ఖబడ్దార్ భారత్ : పాకిస్థాన్
13-02-2018 17:49:01
న్యూఢిల్లీ : భారతదేశాన్ని పాకిస్థాన్ గట్టిగా హెచ్చరించింది. దుస్సాహసం చేస్తే గుణపాఠం చెబుతామంది. భారత రక్షణ మంత్రి నిర్మల సీతారామన్ హెచ్చరికలకు స్పందిస్తూ పాకిస్థాన్ ప్రభుత్వం మంగళవారం ఓ ప్రకటనను విడుదల చేసింది.
 
‘‘భారతదేశ దురాక్రమణ, వ్యూహాత్మక తప్పుడు లెక్కలు, దుస్సాహసాలను, అవి ఏ స్థాయిలో, పద్ధతిలో, ఎక్కడ జరుగుతున్నాయనేదానితో సంబంధం లేకుండా, శిక్షించకుండా వదిలిపెట్టేది లేదు. వాటికి అదే స్థాయిలో, అంతకన్నా ఎక్కువ ఘాటుగా బదులిస్తాం’’ అని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖుర్రమ్ దస్తగిర్ ఖాన్ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. పాకిస్థాన్ గడ్డలోని ప్రతి అంగుళాన్నీ కట్టుదిట్టంగా కాపాడుకుంటామన్నారు. ఆధారాలు లేకుండా పాకిస్థాన్‌ను నిందించడం కన్నా పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా ప్రభుత్వం స్పాన్సర్ చేస్తున్న గూఢచర్యానికి సమాధానం చెప్పాలన్నారు. కుల్‌భూషణ్ జాదవ్ రూపంలో సజీవ సాక్ష్యం ప్రపంచం ముందు ఉందన్నారు.
 
జమ్మూ-కశ్మీరులోని సుంజువాన్ సైనిక శిబిరంపై ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో రక్షణ మంత్రి నిర్మల సీతారామన్ సోమవారం మాట్లాడుతూ పాకిస్థాన్‌ను హెచ్చరించారు. ఈ దాడిలో అమరులైన సైనికుల త్యాగాలు నిష్ఫలం కాబోవన్నారు. ఇటువంటి దుస్సాహసానికి పాల్పడిన పాకిస్థాన్ తగిన మూల్యం చెల్లించుకోవలసి ఉంటుందన్నారు.
Tags : Pakistan, Defence Minister, Khurram Dastagir, Nirmala Sitharaman, INDIA
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.