ADVT
మాయ మాటలతో అమ్మాయిలకు వల
13-02-2018 14:12:34
  • గర్భవతులను చేసి వదిలించుకుంటున్న ప్రబుద్ధుడు
  • ఎట్టకేలకు అరెస్టు చేసిన పోలీసులు
అమలాపురం రూరల్(తూర్పు గోదావరి జిల్లా): మాయమాటలు చెప్పి అమ్మాయిలను మోసం చేసే ప్రబుద్ధుడిని పోలీసులు అరెస్టు చేశారు. అల్లవరం మండలం గోడిలంక అంబేద్కర్‌నగర్‌కు చెందిన తాడి రమేష్‌ అలియాస్‌ చందు(21) ఆరో తరగతి వరకు మాత్రమే చదువుకున్నాడు. అమ్మాయిలను మోసం చేయడమే పనిగా పెట్టుకున్నాడు. అతని మాయమాటలకు, మోసపూరిత చర్యలకు ఇప్పటికే ఓ యువతి తొమ్మిది నెలల బిడ్డకు తల్లికాగా, మరో యువతి గర్భం దాల్చింది. మరో ఇద్దరు బాలికలు మోసపోయారు. వారిలో ఓ బాలికకు చెందిన తల్లిదండ్రులు ఫిర్యాదు ఇవ్వడంతో తీగలాగితే డొంకంతా కదిలినట్టుగా రమేష్‌ బాగోతం బయటపడింది.
 
విద్యార్థులే లక్ష్యంగా అత్యాచారాలకు, మోసాలకు పాల్పడుతున్న రమేష్‌ను సోమవారం అమలాపురం తాలూకా ఎస్‌ఐ ఎం.గజేంద్రకుమార్‌ అరెస్టుచేసి కోర్టులో హాజరుపరచగా 15 రోజుల పాటు రిమాండ్‌ విధించారు. ఈ కేసుకు సంబంధించి ఎస్‌ఐ గజేంద్రకుమార్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రమేష్‌ పాఠశాలలు, కళాశాలల గేట్ల వద్ద నిత్యం మాటువేసి కొంతమంది అమ్మాయిలను ఎంపిక చేసుకుని సెల్‌ఫోన్‌ నంబర్లను సేకరిస్తాడు. చదివింది ఆరో తరగతి అయినా డిగ్రీ చదివానని అమ్మాయిల వద్ద కలరింగ్‌ ఇస్తాడు.
 
ప్రస్తుతం ఓ ప్రముఖ కంపెనీలో ఏసీ మెకానిక్‌గా..
పనిచేస్తున్నానని, నెలకు రూ.40 వేలకు పైగా జీతం వస్తుందని అమ్మాయిలను నమ్మిస్తాడు. మాయమాటలు చెప్పి చర్చిలో దండలు మార్చి పెళ్లయిపోయిందని నమ్మించి ఆపై అత్యాచారాలకు పాల్పడతాడు. ఏడాదిన్నర క్రితం రాజమహేంద్రవరానికి చెందిన ఓ యువతిని ఇలానే మోసం చేసినట్లు దర్యాప్తులో తేలింది. ప్రస్తుతం ఆమెకు తొమ్మిదినెలల బిడ్డ ఉన్నాడు. అదేవిధంగా అమలాపురానికి చెందిన మరో యువతిని సైతం పెళ్లి చేసుకోగా ప్రస్తుతం ఆమె గర్భిణి. ఇక ఓడలరేవు, భట్నవిల్లి గ్రామాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులను మోసంచేసి అత్యాచారాలకు పాల్పడినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇన్ని మోసాలకు పాల్పడిన ఇప్పటివరకు తప్పించుకుని తిరిగిన అతడిని ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు.

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.