ADVT
కాంగ్రెస్‌ దూకుడు..
13-02-2018 09:13:32
  • సోషల్‌ మీడియాలో అభ్యర్థులు జాబితా హల్‌చల్‌
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)
కాంగ్రెస్‌ కోకిల ముందే కూస్తున్నదా.. అప్పుడే ఆ పార్టీ అధిష్ఠానం 60 మంది అభ్యర్థుల జాబితాను ఖరారుచేసి ఎన్నికల సమరానికి దూకుడు ప్రదర్శిస్తున్నదా.. ఎన్నికల ప్రకటనకు ముందే అభ్యర్థుల పేర్లను ప్రకటించి నియోజకవర్గాల్లో తమ పని తాము చేసుకోమని అభ్యర్థులను ఆదేశిస్తున్నదా అన్న అం శాలపై జిల్లాలో జోరుగా చర్చ ప్రారంభమయింది. ఈ చర్చకంతటికి కాంగ్రెస్‌ పార్టీలో 60 మంది అభ్యర్థుల జాబితాను ఖరారైనట్లే అంటూ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ అవతున్న ఒక వార్తే కారణంగా నిలుస్తున్నది. ఇందులో చాలామంది అభ్యర్థులు గతంలో పోటీచేసిన వారు, సీనియర్‌ నాయకులు కావడంతోపాటు ఇటీవలే కాంగ్రెస్‌ పార్టీలో చేరిన కొందరు నాయకుల పేర్లు కూడా ఇందులో ఉ న్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 60 మంది అభ్యర్థుల ను ఇప్పటికే ఖరారు చేశారంటూ ఆ జాబితా పేర్కొంటుండగా అందులో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా పరిధిలో ఉన్న 13 నియోజకవర్గాల్లో 10 నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లు ఉం డడం గమనార్హం.
 
ఉమ్మడి జిల్లాలోని అభ్యర్థుల పేర్లు
జగిత్యాల నియోజకవర్గం నుంచి ప్రస్తుతం శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్న టి జీవన్‌ రెడ్డి పేరుతోపాటు మంథని నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి డి శ్రీధర్‌బాబు, మానకొండూర్‌ నుంచి పార్టీ మాజీ విప్‌ ఆరె పల్లి మోహన్‌, హుస్నాబాద్‌ నుంచి మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, సిరిసిల్ల నుంచి గతంలో పోటీ చేసి ఓడిపోయిన ప్రముఖ న్యాయవాది కేకే మహేందర్‌రెడ్డి పేర్లు ఉన్నాయి.
  • కరీంనగర్‌ నుంచి గతంలో పోటీ చేసిన చల్మెడ లక్ష్మీనర్సింహారావుతోపాటు కొత్తగా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రేగులపాటి రమ్యారావు అలియాస్‌ పావని పేరు ఉండడం విశేషం.
  •  వేములవాడ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో పోటీచేసిన బొమ్మ వెంకటేశ్వర్లుతోపాటు ఇక్కడ కూడా రమ్యారావు పేరును పేర్కొన్నారు.
  • రామగుండం నుంచి ఠాకూర్‌ మక్కాన్‌సింగ్‌, చొప్పదండి నుంచి మేడిపల్లి సత్యం పే ర్లు ఉన్నాయి. మేడిపల్లి సత్యం ఇటీవలే రేవంత్‌రెడ్డితోపాటు టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరి న సంగతి తెలిసిందే. ఆయన గతంలో ఇదే చొప్పదండి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఆయన టికెట్‌ ఇస్తారన్న హామీతోనే కాంగ్రెస్‌లో చేరారని ఎప్పటినుంచో ప్రచారంలో ఉన్నది.
  • పెద్దపల్లి నియోజకవర్గంలో గండ్ర వెం కటరమణారావు సోషల్‌ మీడియా జాబితాలో ఉంది. ఈ పేరు గల అభ్యర్థి నియోజకవర్గం లో ఎవరు లేరు. వరంగల్‌ జిల్లాలో గండ్ర వెంకటరమణారెడ్డి ఉన్నారు కాని ఆయన ఇక్కడ పోటీచేసే అవకాశం లేదు. ఈ నియోజకవర్గం నుంచి టికెట్‌ ఆశిస్తూ గతంలో టీడీ పీ రెబల్‌గా పోటీచేసి శాసనసభ్యుడిగా గెలుపొంది తిరిగి ఆ పార్టీలోనే చేరిన సీహెచ్‌ విజయరమణారావు గత ఎన్నికల్లో ఓడిపోయారు. ఆయన టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తూ రేవంత్‌రెడ్డితోపాటు కాంగ్రెస్‌లో చే రారు. ఆయనకు కాంగ్రెస్‌ టికెట్‌ ఖాయమని పార్టీలో ప్రచారం జరుగుతోంది. సోషల్‌ మీ డియా జాబితాలో పేర్కొన్న పేరు అయితే విజయరమణారావుదే కావచ్చని భావిస్తున్నా రు. లేని పక్షంలో వరంగల్‌ గండ్ర వెంకటరమణారెడ్డి అయి ఉంటుందని చర్చ జరుగుతోంది.
