పే చెయ్యడానికి పలు మార్గాలు
11-02-2018 22:54:18
ఒకప్పుడు ఎవరికైనా నగదు పంపించాలంటే చాల ఇబ్బంది పడాల్సి వచ్చేది. డిజిటల్‌ చెల్లింపులు అందుబాటులోకి వచ్చాక, అందులోనూ ముఖ్యంగా ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌ వచ్చాక పరిస్థితి చాలా సులభతరం అయిపోయింది.
 
ఎలక్ట్రానిక్ ఫండ్‌ ట్రాన్స్‌ఫర్‌
దేశంలోని అన్ని ప్రైవేట్‌, పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంకులు ఎలకా్ట్రనిక్‌ ఫండ్‌ ట్రాన్స్‌ఫర్‌ సదుపాయాన్ని అందిస్తున్నాయి. దీనిలో ప్రధానంగా నెఫ్ట్‌, ఆర్టిజిఎస్‌, ఐయంపిస్‌ అనేవి అంతర్భాగంగా ఉంటాయి. క్షణాల్లో ఏదైనా అకౌంట్‌కి నగదుని పంపించాలంటే ఐయంపిస్‌ సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ పద్ధతి ద్వారా గరిష్టంగా 50 వేల వరకూ అవతల వారికి ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవచ్చు. అయితే దీన్ని వాడాలంటే ముందుగా అవతలి వారి అకౌంట్‌ని బెనిఫీషియరీగా రిజిస్టర్‌ చేసుకోవలసి ఉంటుంది. మొబైల్‌ బ్యాంకింగ్‌ని ఏక్టివేట్‌ చేసుకున్న వారికి మాత్రమే ఈ ఐయంపిస్‌ లభిస్తుంది. ఏటియం, మొబైల్‌, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా ఈ ఐయంపిఎస్‌ లావాదేవీలను పూర్తి చేసుకోవచ్చు.
 
నెఫ్ట్‌ పద్ధతిలో
ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌లో చాల మందికి సుపరిచితమైన పద్ధతి ‘నెఫ్ట్‌’. ఈ పద్ధతి ద్వారా గరిష్టంగా 10 లక్షల రూపాయల వరకు నగదు బదిలీ చేసుకోవచ్చు. రోజు మొత్తం మీద 12 టైమ్‌ స్లాట్లుగా విభజించబడి బెనిఫీషియరీ అకౌంట్లోకి అమౌంట్‌ ట్రాన్స్‌ఫర్‌ అవుతుంది. రాత్రి సమయాల్లోనూ, పబ్లిక్‌ హాలిడేస్‌ రోజుల్లోనూ నెఫ్ట్‌ ద్వారా పంపించే నగదు తదుపరి వర్కింగ్‌ డే ప్రాసెస్‌ చేయబడుతుంది.
 
భారీ చెల్లింపులకి
భారీ మొత్తంలో ఒక అకౌంటు నుండి మరో అకౌంటుకి నగదు పంపించవలసిన వ్యాపార సంస్థలు, ఇతరత్రా అవసరాలకు ఆర్‌టిజిఎస్‌ అనుకూలంగా ఉంటుంది. నెఫ్ట్‌ మాదిరిగానే ఇది కూడా ఆదివారాలు, పబ్లిక్‌ హాలిడేస్‌లో పనిచేయదు. ఎవరుబడితే వారు ఆర్‌టిజిఎస్‌ వాడడానికి వీలుపడదు. కనీసం రెండు లక్షల రూపాయలకు మించిన లావాదేవీలు మాత్రమే ఆర్‌టిజిఎస్‌ ద్వారా చేసుకునే అవకాశముంది.
 
ప్లాస్టిక్‌ మనీ ద్వారా
డెబిట్‌ కార్డులు, క్రెడిట్‌ కార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. అయితే ఒకరి నుండి మరొకరికి నగదు బదిలీ కన్నా బిల్లు చెల్లింపులు, ఆన్‌లైన్‌ కొనుగోళ్లు, ఇతర పేమెంట్‌ అవసరాలకు ఈ మాధ్యమం ఎక్కువగా వినియోగింపబడుతూ ఉంటుంది. కార్డు లావాదేవీలకు మర్చంట్‌ నుండి వీసా, మాస్టర్‌ కార్డ్‌ వంటి సంస్థలు ప్రతి లావాదేవీకి కొద్ది మొత్తంలో రుసుము వసూలు చేస్తుంటాయి.
 
