చేసి.. బీజేపీ అభ్యర్థి సుభాష్ చందర్‌జీపై లక్ష ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆ తర్వాత 2009 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఝాహిద్ అలీ ఖాన్‌పై లక్షా 13వేల 865ఓట్ల మెజారిటీతో, 2014 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి భగవంత్ రావుపై 2లక్షల 2వేల 454 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. బీజేపిని అధికారంలోకి రానివ్వకుండా ఉండటానికి తాము ఎవరితోనైనా కలుస్తామనీ, ఎవరికైనా మద్ధతిస్తామని బహిరంగంగానే అసదుద్దీన్ ఓవైసీ ప్రకటనలు చేస్తుంటారు. తమ పార్టీ హిందువులకు వ్యతిరేకం కాదనీ, హిందుత్వం పేరుతో అరాచకాలు సృష్టించేవారికి మాత్రమే తాము వ్యతిరేకమని చెబుతుంటారు.

2014 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం 7 స్థానాల్లో విజయం సాధించడంతో భారత ఎన్నికల సంఘం ఆ పార్టీకి ‘రాష్ట్ర పార్టీ’ హోదా ఇచ్చింది. హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో ఆ పార్టీకి బలమైన రాజకీయ శక్తిగా గుర్తింపు వచ్చింది. హైదరాబాద్‌లో జరిగిన దాదాపు అన్ని అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆ పార్టీ నిర్ణయాత్మక విజయాలు సాధించింది. దీంతో హైదరాబాద్‌లోని మరో బలమైన పార్టీ ఎంబీటీ మాదిరిగానే ఎంఐఎంను కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముస్లిం ప్రజల గొంతుకగా, ముస్లిం సమాజానికి ప్రతినిధిగా భావిస్తారు. పార్టీ అనుసరించే వ్యూహాలకు క్షేత్ర స్థాయిలో బలమైన మద్దతు ఉన్నప్పటికీ విద్యావంతులు, మేధావి వర్గాల్లో అంతగా ఆసక్తిలేదన్న భావన కూడా ఉంది. అయినప్పటికీ ముస్లిం సమాజపు బలమైన గొంతుకగా ఎంఐఎం కొనసాగుతోంది.

ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ తన సోదరుడు, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ సాయంతో మహారాష్ట్ర, బీహార్, ఉత్తర ప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాలకు కూడా పార్టీని విస్తరించగలిగారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ రెండు స్థానాలను కైవసం చేసుకోవడంతో పాటు, ఔరంగాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో రెండవ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇతర రాష్ట్రాల్లో పార్టీ శాఖలను ఏర్పాటు చేస్తున్నారు. 2015 సంవత్సరంలో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆరుచోట్ల పోటీచేసినా ఒక్క చోట కూడా గెలవలేకపోయారు. 2017లో జరిగిన ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కూడా 38చోట్ల పోటీచేసి 0.2శాతం ఓట్లను గెలుచున్నారు. అయితే ఎన్నికల్లో ఆ పార్టీ విజయ ప్రస్థానం వివాదాలమయంగా మారడంతో పాటు.. ఒవైసీ సోదరులపై హింసను ప్రేరేపించడం, మత విద్వేషాన్ని రెచ్చగొట్టడం వంటి ఆరోపణలతో కేసులు నమోదయ్యాయి. ఇక తెలంగాణలో 2014 ఎన్నికల సందర్భంగా ఎంఐఎం టీఆర్ఎస్‌కు మద్దతు ఇవ్వగా.. ఇప్పటికే అదే సమీకరణాలు కొనసాగుతున్నాయి. పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ, ఆయన సోదరుడు అక్బరుద్దీన్ ఒవైసీ ఇద్దరూ తమ మద్దతు టీఆర్ఎస్‌కేనని పునరుద్ఘాటించారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న ఇతర పార్టీలన్నీ తెలంగాణలో మహాకూటమిగా ఏర్పడడంతో... అధికార కూటమి, ప్రతిపక్ష కూటమి మధ్య గట్టి పోటీ నెలకొంది. ఎంబీటీ, సియాసత్ సంపాదకుడు జాహెద్ అలీ ఖాన్ సహా ఇతర పార్టీలు, ప్రముఖులు సైతం పాతనగరం ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపించనున్నారు. అయినప్పటికీ ఎంఐఎం, టీఆర్ఎస్ నేతలు మాత్రం ప్రజల మద్దతు తమకే ఉందనీ... వచ్చే ఎన్నికల్లో తమ విజయం ఖాయమంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. 2018 డిసెంబర్ 7న జరగనున్న ఎన్నికల్లో పాతబస్తీలో ఎంఐఎం గెలుపు సునాయాసమేనని చెప్పవచ్చు.