మీరు పొత్తు పెట్టుకున్నారు... సైనికులు త్యాగం చేస్తున్నారు : రాహుల్ గాంధీ
13-02-2018 18:39:27
న్యూఢిల్లీ : జమ్మూ-కశ్మీరులో సైన్యం ఎదుర్కొంటున్న పరిస్థితులపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ-పీడీపీ అవకాశవాద పొత్తు కుదుర్చుకున్నాయని, భారత సైనికులు రక్తం చిందిస్తూ, మూల్యం చెల్లిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో భద్రత పరిస్థితులను సరిదిద్దేందుకు నిర్ణయాత్మక విధానాన్ని అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని పేర్కొన్నారు.
 
మంగళవారం ఆయన ఇచ్చిన ట్వీట్‌‌లో పాకిస్థాన్‌తో చర్చలు జరపాలని పీడీపీ అంటోందని, బీజేపీ రక్షణ మంత్రి మాత్రం పాకిస్థాన్ తగిన మూల్యం చెల్లిస్తుందంటున్నారని దుయ్యబట్టారు.
 
‘‘1. పాకిస్థాన్‌తో చర్చలు జరగాలని పీడీపీ అంటోంది.
2. పాకిస్థాన్ మూల్యం చెల్లించాలని బీజేపీ రక్షణ మంత్రి అంటున్నారు.
బీజేపీ-పీడీపీ అవకాశవాద పొత్తు, కశ్మీరు విధానం లేకపోవడం కారణంగా మన సైనికులు తమ రక్తంతో మూల్యం చెల్లిస్తున్నారు, మోదీ ఊగిసలాడుతున్నారు’’ - అని రాహుల్ ట్వీట్‌లో పేర్కొన్నారు.
జమ్మూ-కశ్మీరులోని శ్రీనగర్‌లో సోమవారం సీఆర్‌పీఎఫ్ శిబిరంపై ఉగ్రవాదులు దాడి చేశారు. దీనిపై ముఖ్యమంత్రి మెహబూబా స్పందిస్తూ కశ్మీరు సమస్య పరిష్కారం కోసం పాకిస్థాన్‌తో భారత దేశం చర్చలు జరపాలన్నారు.
 
జమ్మూ-కశ్మీరులో బీజేపీ, పీడీపీ కూటమి ప్రభుత్వాన్ని నడుపుతున్న సంగతి తెలిసిందే. బీజేపీ నేత, రక్షణ మంత్రి నిర్మల సీతారామన్ ఇటీవల మాట్లాడుతూ పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని విస్తరిస్తోందని, చొరబాటుదారులకు సహాయపడేందుకు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని, దీనికి ఆ దేశం తగిన మూల్యం చెల్లించుకోవలసి ఉంటుందని అన్నారు.
Tags : Rahul Gandhi, PDP.., BJP, Jammu and Kashmir, Indian army
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.