యుపిఐ మరింత సరళతరం
సామాన్యులు నగదు చెల్లింపుల విషయంలో ఎదుర్కుంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా సంస్థ ద్వారా గత ఏడాది ప్రవేశపెట్టిన సరికొత్త పేమెంట్‌ పద్ధతే.. ‘యుపిఐ’. యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ అనే పదానికి సంక్షిప్త రూపమే ఇది. ఒక వ్యక్తి నుండి మరో వ్యక్తికి ఎంత సులభంగా మెయిల్స్‌ పంపించుకోవడం సాధ్యపడుతుందో అంత సులువుగా నగదు బదిలీని కూడా సరళతరం చేయడం కోసం ఇది తీసుకు రాబడింది. యుపిఐ పద్ధతిలో వివిధ బ్యాంకులు స్వంతంగా యుపిఐ ఆధారిత అప్లికేషన్లను కలిగి ఉండొచ్చు, అలాగే ఇతర బ్యాంకుల సహకారంతో ఎవరైనా అప్లికేషన్లని ప్రవేశపెట్టవచ్చు. సరిగ్గా ఈ విధంగానే ఫ్లిప్‌కార్ట్‌ సంస్థ ఫోన్‌ పే యాప్‌నీ, గూగుల్‌ సంస్థ తేజ్‌ యాప్‌నీ, తాజాగా వాట్సప్‌ సంస్థ వాట్సప్‌ పేమెంట్స్‌ సదుపాయాన్ని తీసుకురావడం జరిగింది. వీటన్నిటితోపాటు భారత ప్రభుత్వం స్వయంగా విడుదల చేసిన భీమ్‌ యాప్‌ కూడా ఉంది.
 
యుపిఐ ద్వారా గరిష్టంగా లక్ష రూపాయల వరకూ ఒక అకౌంట్‌ నుండి మరో ఎకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవచ్చు. కొన్ని బ్యాంకులు వాటికి నచ్చినట్లుగా రోజువారీ పరిమితిని విధించవచ్చు. ఈ యుపిఐ సదుపాయాన్ని వినియోగించుకోవాలంటే మన ఫోన్లో ఏదైనా యుపిఐ యాప్‌ని ఇన్‌స్టాల్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనకు ఏ బ్యాంకులో అయితే అకౌంటు ఉందో ఆ బ్యాంకుని ఎంపిక చేసుకొని మన అకౌంట్‌ని వెరిఫై చేసుకుని.. చివరిగా ఓ మెయిల్‌ ఐడీ తరహాలో మనకోసం ఓ యుపిఐ ఐడీని క్రియేట్‌ చేసుకోవాలి. ఇకపై ఆ ఐడి నుండి ఇతరుల ఐడిలకు నగదు పంపించుకోవచ్చు. అవతల వారి నుండి మీ ఐడీకి రిసీవ్‌ చేసుకోవచ్చు.
 
వాట్సప్‌ పేమెంట్స్‌
ఇప్పటివరకూ యుపిఐ పద్ధతి ‘ఫోన్‌పే, గూగుల్‌ తేజ్‌’ వంటి రకరకాల యాప్స్‌లో అందుబాటులో ఉన్నా తాజాగా ప్రవేశపెట్టబడిన వాట్సప్‌ పేమెంట్స్‌ ద్వారా అది భారీ స్థాయిలో వినియోగించుకోబడే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా వాట్సప్‌ని కోట్లాదిమంది వాడుతున్న నేపథ్యంలో ఫోటోలు వీడియోలు పంపించినంత సులభంగా ఈ వాట్సప్‌ పేమెంట్స్‌ ద్వారా అవతలి వారికి నగదు పంపించడం సాధ్య పడుతుంది కాబట్టి ఇకపై ఎవరికైనా డబ్బు పంపాలంటే ఈ పద్ధతిని ఎక్కువమంది వినియోగించుకునే అవకాశం ఉంది.
 
