సీఎంకు, ఆయన కుమారునికి సుప్రీంకోర్టు క్లీన్‌చిట్
13-02-2018 16:08:03
న్యూఢిల్లీ : ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్, ఆయన తనయుడు అభిషేక్ సింగ్ మంగళవారం భారీ ఊరట పొందారు. పదేళ్ళ క్రితం జరిగిన అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందంలో వారికి ముడుపులు ముట్టాయన్న ఆరోపణల నుంచి వారు విముక్తి పొందారు. ఈ ఒప్పందంలో అక్రమాలు జరిగాయని పిటిషనర్లు చేసిన ఆరోపణలను జస్టిస్ ఆదర్శ్ కే గోయల్, జస్టిస్ ఉదయ్ యూ లలిత్ ధర్మాసనం తోసిపుచ్చింది.
 
స్వరాజ్ అభియాన్ అనే ఎన్‌జీవో, ఇతరులు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను దాఖలు చేశారు. 2006 నుంచి 2008 మధ్య కాలంలో హెలికాప్టర్లను కొనేందుకు అవసరమైనదాని కన్నా ఎక్కువ సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం చెల్లించిందని, ఇది అక్రమమని పిటిషనర్లు ఆరోపించారు. ముఖ్యమంత్రి రమణ్ సింగ్ కుమారుడు అభిషేక్‌కు చెందిన బ్యాంకు ఖాతాకు ఈ సొమ్ము బదిలీ అయిందని, బ్రిటిష్ వర్జిన్ ఐలండ్స్ (యూకే)లోని బ్యాంకులో ఈ ఖాతాలు ఉన్నాయని ఆరోపించారు.
 
దీనిపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. అక్రమాలు జరిగినట్లు సాక్ష్యాధారాలు లేవని తీర్పు చెప్పింది. హెలికాప్టర్‌ను ఎంపిక చేసుకుని, కొనేందుకు ప్రభుత్వానికి అధికారం ఉందని తెలిపింది. హెలికాప్టర్లను తక్కువ ధరకు కొని ఉండవచ్చుననేందుకు కచ్చితమైన సాక్ష్యాధారాలు లేకుండా, ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశ్నించరాదని స్పష్టం చేసింది. మెరుగైన బేరంతో ఎవరూ రాలేదని, షార్ప్ ఓషన్ ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్‌కు కమిషన్ చెల్లించడం వల్ల ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లినట్లు తెలిపే స్పష్టమైన సాక్ష్యాధారమేదీ లేదని, అందువల్ల కోర్టు జోక్యం చేసుకోవడం సమర్థనీయం కాదని వివరించింది. ఈ లావాదేవీలో అభిషేక్ లబ్ధి పొందినట్లు చెప్పేందుకు ప్రాథమికంగా ఎటువంటి ఆధారాలూ లేవని పేర్కొంది.
Tags : Agusta Westland, Supreme Court, Raman Singh, Chhattisgarh
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.