ADVT
గ్యాస్‌ ట్యాంకర్ల సమ్మె షురూ.. కొరత పెరిగే అవకాశం
13-02-2018 11:30:27
చెన్నై: అద్దె టెండర్ల విధానాన్ని యధాతథంగా కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ దక్షిణమండల గ్యాస్‌ ట్యాంకర్‌ యజమానులు చేపట్టిన సమ్మె ప్రారంభమైంది. ఆదివారం అర్ధరాత్రి నుంచే ఈ సమ్మె ప్రారంభం కావడంతో గ్యాస్‌ ట్యాంకర్లు, లారీలు గోడౌన్లకే పరిమితమయ్యాయి. దక్షిణమండల ఎల్‌పీజీ ట్యాంకర్‌ యజమానుల సంఘ ప్రధానకార్యాలయం నామక్కల్‌లో ఉంది. ఈ సంఘంలో నమోదు చేసుకున్న 4,500 ట్యాంకర్‌ లారీలు దేశవ్యాప్తంగా వున్న గ్యాస్‌ శుద్ధీకరణ కేంద్రాలకు వెళ్లి గ్యాస్‌ నింపుకుని రాష్ట్రానికి వస్తుంటాయి. ఇదిలా ఉండగా, కొత్త అద్దె విధానాన్ని ఇంధన సంస్థలు ప్రవేశపెట్టాయి. ఈ విధానం 2018 సెప్టెంబర్‌ నుంచి 2023 ఆగస్టు నెల వరకు ఐదేళ్లపాటు అమలులో వుంటుందని ఆ సంస్థలు పేర్కొన్నాయి. గతంలో మండలవారీగా టెండర్ల విధానం ఉండేది.
 
   కొత్త విధానంతో ఆయా రాష్ట్రాల్లో పరిధిలో మాత్రమే టెండర్లు కొనసాగే పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో గ్యాస్‌ ట్యాంకర్‌ యజమానులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితులున్నాయి. దీంతో పాత టెండర్‌ విధానాన్నే అమలుచేయాలని కోరుతూ సోమవారం నుంచి ఎల్‌పీజీ ట్యాంకర్‌ యజమానుల సంఘం సమ్మె చేపట్టింది. ఈ సమ్మె కారణంగా తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాలకు నడిపే 4,500 ట్యాంకర్‌ లారీలు గోడౌన్లకే పరిమితమయ్యాయి. ముఖ్యంగా, నామక్కల్‌ ప్రాంతంలో ట్యాంకర్లు బారులుతీరాయి. ఈ సమ్మె కారణంగా వంట గ్యాస్‌ కొరత చోటుచేసుకొనే అవకాశం ఉంది. సమ్మెను ఉధృతం చేసే దిశగా మంగళవారం నుంచి తూర్పు మండలంలో సమ్మె చేపట్టనున్నట్టు సంఘ అధ్యక్షుడు పొన్నాంబళం ప్రకటించారు.

Advertisement

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.