ADVT
నాణ్యమైన షేర్ల కోసం వేట
13-02-2018 00:29:30
సెన్సెక్స్‌ 295 పాయింట్లు అప్‌
 
ముంబై : గత కొన్ని రోజులుగా స్టాక్‌ మార్కెట్‌ గణనీయమైన కరెక్షన్‌ సాధించినందు వల్ల తక్కువ ధరలో అందుబాటులోకి వచ్చిన నాణ్యమైన షేర్ల కొనుగోలుకు ఇన్వెస్టర్లు పరుగులు తీయడంతో సోమవారం స్టాక్‌ ఇండెక్స్‌లు లాభాలబాట పట్టాయి. గత 10 సెషన్లలో ఇండెక్స్‌లు లాభాలతో ముగియడం ఇది రెండోసారి మాత్రమే. అయితే ఆయిల్‌ ధరలు మాత్రం వరుసగా ఆరు రోజుల పతనం అనంతరం పుంజుకున్నాయి. ఫారెక్స్‌ మార్కెట్‌లో రూపాయి కూడా రికవరీ బాట పట్టింది. మొత్తం మీద అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల వార్తలేవీ లేకపోవడంతో పాటు కార్పొరేట్‌ ఫలితలు ఆకర్షణీయంగా ఉండడం, రిటైల్‌ ద్రవ్యోల్బణం కాస్తంత తగ్గుముఖం పట్టవచ్చునన్న ఆశలు మార్కెట్‌లో సానుకూల సెంటిమెంట్‌కు దోహదపడ్డాయి.
 
ఇటీవల విశేషంగా తగ్గిన పవర్‌, రియల్టీ, యంత్రపరికరాలు, బ్యాంకింగ్‌ షేర్లను ఇన్వెస్టర్లు భారీ పరిమాణంలో కొనుగోలు చేశారు. ఈ ఉత్సాహంలో బలంగా ప్రారంభమైన సెన్సెక్స్‌ 34351.34 పాయింట్ల గరిష్ఠ స్థాయి వరకు వెళ్లి చివరికి 294.71 పాయింట్ల లాభంతో 34300.47 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా ఇంట్రాడేలో 10555.50 పాయింట్లను తాకి చివరికి 84.80 పాయింట్ల లాభంతో 10539.75 వద్ద క్లోజయింది.
 
స్టాక్‌ ఎక్స్ఛేంజీల వద్ద ఉన్న సమాచారం ప్రకారం శుక్రవారం దేశీయ ఇన్వెస్టర్లు 588.42 కోట్ల రూపాయల విలువ గల షేర్లను కొనుగోలు చేయగా ఎఫ్‌పిఐలు 1351.70 కోట్ల రూపాయల విలువ గల షేర్లను విక్రయించారు.
 
టాటా గ్రూప్‌ షేర్లు అప్‌
  • మూడో త్రైమాసికంలో ప్రోత్సాహక ఫలితాలందించడంతో టాటా స్టీల్‌ షేరు 4.22 శాతం లాభంతో సెన్సెక్స్‌లో అగ్రగామిగా నిలిచింది. అలాగే క్యు3 ఫలితాలందించిన ఉత్తేజంతో టాటా కమ్యూనికేషన్స్‌ కూడా లాభపడింది. టాటా మోటార్స్‌ లాభాలతో ముగిసింది.
 
  • లాభపడిన ఇతర షేర్లలో ఎల్‌ అండ్‌ టి, యస్‌ బ్యాంక్‌, పవర్‌గ్రిడ్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, హీరోమోటోకార్ప్‌, ఆర్‌ఐఎల్‌, హెచ్‌డిఎఫ్‌సి, మారుతి సుజుకీ, ఔన్‌జిసి, హెచ్‌డిఎ్‌ఫసి బ్యాంక్‌, విప్రో, బజాజ్‌ ఆటో, ఏషియన్‌ పెయింట్స్‌, సన్‌ ఫార్మా ఉన్నాయి.
 
  • అత్యంత నిరుత్సాహపూరిత ఫలితాలు ప్రకటించడంతో ఎస్‌బిఐ భారీగా 2.67 శాతం నష్టపోయింది.
 
ఐడియా రూ.3250 కోట్ల సమీకరణ
ప్రమోటర్‌ గ్రూప్‌ కంపెనీలకు 32.6 కోట్ల షేర్లను కేటాయించి 3,250 కోట్ల రూపాయలు సమీకరించినట్టు ఐడియాసెల్యులార్‌ ప్రకటించింది. ఒక్కో షేరు 99.50 రూపాయల ధరకు (89.50 రూపాయల ప్రీమియం ధర కలిపి) 32,66,33,165 ఈక్విటీ షేర్లను కేటాయించినట్లు ఆ ప్రకటనలో తెలిపింది. జనవరి నాలుగో తేదీన డైరెక్టర్ల బోర్డు ఈ ప్రిఫరెన్షియల్‌ షేర్ల కేటాయింపునకు ఆమోదం తెలిపింది.
 
జైప్రకాశ్‌ అసోసియేట్స్‌ నుంచి ఐడిబిఐ నామినీ రాజీనామా
రుణభారంతో కుంగుతున్న జైప్రకాశ్‌ అసోసియేట్స్‌ డైరెక్టర్ల బోర్డు నుంచి తమ నామినీని ఉపసంహరిస్తున్నట్టు ఐడిబిఐ బ్యాంకు ప్రకటించింది. తమ బోర్డులోని ఐడిబిఐ జనరల్‌ మేనేజర్‌ సుబ్రత్‌ కుమార్‌ మహాపాత్రా రాజీనామా చేశారని, ఇది తక్షణం అమలులోకి వచ్చిందని జైప్రకాశ్‌ తెలిపింది.
 
ఐపిఒకు ఇండోస్టార్‌ క్యాపిటల్‌
నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీ ఇండోస్టార్‌ క్యాపిటల్‌ ఫైనాన్స్‌ 2,000 కోట్ల రూపాయల సమీకరణ లక్ష్యంతో పబ్లిక్‌ ఇష్యూ జారీ చేయడానికి అనుమతి కోరుతూ సెబికి దరఖాస్తు చేసింది. కంపెనీలో ప్రస్తుత షేర్‌హోల్డర్లు ఈ ఇష్యూలో భాగంగా రెండు కోట్ల షేర్లు విక్రయిస్తారని ఆ దరఖాస్తులో తెలిపింది. ఈ ఇష్యూ ద్వారా సమీకరించే నిధులను తమ మూలధన పటిష్ఠతకు ఉపయోగించుకుంటామని పేర్కొంది.

Advertisement

Advertisement

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.