ముకేశ్ అంబానీ ఆస్తితో ప్రభుత్వాన్ని 20 రోజులు నడిపేయొచ్చు!
13-02-2018 19:30:57
న్యూఢిల్లీ : ధనవంతులు తమ ఆస్తులను ప్రభుత్వాలకు విరాళం ఇస్తే, ఆ సొమ్ముతో వారి దేశాలను ఎంత కాలం నడపవచ్చు? బ్లూమ్‌బెర్గ్ విడుదల చేసిన నివేదిక ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. 49 దేశాల్లోని రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వాలు, ఖర్చు చేసే విధానాలు, ధనవంతుల సంపద మొదలైన అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ నివేదికను రూపొందించింది. 2017 డిసెంబరునాటికి ఈ దేశాల్లోని అత్యంత ధనికుల సంపదను ప్రభుత్వానికి విరాళమిస్తే, ఒక్కొక్క ధనవంతుడు ఇచ్చిన సంపదతో తన దేశాన్ని ఎన్ని రోజులు నడపే అవకాశం ఉంటుందో బ్లూమ్‌బెర్గ్ వివరించింది. ఈ 49 మంది సంపన్నుల్లో నలుగురు మహిళలు ఉన్నారు. అంగోలా, ఆస్ట్రేలియా, చిలీ, నెదర్లాండ్స్ దేశాల్లో అత్యధిక ధనవంతులు మహిళలు.
 
49 దేశాల్లోని ప్రభుత్వాల ఖజానాలు ఖాళీ అయిపోతే ఏర్పడే పరిస్థితిని అంచనా వేసి రాబిన్ హుడ్ ఇండెక్స్ పేరుతో ఈ నివేదికను రూపొందించారు. ఆ దేశాల్లోని అత్యంత సంపన్నుల సంపదను నగదుగా మార్చి, ఆయా ప్రభుత్వాలకు విరాళం ఇస్తే, ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు మూతపడకుండా ఎన్ని రోజులు కాపాడటం సాధ్యమవుతుందో అంచనా వేశారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్, ప్రభుత్వ వ్యయాలపై ఇంటర్నేషనల్ మానెటరీ ఫండ్ అంచనాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు.
 
ఈ నివేదిక ప్రకారం సైప్రస్‌ సంపన్నుడు జాన్ ఫ్రెడరిక్‌సన్‌ తన సంపదను ప్రభుత్వానికి ఇస్తే 441 రోజులపాటు ప్రభుత్వాన్ని నడపవచ్చు. చైనా సంపన్నుడు జాక్ మా ఆస్తితో ఆ దేశ ప్రభుత్వాన్ని నాలుగు రోజులపాటు నడపవచ్చు. భారతదేశంలోని కుబేరుడు ముఖేశ్ అంబానీ సంపదతో ప్రభుత్వాన్ని 20 రోజులపాటు నడపవచ్చు. అమెరికాకు చెందిన జెఫ్ బిజోస్‌ ఆస్తితో 5 రోజులు, స్పెయిన్ సంపన్నుడు అమాన్సియో ఒర్టెగా సంపదతో 48 రోజులు, ఫ్రాన్స్ సంపన్నుడు బెర్నార్డ్ ఆర్నాల్ట్ ఆస్తితో 15 రోజులు, మెక్సికో సంపన్నుడు కార్లోస్ స్లిమ్ ఆస్తితో 82 రోజులు, హాంగ్‌కాంగ్ సంపన్నుడు లీ-కా షింగ్ సంపదతో 191 రోజులు ఆయా దేశాల ప్రభుత్వాలు నడిచే అవకాశం ఉంది.
Tags : Bloomberg, Mukesh Ambani, INDIA, Robin Hood Index
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.