ADVT
5 వరకూ ఓపిక పడతాం
13-02-2018 02:26:08
  • ఆశతో ఎదురుచూస్తాం.. సహనానికీ ఓ హద్దుంటుంది
  • ఆంధ్రుల ఆత్మగౌరవం దెబ్బతింటే ఏమవుతుందో 1983లో చూశారు
  • బీజేపీపై టీడీపీ నేతల ఆగ్రహం
(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)
‘ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయాన్ని కేంద్రం మార్చి 5లోపు సవరిస్తుందని భావిస్తున్నాం. అప్పటివరకూ ఓపికపడతాం. ఆశతో ఎదురుచూస్తాం’ అని టీడీపీ నేతలు అన్నారు. వారు సోమవారం వేర్వేరు చోట్ల విలేకరులతో మాట్లాడారు. ‘సమర్థుడు, సీనియర్‌ సీఎం అయిన చంద్రబాబు సారథ్యం వహిస్తున్న నవ్యాంధ్రకే అన్యాయం జరిగితే ఇంకెవరికి చెప్పుకోవాలి. విభజన చట్టంలోని అంశాలు అమలు చేయాలని కేంద్రానికి మోకరిల్లాలా?’ అని ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి రాజమహేంద్రవరంలో మండిపడ్డారు. ‘మొదటి నుంచీ మిత్రపక్షంగా ఉన్న టీడీపీకే అన్యాయం జరిగితే ఎన్‌డీఏలోని ఇతర మిత్రపక్షాల సంగతి ఏంటనే ఆలోచన ఆయా పార్టీలకు వచ్చింది. అందుకే ఆయా రాష్ర్టాలతోపాటు వివిధ పార్టీలన్నీ ఏపీకి మద్దతుగా నిలిచాయి.
 
ప్రధాని మోదీ జోక్యం చేసుకుని అన్యాయాన్ని సవరించాలి’ అని తెలిపారు. విభజన చట్టంలో పొందుపరిచిన 19 అంశాలపై కేంద్రం తక్షణం స్పందించాలని.. లేకుంటే కేంద్రానికి తెలుగుదేశం రాం రాం చెప్పడం తథ్యమని మార్కెటింగ్‌ శాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి కడపలో స్పష్టం చేశారు. కేంద్రం తీరు చూస్తుంటే ఐసీయూలో ఉండే పేషంట్‌కు అవుట్‌ పేషంట్‌ వైద్యసేవలందించినట్లు ఉందని ఆయన ఎద్దేవాచేశారు. బడ్జెట్‌లో నిధులు కేటాయించకపోగా తిరిగి టీడీపీపై తప్పుడు ప్రచారం చేయడం బీజేపీ నాయకులకు తగదని ఎక్సైజ్‌ మంత్రి కేఎస్‌ జవహర్‌ ఓ ప్రకటనలో సూచించారు.
 
ఆంధ్రుల ఆత్మగౌరవం దెబ్బతింటే ఏమవుతుందో 1983లో దేశం మొత్తం చూసిందనీ, అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా చూసుకోవాలని హితవు పలికారు. కాగా, సహనానికి కూడా ఓ హద్దు ఉంటుందని, మార్చి 5 నాటికి విభజన హామీలపై కేంద్రం నుంచి స్పష్టమైన కార్యాచరణ రాకుంటే పోరు తీవ్రం చేస్తామని పౌరసరఫరాల మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గుంటూరులో అన్నారు. రాష్ట్ర బీజేపీ నాయకుల లెక్కలు వాస్తవ విరుద్ధంగా ఉన్నాయని అటవీ మంత్రి సిద్ధా రాఘవరావు అన్నారు. ప్రజా సమస్యలు, సంక్షేమంపై ప్రతిపక్ష పాత్ర ఎంతో హుందాగా ఉండాలని.. అయితే ప్రజల దురదృష్టం కొద్దీ ప్రతిపక్ష నేత జగన్‌ నిర్వాకంతో రాష్ట్రంలో టీడీపీయే అధికార పక్షం, ప్రతిపక్ష పాత్రలు పోషించాల్సి వస్తోందని వ్యవసాయ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కడపలో వ్యాఖ్యానించారు.
 