మొబైల్‌ వాలెట్లు
పేటీయం, మొబిక్విక్‌ వంటి మొబైల్‌ వాలెట్‌లు కూడా సుదీర్ఘకాలంగా ఒకరి నుండి మరొకరికి నగదు ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవడానికి వినియోగించబడుతున్నాయి. షాపింగ్‌ మాల్స్‌, రెస్టారెంట్లు, సినిమా థియేటర్లు, కిరాణా షాపులు వంటి రకరకాల ప్రదేశాల్లో పేటీయం వంటివి క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసి సులభంగా చెల్లింపులు జరుపుకునే విధంగా వెసులుబాటు కల్పిస్తున్నాయి. పేటీయం, ఎయిర్‌టెల్‌ వంటి సంస్థలు పేమెంట్‌ బ్యాంకులు కూడా మొదలు పెట్టడం మనకు తెలిసిందే. ఆయా పేమెంట్‌ బ్యాంకు అకౌంట్లలో డిపాజిట్‌ చేసిన మొత్తానికి వడ్డీ కూడా ఇవ్వబడుతుంది.
వీటితో పాటు శాంసంగ్‌ పే, యాపిల్‌ పే, ఆండ్రాయిడ్‌ పే వంటివి కూడా ఇప్పుడు దాదాపు ప్రతీ ఫోన్లోనూ లభిస్తున్నాయి. చేతిలో నగదు తీసుకెళ్లకపోయినా రోజులు గడిచిపోతాయనడంలో సందేహమే లేదు.
 
శాంసంగ్‌, యాపిల్‌, ఆండ్రాయిడ్‌ పే..
ఎన్ని పేమెంట్‌ పద్ధతులు అందుబాటులో ఉన్నా ఇప్పటికీ చాలామందికి తమ పర్సులో నుండి డెబిట్‌ కార్డ్‌, క్రెడిట్‌ కార్డులను బయటకు తీసి స్వైపింగ్‌ మిషన్‌ దగ్గర స్వైప్‌ చేస్తే గానీ సంతృప్తి ఉండదు. అయితే ఇలా ఫిజికల్‌గా డెబిట్‌, క్రెడిట్‌ కార్డులను బయటకు తీసుకు వెళ్లడం వలన అవి స్కిమ్మింగ్‌ చెయ్యబడే ప్రమాదాలున్నాయి, కార్డు ఎక్కడో పెట్టి మర్చిపోవడం, లేదా చోరీ కావడం జరగొచ్చు. ఇలాంటి ఇబ్బందులేమీ లేకుండా కొన్ని శక్తివంతమైన శాంసంగ్‌ ఫోన్లు వాడుతున్న వారికి శాంసంగ్‌ పే అనే సౌకర్యం లభిస్తోంది. ఒక్కసారి మన డెబిట్‌, క్రెడిట్‌ కార్డులను దానిలో వర్చ్యువల్‌గా కాన్ఫిగర్‌ చేశాక ఇకపై ఆయా కార్డులను మనం ఎక్కడికీ తీసుకెళ్లనవసరం లేదు. స్వైపింగ్‌ మిషన్‌కి మన ఫోన్‌ని టచ్‌ చేసి ఫింగర్‌ప్రింట్‌లో ఆ లావాదేవీని అథంటికేట్‌ చేస్తే సరిపోతుంది. ఆండ్రాయిడ్‌ ఫోన్ల కోసం గూగుల్‌ సంస్థ తీసుకువచ్చిన ఆండ్రాయిడ్‌ పే, అలాగే యాపిల్‌ ఫోన్ల కోసం ప్రవేశపెట్టబడిన యాపిల్‌పే వంటివి కూడా ఇంచుమించుగా ఇదే విధంగా పనిచేస్తాయి.
నల్లమోతు శ్రీధర్‌
fb.com/nallamothusridhar
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.