  • మంత్రి ఈటల రాజేందర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూరాబాద్‌ నియోజకవర్గం, టీఆర్‌ఎస్‌ చీఫ్‌ విప్‌ కొప్పుల ఈశ్వర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మపురి, కోరుట్ల నియోజకవర్గాల్లో మాత్రం ఈ 60 మంది జాబితాలో అభ్యర్థులు ఖరారు కానట్లు తెలుస్తున్నది. హుజూరాబాద్‌ నుంచి టీడీపీ అగ్రనేత ఇను గాల పెద్దిరెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసే అవకాశం ఉన్నదని, ఆయన టీడీపీని వీడి కాంగ్రెస్‌లో చేరే విషయం దాదాపుగా ఖరారైందని ప్రచారం జరుగుతోంది. ఽ
  • దర్మపురి నుంచి మాజీ జిల్లా పరిషత్‌ చైర్మన్‌ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ గతంలో పోటీచేసి ఓడిపోయారు. ఆయనే ఇప్పుడు కూడా అక్కడ కాంగ్రెస్‌ టికెట్‌ ఆశిస్తున్నారు.
  • కోరుట్ల నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా టికె ట్‌ ఆశించిన జువ్వాడి నర్సింగరావు టీఆర్‌ఎస్‌లో చేరడంతో ప్రస్తుతం అక్కడ నుంచి మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు, డాక్టర్‌ జేఎన్‌ వెంకట్‌ కాంగ్రెస్‌ టికెట్‌ ఆశిస్తున్నారు. ఇటీవలే బీజేపీకి రాజీనామా చేసిన డాక్టర్‌ చిట్నేని రాఘవేందర్‌రావు కూడా కాంగ్రెస్‌లో చేరతారని ఆయనకే టికెట్‌ ఖరారవుతుందని నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు.
సగం స్థానాల్లో గెలుపుపై ధీమా
ఇప్పటికే వివిధ సోషల్‌ మీడియా సర్వేల్లో గత ఎన్నికల్లో జగిత్యాల స్థానంలో మాత్రమే గెలుపొందిన కాంగ్రెస్‌ ఈసారి ఆరు లేక ఏడు స్థానాల్లో విజయం సాధించడం ఖాయమని వెల్లడైనట్లు ఆరు నెలలుగా పలు పోస్టింగ్‌లు వెలువడ్డాయి. అందుకు తగ్గట్లుగానే కాంగ్రెస్‌ పార్టీ కూడా కొద్ది రోజులుగా దూకుడును ప్రదర్శిస్తున్నది. ఈ జిల్లాకు రెండుసార్లు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, మాజీ లోక్‌సభ స్పీకర్‌ మీరాకుమార్‌, తదితరులు వచ్చి పర్యటించి వెళ్లడం, డీసీసీ అధ్యక్షుడు మృత్యుంజయం నేతృత్వంలో పలు ఆందోళన కార్యక్రమాలు నెలనెలా నిర్వహించడంతో కార్యకర్తల్లో కూడా ఉత్సాహం కనిపిస్తున్నది. దీంతో ఆ పార్టీ ముందుగా అభ్యర్థుల పేర్లు వెల్లడించినా ఆశ్చర్యం లేదని సోషల్‌ మీడియాలో ప్రస్తుతం ఉన్నది ప్రాథమికంగా ఒక అవగాహనకు రావడానికి ఏర్పాటు చేసుకున్న జాబితా కావచ్చని కూడా చర్చ జరుగుతున్నది. డీసీసీకి అధ్యక్షత వహిస్తూ పార్టీని నిత్యం చర్చల్లో ఉంచేలా చేస్తున్న కటకం మృత్యుంజయం కరీంనగర్‌ నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నా ఆయన పేరు మాత్రం ఈ సోషల్‌ మీడియా జాబితాలో లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.