మోహన్ భగవత్ క్షమాపణ చెప్పాల్సిందే : రాహుల్ గాంధీ
13-02-2018 15:29:10
బీదర్ : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) చీఫ్ మోహన్ భగవత్‌పై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి విరుచుకుపడ్డారు. భగవత్ క్షమాపణ చెప్పవలసిందేనని డిమాండ్ చేశారు. ఆయన జవాన్ల త్యాగాలను అవమానించారని ఆరోపించారు. ఇటువంటి వ్యాఖ్యలు చేసినందుకు తక్షణమే క్షమాపణ చెప్పాలని గట్టిగా కోరారు.
 
రాహుల్ గాంధీ కర్ణాటక పర్యటనలో ఉన్నారు. ఆయన ఉత్తర కర్ణాటకలో పర్యటిస్తున్నారు. రోడ్ షోలు, బహిరంగ సభలు నిర్వహిస్తూ, త్వరలో జరిగే శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేస్తున్నారు.
 
రాహుల్‌కు ఆగ్రహం తెప్పించిన భగవత్ వ్యాఖ్యలు ఏమిటంటే, ‘‘సైనికులను సైన్యం అయితే 6-7 నెలల్లో తయారు చేస్తుంది, కానీ సంఘ్ మూడు రోజుల్లోనే తయారు చేస్తుంది. ఇది మన సామర్థ్యం. దేశానికి అలాంటి పరిస్థితి ఏదైనా వస్తే, రాజ్యాంగం అనుమతిస్తే, స్వయం సేవకులు ముందుకు రావడానికి సిద్ధంగా ఉంటారు. అయితే సంఘ్ సైన్యం కాదు, పారామిలిటరీ ఆర్గనైజేషన్ కాదు. కానీ ఇదొక కుటుంబ సంఘం. సైన్యంలాగానే క్రమశిక్షణ పాటిస్తాం. కార్యకర్తలు దేశం కోసం త్యాగం చేయడానికి సంతోషంగా సిద్ధంగా ఉంటారు’’.
 
ఈ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ అంతకుముందు కూడా స్పందించారు. ప్రతి భారతీయుడిని అవమానిస్తూ భగవత్ మాట్లాడారన్నారు. మన దేశం కోసం అమరులైనవారిని అవమానించారన్నారు. ప్రతి సైనికుడు వందనం చేసే జాతీయ జెండాను అవమానించారని ఆరోపించారు. ఇందుకు ఆయన సిగ్గుపడాలన్నారు.
Tags : Rahul Gandhi, Mohan Bhagwat, Rss, Congress
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.