డిగ్గీ రాజా మళ్లీ వస్తున్నారు?
13-02-2018 16:42:00
జబల్‌పూర్: దిగ్విజయ్ సింగ్ మళ్లీ చక్రం తిప్పేందుకు సిద్ధమవుతున్నారా? మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి అభ్యర్థి రేసులో తాను కూడా ఉన్నట్లు సందేశాలు పంపుతున్నారా? తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ఇదే స్పష్టమవుతోంది. మధ్యప్రదేశ్ రాజకీయాల్లో ఒకప్పుడు చక్రం తిప్పిన మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్.. రాష్ట్రాన్ని వీడి.. ప్రస్తుతం జాతీయ కాంగ్రెస్‌లో కీలక పాత్ర పోషిస్తున్నారు. దీంతో ఆయన ఢిల్లీకే పరిమితం అయిపోతారని స్థానిక కాంగ్రెస్ నేతలంతా భావించారు. అయితే త్వరలో మధ్యప్రదేశ్‌లో శాసనసభకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో దిగ్విజయ్ సింగ్ చేసిన తాజా ప్రకటన.. రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. ముఖ్యంగా సీఎం రేసులో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను కలవరానికి గురిచేస్తోంది!
 
దిగ్విజయ్ సింగ్ ప్రస్తుతం ‘నర్మదా పరిక్రమ’ పేరుతో నర్మదా నదీ పరివాహక ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఇది రాజకీయ యాత్ర కానప్పటికీ.. అనధికారికంగా ప్రజలకు చేరువవుతున్నారు. ఈ పర్యటన సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. తన భవిష్యత్ రాజకీయాలపై స్పందించారు. ‘నేను రాజకీయ నాయకుడిని.. నర్మదా పరిక్రమ యాత్ర తరువాత పకోడాలు చేయాల్సిన అవసరం లేదు. రాజకీయాలే చేస్తా’ అని వ్యాఖ్యానించారు.
 
1993 నుంచి 2003 మధ్యకాలంలో దిగ్విజయ్ సింగ్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తరువాత 2003 ఎన్నికల సమయంలో గెలుపుపై పూర్తి విశ్వాసంతో ఉన్న దిగ్విజయ్ సింగ్.. తమ పార్టీ అధికారంలోకి రాకపోతే 10 ఏళ్లపాటు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. అయితే 2003 ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం చవిచూడడం.. ఉమాభారతి సీఎంగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో.. చేసిన ప్రకటన మేరకు దిగ్విజయ్ సింగ్ ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నారు. 2013తో ఆయన చేసిన ప్రకటన పూర్తయినప్పటికీ.. ఆ తరువాత కూడా రాష్ట్ర రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. తాజాగా నర్మదా పరిక్రమ పేరుతో యాత్ర చేపట్టిన దిగ్విజయ్.. మరోసారి మధ్యప్రదేశ్ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు సిద్ధమవుతున్నారు. యాత్ర తరువాత పకోడాలు అమ్ముకోవాల్సిన అవసరం తనకు లేదంటూ దిగ్విజయ్ చేసిన వ్యాఖ్యలు బట్టి.. సీఎం అభ్యర్థి రేసులో తాను కూడా ఉన్నట్లు చెప్పకే చెప్పారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.