మాల్యాకు మరో ఎదురుదెబ్బ
12-02-2018 23:43:56
బిఒసితో కేసులో కింగ్‌ఫిషర్‌కు వ్యతిరేక తీర్పు
రూ.585 కోట్ల పరిహారం చెల్లించాలని ఆదేశం
 
లండన్‌/సింగపూర్‌: లిక్కర్‌ కింగ్‌ విజయ్‌మాల్యా.. కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌కు సంబంధించి మరో కేసు ఓడిపోయారు. విమానాలు అద్దెకిచ్చే సింగపూరు సంస్థ బిఒసి ఏవియేషన్‌తో కేసులో కింగ్‌ఫిషర్‌కు వ్యతిరేకంగా లండన్‌ హైకోర్టు తీర్పునిచ్చింది. బిఒసికి నష్టపరిహారం కింద 9 కోట్ల డాలర్ల (దాదాపు రూ.585 కోట్లు) చెల్లించాలని కోర్టు న్యాయమూర్తి పికెన్‌ ఆదేశించారు. కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. బిఒసి ఏవియేషన్‌ నుంచి నాలుగు విమానాలను లీజుకు తీసుకునేందుకు కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ గతంలో అగ్రిమెంట్‌ కుదుర్చుకుంది. ఒప్పందం ప్రకారంగా మూడు విమానాలను అందించిన బిఒసి ఏవియేషన్‌.. అడ్వాన్స్‌ సొమ్ము పూర్తిగా చెల్లించని కారణంగా నాలుగో విమాన సరఫరాను నిలిపివేసింది. కింగ్‌ఫిషర్‌ ఎంతకూ బకాయిలు చెల్లించకపోవడంతో బిఒసి లండన్‌ హైకోర్టును ఆశ్రయించింది. కేసును విచారించిన జస్టిస్‌ పికెన్‌.. బకాయిపడ్డ సొమ్ముతో(వడ్డీతో సహా)పాటు బిఒసి న్యాయపోరాటానికైన ఖర్చులను కూడా చెల్లించాలని కింగ్‌ఫిషర్‌ను ఆదేశించారు. బకాయిలు, వడ్డీ, న్యాయ ఖర్చులన్నీ కలిపితే 9 కోట్ల డాలర్లవుతుంది.
 
దేశీయ బ్యాంకులకు రూ.9 వేల కోట్ల వరకు ఎగవేసిన 62 ఏళ్ల మాల్యా.. ప్రస్తుతం లండన్‌లో తలదాచుకుంటున్నారు. రుణ బకాయిలకు సంబంధించి పలు కోర్టులు ఆయనను ఘోషితాపరాధిగా కూడా ప్రకటించాయి. ఈ కేసుల్లో విచారణ పూర్తి చేసేందుకు వీలుగా మాల్యాను తిరిగి భారత్‌కు పంపించాలని మన విదేశాంగ మంత్రిత్వ శాఖ బ్రిటన్‌ సర్కారును కోరింది. ప్రస్తుతం లండన్‌లోని వెస్ట్‌ మినిస్టర్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో ఇందుకు సంబంధించిన కేసుపై విచారణ సాగుతోంది. వచ్చేనెల 16న జరగనున్న తుది విచారణ ఆధారంగా మే నెలలో కోర్టు తీర్పు వెల్లడించే అవకాశం ఉంది. ఈ కేసులో 6.5 లక్షల పౌండ్ల పూచీకత్తుపై మాల్యాకు కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.