శాసనసభను వదిలి రోడ్డుపై తిరుగుతున్న జగన్‌ కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని చెబుతుంటే.. ఆయనకు లెఫ్ట్‌, రైట్‌గా ఉండే వైసీపీ ఎంపీలు పార్లమెంటులో బడ్జెట్‌ భేషుగ్గా ఉందని కితాబివ్వడం రెండు నాల్కల ధోరణికి నిదర్శనమన్నారు. బడ్జెట్‌పై కేటాయింపుపై జగన్‌ ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని శాసన మండలి చీఫ్‌విప్‌ పయ్యావుల కేశవ్‌ అనంతపురంలో మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరిగినా తొలిరోజు అద్భుతమంటూ జగన్‌ కొనియాడార ని.. తన సొంత పత్రిక లో ప్రధాని మోదీని, ఆర్థిక మంత్రి జైట్లీని కృష్ణార్జునులుగా అభివర్ణించారన్నారు.
 
బడ్జెట్‌లో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని ప్రభుత్వ చీఫ్‌విప్‌ పల్లె రఘునాథరెడ్డి తిరుమలలో ఆవేదన వ్యక్తం చేశారు. విభజన చట్టంలోని హామీలను తు.చ. తప్పకుండా అమలు చేసే మనసు మోదీకి వ్వాలని స్వామిని కోరుకున్నట్లు చెప్పారు. ‘కేంద్రం రాష్ట్రానికి ఇప్పటి వరకు ఏమీ ఇవ్వలేదు. ఏమిచ్చారో చెప్పండి.. దానికి ఆధారాలు చూపండి.. ఊరికే ఇచ్చామని చెబితే సరిపోదు’ అని ఎంపీ కొనకళ్ల నారాయణ అన్నారు. ‘ఉత్తర భారతానికే నిధులన్నీ ఇచ్చేసి దక్షిణ భారతానికి అన్యాయం చేస్తున్నారు. దీనిపై ఎన్టీఆర్‌ ఏనాడో హెచ్చరించారు. మేం దేశం నుంచి విడిపోయే పరిస్థితి తేకండి. దక్షిణ భారతంలోని ఐదు రాష్ర్టాలు ఒక నిర్ణయం తీసుకుంటాయి’ అని ఎంపీ మురళీమోహన్‌ హెచ్చరించారు.
 
ఎన్ని నిధుచ్చారో చెబితే రాజీనామా: వైవీబీ
ఇచ్చిన హామీల ప్రకారం రాష్ర్టానికి కేంద్రం ఎన్ని నిధులిచ్చిందో బీజేపీ నేతలు నిరూపిస్తే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని రాజేంద్ర ప్రసాద్‌ అన్నారు. ప్రజలకు వాస్తవాలు తెలిపేందుకు రాష్ర్టానికి కేంద్రం ఎన్ని నిధులు విదిల్చిందో తాము బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని విజయవాడలో ప్రకటించారు. రాష్ట్రానికి వచ్చిన నిధులపై జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఎలాంటి గందరగోళానికి గురి కావాల్సిన అవసరం లేదని, ప్రతి లెక్కా ప్రభుత్వం వద్ద స్పష్టంగా ఉన్నట్లు తెలిపారు. రాంగోపాల్‌ వర్మ తెలుగుజాతికి పట్టిన చీడ పురుగు అని వ్యాఖ్యానించారు. ఆయన తెలుగువాడిగా ఉండడం తమ ఖర్మ అని ధ్వజమెత్తారు. కాగా, రాష్ట్రానికి నిధులపై ప్రకాశంబ్యారేజీపై బహిరంగచర్చకు సిద్ధమా అని తెలుగునాడు స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌ బీజేపీని సవాల్‌ చేసింది.
 
 

Advertisement

Advertisement

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.